ఆరెస్సెస్ ద్వారా ఆయుధ శిక్షణ ఇవ్వడం, ప్రైవేట్ మిలీషియాలకు మద్దతివ్వడం సంఘ్ మౌలిక సిద్ధాంతం కాదు, అది భారతదేశ సంస్కృతి కూడా కాదు. సంఘ్ దీన్ని 1930లలో ఇటలీ, జర్మనీలలోని పూర్వపు ఫాసిస్ట్ సంస్థల నుంచి నేర్చుకుని, స్వీకరించింది. అలా చేయడం ద్వారా, ఆరెస్సెస్ ఎలా, ఏ లక్ష్యాల కోసం పనిచేస్తుందో చూపించే పుష్కలమైన సాక్ష్యాలను అది మిగిల్చింది. ఈ విషయంపై నా వ్యాసం భారత జాతీయ కాంగ్రెస్ అధికారిక పత్రిక అయిన ‘కాంగ్రెస్ సందేశ్’లో ఇటీవల ప్రచురితమైంది. దాన్ని నేనిక్కడ పునఃప్రచురిస్తున్నాను.
భారతదేశపు బ్లాక్‌షర్టులు
ఆరెస్సెస్ ఫాసిజాన్ని, దాని ప్రైవేట్ సైన్యాలను ఎలా దిగుమతి చేసుకుంది? 2026 జూలై 20న, నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ మార్కుల కుంభకోణం, ఈ రెండింటి కారణంగా ఆత్మహత్య చేసు కున్న యువ భారతీయుల గురించి సమాధానాలు కోరుతూ వేలాది మంది నిరాయుధ విద్యార్థులు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు ప్రదర్శన చేశారు. వారికి (కన్నీటి వాయువు) టియర్ గ్యాస్, లాఠీలు, చివరికి పెల్లెట్ గన్లతో కూడా సమాధానం ఇచ్చారు. ఇది జరుగుతున్న ప్పుడు, పార్లమెంట్ పరిసరాల్లోని ఇంటర్నెట్ను నిలిపి వేశారు. సమీపంలోని ఆస్పత్రులు గాయపడిన విద్యార్థులతో నిండిపోయాయి. కనీసం ఆ లాఠీలైనా ప్రభుత్వానికి చెందినవే. కానీ, ఇక్కడ, దీనికి ముందు జరిగిన అనేక సంఘటనలలో, ప్రభుత్వంతో పాటుగా కదం కలిపిన ఒక శక్తిని గణతంత్రం ఎన్నడూ ఆమోదించ లేదు- అదే ఒక ప్రైవేట్ సైన్యం. దానికి ఏ నియామకమూ ఉండదు, ఏ అధికారికీ జవాబుదారీ కాదు. అవసరమైనప్పుడు పాలకవర్గమే దీన్ని పిలుస్తుంది, కానీ అది ఉన్నట్లు గుర్తించిన వెంటనే తిరస్కరిస్తుంది. ఇటువంటి అనైతిక ఏర్పాటు భారతీయ సృష్టి కాదు. దీన్ని ముస్సోలినీ, హిట్లర్ పరిపూర్ణం చేశారు, ఆరెస్సెస్‌ను నిర్మించిన వారు అక్కడే దాన్ని అధ్యయనం చేశారు, ఉద్దేశ పూర్వకంగా ఇక్కడికి దిగుమతి చేసుకున్నారు.
