25కు పైగా దేశాల్లో వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు, యువత, కార్మికులు
పలు డిమాండ్లతో కదం తొక్కిన నిరసనకారులు
విద్యా సంస్థల బహిష్కరణ ఉపాధి అవకాశాలపై ఆందోళన
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రజానీకం
నవతెలంగాణ - జనరల్ డెస్క్
యూరప్‌లోని ఇరవై ఐదుకు పైగా దేశాల్లో శుక్రవారం విద్యార్థులు, యువ కార్మికులు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇటీవలి సంవత్సరాలలో యూరప్‌లో జరిగిన అతి పెద్ద సమన్వయ యువజన ఉద్యమంగా దీనిని పిలవవచ్చు. ‘ఫైట్ ఫర్ అవర్ ఫ్యూచర్, నాట్ దెయిర్ వార్స్’ అనే నినాదంతో ఈ ప్రదర్శనలు జరిగాయి. యూత్ స్ట్రయిక్ కొయలిషన్ ఆధ్వర్యంలో యాభైకి పైగా యువజన, విద్యార్థి సంఘాలు ఈ అంతర్జాతీయ నిరసనలకు పిలుపు ఇచ్చాయి. పెరుగుతున్న జీవనవ్యయం, నివాస సంక్షోభం కారణంగా యూరప్ అంతటా నివాసాల అద్దెలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో ప్రజలు... ముఖ్యంగా యువత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. నిర్బంధ సైనిక శిక్షణ భయంతో నిరసనకారులు కార్డ్బోర్డ్ ట్యాంక్ నమూనాలను దహనం చేశారు. విశ్వ విద్యాలయాలలో ట్యూషన్ ఫీజుల పెంపుదలను నిలిపివేయాలని, పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వ నిధులు పెంచాలని యూరప్‌లోని పలు దేశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని యువత ఆందోళన వ్యక్తం చేసింది. గాజా యుద్ధంలో ప్రభుత్వాల వైఖరిని, నియంత్రణ లేని కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా భవిష్యత్తులో ఉద్యోగాలకు పొంచి ఉన్న ముప్పును కూడా ఆందోళనకారులు ఎత్తిచూపారు.
యూరప్ వ్యాప్తంగా నిరసనలు
ఇటలీలోని కార్మిక సంఘాలు విద్యార్థులకు మద్దతుగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరిపాయి. సమ్మె కారణంగా రవాణా, పాఠశాల సేవలు స్తంభించాయి. రోమ్ నగరంలో
వేలాది మంది విద్యార్థులు విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్, బెర్లిన్ నగరాలలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాఠశాలలు, కళాశాలల తరగతులను బహిష్కరించి వీధులలోకి వచ్చారు. తమ ప్రభుత్వం అత్యంత వేగంగా ఆయుధాలను కొనుగోలు చేస్తోందని, విద్యా రంగంలో మౌలిక సదుపాయాలను గురించి మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. బ్రిటన్‌లోని 350కి పైగా పాఠశాలల విద్యార్థులు తరగతులను బహిష్కరించి సమ్మెలో భాగస్వాములయ్యారు. ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాలలో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. మాడ్రిడ్, పారిస్, బ్రస్సెల్స్, ఏథెన్స్, జాగ్రెట్ వంటి ప్రధాన నగరాలలో ప్లకార్డులు చేత పట్టుకొని విద్యార్థులు ర్యాలీలు తీశారు. కొన్ని చోట్ల నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రభుత్వాల వైఫల్యంపై గళం విప్పిన జెన్-జడ్
వెంటాడుతున్న నిరుద్యోగ సమస్య, వాతావరణ సంక్షోభం, అనియంత్రిత కృత్రిమ మేధ వంటి సమస్యల నుంచి భవిష్యత్తును కాపాడుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని జెన్-జడ్ నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో యువత ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది కాలంలో జెన్ జడ్ తరం వారి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఐరోపా, గ్లోబల్ సౌత్, అమెరికా ఖండంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. ఉద్యమాలు ఊపందుకుంటున్న కొద్దీ ఆందోళనకారుల డిమాండ్లు మారుతున్నాయి. ఆయా దేశాలలో పరిస్థితులను బట్టి డిమాండ్లలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేటి యువతరం కోవిడ్ మహమ్మారిని, వాతావరణ మార్పులను, గాజా, సూడాన్, ఇరాన్లలో జరిగిన యుద్ధాలను చూస్తూ వచ్చింది. పెరుగుతున్న సైనిక వ్యయం కారణంగా వివిధ ప్రభుత్వాలు ప్రజా సేవలకు నిధులు తగ్గిస్తుండడంతో తమ భవిష్యత్తు ప్రమాదంలో పడవచ్చునని యువత ఆందోళన చెందుతోంది. జర్మనీ, ఇటలీ, బ్రిటన్ ప్రభుత్వాలు యువతకు నిర్బంధ సైనిక శిక్షణ ఇస్తుండడం కూడా యువతను కలవరపరుస్తోంది.







కామెంట్లు (0)