11 మంది డెమొక్రాట్లు డుమ్మా.. ఐక్యంగా నిలిచిన రిపబ్లికన్ సభ్యులు
న్యాయ కమిటీకి నివేదనతో అటకెక్కిన తీర్మానం
వాషింగ్టన్ : కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రకటించారన్న ఆరోపణతో రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్‌ను అభిశంసించేందుకు చేసిన ప్రయత్నం అమెరికా ప్రతినిధిసభలో విఫలమైంది. అభిశంసన తీర్మానాలను ఓ కమిటీకి పంపేందుకు మెజారిటీ సభ్యులు అంగీకరించారు. దీంతో రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు థామస్ మస్సీ ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ప్రస్తుతానికి నిలిచిపోయింది. తనను అభిశం సించేందుకు చేసిన ప్రయత్నాన్ని ఒక ప్రహసనంగా, విధ్వంసంగా హెగ్‌సేథ్ అభివర్ణించారు. తీర్మానాన్ని న్యాయ కమిటీకి పంపడాన్ని వ్యతిరేకించిన ఏకైక రిపబ్లికన్ మస్సీయే. ఓటింగ్‌కు 11 మంది డెమొక్రాట్లు గైర్హాజరు కావడం, మస్సీ మినహా మిగిలిన రిపబ్లికన్ సభ్యులందరూ అభిశంసనను వ్యతిరేకించడంతో తీర్మానం 211 - 204 ఓట్లతో వీగిపోయింది.
కాంగ్రెస్‌కు సమయమేది ?
తీర్మానాన్ని కమిటీకి పంపాలని తీసుకున్న నిర్ణయం అభిశంసన యత్నాన్ని నీరుకార్చింది. ఎందుకంటే డెమొక్రాట్లు జనవరిలో అధికారాన్ని చేపడతారు. కాబట్టి అభిశంసన ప్రక్రియను ముందుకు తీసుకొని పోవడానికి ప్రస్తుత కాంగ్రెస్‌కు ఇప్పుడు చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. అభిశంసన యత్నాలకు బ్రేక్ వేస్తూ ప్రతినిధిసభ తీసుకున్న నిర్ణయాన్ని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. వారి ప్రయత్నం ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానించారు. ‘వెనిజులా, ఇరాన్‌లో సాధించిన విజయాలు అమెరికా సైనిక చరిత్రలోనే అత్యుత్తమమైనవి. అవి మునుపెన్నడూ చూడని స్ఫూర్తిని అందించాయి. ఓ గొప్ప దేశభక్తుడి నిర్దోషిత్వానికి ఆ విజయాలు సూచికలు’ అంటూ హెగ్‌సేథ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రతినిధిసభ ఓటింగ్‌పై మస్సీ మాట్లాడుతూ తానేమీ ఆశ్చర్యపోలేదని, అయితే నిరాశ చెందానని చెప్పారు. ప్రజలకు ఏమి చేయాలో కాంగ్రెస్ సభ్యులకు తెలుసునని, తమకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చినప్పటికీ ఆ పని చేయడానికి వారు ముందుకు రావడం లేదని అన్నారు.
ఇక వచ్చే ఏడాదిలోనే...
తన ప్రయత్నం ఇప్పటికిప్పుడు సఫలం కాబోదని మస్సీ గతంలోనే అంగీకరించారు. అయితే డెమొక్రాట్లు సొంతగా అభిశంసన ప్రయత్నాలు చేయడానికి ముందే హెగ్‌సేథ్‌ను తొలగించేందుకు ట్రంప్‌కు అది ఉపకరిస్తుందని చెప్పారు. రిపబ్లికన్లు అధికారంలో ఉండగానే హెగ్‌సేథ్‌ను తొలగిస్తే ఆయన స్థానంలో మరొకరిని ఆమోదించడానికి సెనెట్‌కు సమయం లభిస్తుందని తెలిపారు. కాగా అభిశంసన తీర్మానాలను కాంగ్రెస్ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగించవచ్చు. అంటే వచ్చే సంవత్సరం డెమొక్రాట్లు ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లోని ఉభయసభలపై డెమొక్రాట్లకు జనవరిలో కానీ నియంత్రణ లభించదు.
అభిశంసన ప్రక్రియ ఇలా...
అమెరికాలో అభిశంసన ప్రక్రియ సుదీర్ఘంగానే నడుస్తుంది. అభిశంసనలోని ఆర్టికల్స్‌పై ప్రతినిధిసభలో ముందుగా చర్చ జరుగుతుంది. సగం మంది సభ్యులు లేదా అంతకంటే తక్కువ మంది సభ్యులు అభిశంసనకు మద్దతు తెలిపితే ఆ ప్రక్రియ విఫలమవుతుంది. సగం మంది కంటే ఎక్కువ మంది సభ్యులు అభిశంసనను సమర్ధిస్తే సంబంధిత వ్యక్తిని అభిశంసించి, సెనెట్‌లో విచారణ ప్రారంభిస్తారు. అభిశంసన తీర్మానం నెగ్గాలంటే సెనెట్‌లో మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. అప్పుడే సదరు వ్యక్తిని బాధ్యతల నుంచి తప్పిస్తారు.






కామెంట్‌లు (0)