లాంఛనప్రాయంగా హక్కులను గుర్తించినంత మాత్రాన సరిపోదు :ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రసంగంలో జస్టిస్ నాగరత్న
ఆక్స్ఫర్డ్ : న్యాయవాద వృత్తిలో లింగ సమానత్వం ప్రవేశానికి పరిమితం కాకుండా వృత్తిపరమైన పురోగతి, వ్యవస్థాగతమైన నాయకత్వం వరకూ విస్తరించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న అన్నారు. సమానత్వం అంటే లాంఛనప్రాయంగా హక్కులను గుర్తించినంత మాత్రాన సరిపోదని, వాస్తవిక సమానత్వం కావాలని ఆమె నొక్కి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే, న్యాయ సహాయం అందించే సంస్థలతో సహా ప్రభుత్వ న్యాయ సహాయ ప్యానెళ్లలో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని ఆమె అన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో ఈ నెల 18న కార్నెలియా సొరాబ్జి స్మారకోపన్యాసాన్ని జస్టిస్ నాగరత్న చేశారు. ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించడానికి, ప్రభుత్వ సంస్థలకు సూచనలు అందజేయడానికి, నిర్ణయాక క్రమంలో పాల్గొనేందుకు మహిళలకు సమాన అవకాశాలు అందకపోతే రాజ్యాంగ సమానత్వానికి పెద్దగా అర్ధం వుండదని ఆమె అభిప్రాయపడ్డారు.
73, 74 రాజ్యాంగ సవరణలను, 106వ రాజ్యాంగ సవరణ చట్టం, 2023ను ప్రస్తావిస్తూ ఆమె, చారిత్రక మినహాయింపును అధిగమించడానికి దృఢమైన చర్యలు అవసరమయ్యాయని అన్నారు. స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనను ఆమె గుర్తు చేశారు. ఆక్స్ఫర్డ్లో లా చదివిన తొలి మహిళ, భారతదేశంలో తొలి మహిళా వకీలు, న్యాయ రంగంలో అగ్రగామి అయిన కార్నెలియా సొరాబ్జి సాగించిన పోరాటాలను ఆమె గుర్తు చేశారు. వలసవాద కాలపు ఆంక్షల నుండి రాజ్యాంగబద్ధమైన హామీల వరకు మహిళా హక్కులు పరిణామం చెందాయని తెలిపారు. పని ప్రదేశాల్లో మహిళల రక్షణకు సంబంధించిన విశాఖ వర్సస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ -1997, షాబానో, గీతా హరిహరన్, అనూజ్ గార్గ్, బబితా పునియాలతో సహా మైలురాళ్లు అనదగ్గ తీర్పులను నాగరత్న ఉటంకించారు. పని ప్రదేశాల్లో, కుటుంబాల్లో, ప్రభుత్వ సంస్థల్లో లింగ వివక్షను సుప్రీం కోర్టు ఏ విధంగా పరిష్కరిస్తూ వచ్చిందో వివరించారు. ప్రతి బాలికకు జన్మించే హక్కు వుంటుందని, చట్టానికి అనుగుణంగానే తన ఎంపికలను అనుసరించే హక్కు కూడా వుంటుందని అన్నారు. అప్పుడు మాత్రమే 14, 15 అధికరణలు భారతదేశంలో మహిళలకు నిజమైన అర్థవంతంగా మారతాయని తెలిపారు.







కామెంట్లు (0)