నవతెలంగాణ-హైదరాబాద్ : భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నిన్నటి నుంచి అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్న ప్రజలందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయితే ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్ తదితర ప్రాంతాలకు కుటుంబ సమేతంగా లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలు తీవ్రంగా మందగించాయని, ఫలితంగా నిమజ్జన ప్రక్రియ కాస్త ఆలస్యమైందని వివరించారు. ఈ శోభాయాత్ర శనివారం మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశమున్నందున, విగ్రహాల నిమజ్జనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి పోలీస్, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారని వెల్లడించారు.
శోభాయాత్ర పొడిగింపు నేపథ్యంలో నగరంలోని ప్రధాన మార్గాల్లో విధించిన ట్రాఫిక్ ఆంక్షలను నేడు కూడా కొనసాగిస్తున్నట్లు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసర ప్రాంతాల్లో విగ్రహాల రద్దీ అధికంగా ఉన్నందున సాధారణ వాహనాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదని తేల్చిచెప్పారు. కాబట్టి నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన రహదారులపైకి వాహనాలతో వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడవద్దని సూచిస్తూ, ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు జారీ చేసే అధికారిక ట్రాఫిక్ అడ్వైజరీలను గమనిస్తూ పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.







కామెంట్‌లు (0)