నెత్తి మీద టోపీతో
నొసలు మీది బొట్టుతో
హిందూ , ముస్లింలుగా
కనపడ్డ ఇద్దరిని
నెత్తిన టోపీ, నొసలు మీది బొట్టు తీసేసి
ఫోటువా తీత్తే ఇద్దరూ మనుషులుగనే వచ్చిండ్లు
మతమేది రాలే అండ్ల
సచ్చిపోయిన మా సారయ్య తాత బొందను
సాయబ్ తాత కబర్ తవ్వి సూశిన
భూమిలో ఇద్దరి బొక్కలు మాత్రమే మిగిలినవి
మతమేది కనపల్లే వాళ్ల సమాధులల్ల
ఎద్దు తునకల కోసం
మా తాత దగ్గరికి వచ్చి
ఇద్దరు కాయిసుగా కాల్చుకుతిన్న
కమ్మటి వాసన జ్ఞాపకం
గుండె గది నిండా పరుసుకుంది
ఆటలాడేటప్పడు
‘అన్నా అన్నా’అంటూ
మా ఎనకాలే తిరిగేటి అన్ను గాడు
పని మీద ఊరికి పోతే
‘తమ్ముడా’అని ప్రేమగా పిలిసి
ఇంటికి పట్టుకపోయి బువ్వ పెట్టిన అన్వర్ అన్న
పాషా, రష్యు, ఇస్మాయిల్ గాడు
అందరం కూడి గోళీలాట ఆడింది
భూలచ్చిమి కాడి చింత చెట్టుకిందే!
బడికి పోతే ముద్దుగున్ననని
ఒళ్లే కూసోబెట్టుకుని పాఠం చెప్పిన షాజియా టీచర్
రోగమచ్చిందని దవాఖానకు పోతే
మందు గోలిలిచ్చి ప్రేమగా నెత్తిదువ్వే పాషా డాక్టర్
బాబీ రవ్వన్న మా తోడబుట్టిన అన్నలెక్కంటూ
ఇంట్ల మనిషిలెక్కనే కలేతిరిగిన
బబ్బులు , పాషా బాబాయిలు
బాపు, చాచా, భాయ్ , సాలె ,
అమ్మి, దీదీ, అంటూ
ప్రేమగా పిలుసుకున్న మనుషులనే
ఇప్పుడు ప్రమాదకారులుగా
ఎందుకు చూపెడుతున్నరు?!
గండ శిలలతో పేర్చిన గోడలనైనా
పారో పలుగో వాడి పెకిలించవచ్చు
కాదంటే మందుపాతర పెట్టీ పేల్చనూవచ్చు
కానీ... కనపడని ఈ కంచెలను కూల్చే
మందేదో కానత్తలేదు...!!
- దిలీప్.వి





కామెంట్లు (0)