వ్యవస్థ గుత్తును రట్టు చేసిన వాంగ్మూలం
ఇలాంటి వ్యక్తులు ఉన్నారని మనకు ఎలా తెలుసంటే, వారిలో ఒకడు తన ఘనకార్యాలను స్వయంగా గొప్పగా చెప్పుకున్నాడు. స్వతంత్ర భరద్వాజ్ పోలీసు కాదు. పాట్నాకు చెందిన 21 ఏళ్ల కార్యకర్త. తనను తాను ‘సనాతని యోధుడి’గా చెప్పుకుంటాడు. జూన్ 23న జంతర్ మంతర్ వద్ద నిరసన జరుగుతుండగా, దళిత విద్యార్థి కార్యకర్త నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్ వీడియో తీస్తుండగా కొందరు వ్యక్తులు ఆయనను చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారని భరద్వాజ్ చెప్పాడు. ఆ తర్వాత ఒక పాడ్‌కాస్ట్‌లో ‘‘నేను ఒకడి తల పగలగొట్టాను. దీనిపై సెక్షన్ 307 (హత్యాయత్నం) పడుతుంది’’ అని గొప్పగా చెప్పుకున్నాడు. తన వద్ద ఢిల్లీ పోలీసులు జారీ చేసిన లాఠీ ఉందని, అధికారిక హోదా లేకపోయినా ‘‘నేను ఢిల్లీ పోలీసులాగే తిరుగుతుంటాను’’ అని పేర్కొన్నాడు. తనకు కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్, మోదీ అండగా ఉన్నారని, వారంతా తనకు అన్నయ్యల వంటి వారని చెప్పాడు. కపిల్ మిశ్రా ఢిల్లీ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి కాగా, చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రి, మోదీ ప్రధానమంత్రి. ఇవన్నీ భరద్వాజ్ స్వయంగా చెప్పిన మాటలే. అవి బహిరంగంగా రికార్డయ్యాయి. అతను వాటిని వెనక్కి తీసుకోలేదు.చిరాగ్ పాశ్వాన్ అతడితో తనకు సంబంధం లేదని ప్రకటించి, తన పార్టీ తరఫున పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదు.
ప్రధానమంత్రి నుంచి ఎలాంటి స్పందనా లేదు.భరద్వాజ్ 73 రోజుల పాటు అరెస్టు కాకుండా స్వేచ్ఛగా తిరిగాడు. చివరకు పోలీసులు చర్య తీసుకునేలా చేసింది అతని వాంగ్మూలం కాదు, రాహుల్ గాంధీ వేసిన ప్రశ్న. సెప్టెంబర్ 4న ఆయన హోంమంత్రిని ప్రశ్నిస్తూ, విద్యార్థులపై పోలీసులు దాడులు చేస్తుంటే, దళిత విద్యార్థి తండ్రి తల పగలగొట్టిన నేరస్తుడు ఎందుకు స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, అతడికి ఎందుకు రక్షణ కల్పిస్తున్నారని నిలదీశారు. రాహుల్ గాంధీ నిషుకు ‘‘నేను నీకు అండగా ఉన్నాను’’ అంటూ లేఖ రాశారు. ఆ తర్వాత ఒక్కరోజులోనే భరద్వాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వ్యక్తి మౌనంగా ఉండటానికి నిరాకరించడంతో ఇంత కాలం కొనసాగిన స్తబ్దతకు తెరపడింది. భరద్వాజ్ పేర్కొన్న శక్తులు మౌనం వహించాయి. కానీ ఆ మౌనం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. 21 ఏళ్ల యువకుడు ప్రధానమంత్రి పేరును దాడులకు ఒక లైసెన్స్‌గా భావించే స్థాయికి ఎలా చేరుకున్నాడు? ఇలాంటి ధీమా ఎవరికీ సహజంగా రాదు. అది నేర్పించబడుతుంది. 1931లో రోమ్‌లో దాన్ని నేర్చుకున్న ఒక సంస్థ ద్వారా ఇక్కడ తొంభై ఐదేండ్లుగా అది నేర్పించబడుతూనే ఉంది.
రోమ్ నుంచి నాగ్‌పూర్‌కు ఆరెస్సెస్ ఏం తీసుకొచ్చింది?
ఆరెస్సెస్ ఈ ఏర్పాటును కనిపెట్టలేదు. అది దీన్ని దిగుమతి చేసుకుని, అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని వదిలిపెట్టింది. ఆరెస్సెస్ పనిచేసే తీరును, అది అనుసరించే భావజాలాన్ని ఒక్కసారి చూసినా, ఈ రెండూ 1930ల నాటి ఐరోపా ఫాసిస్ట్ నమూనాల నుండి యథాతథంగా స్వీకరించబడ్డాయని స్పష్టమవుతుంది. ఇది యాదృచ్ఛిక పోలిక కాదు, పత్రబద్ధంగా నమోదు చేయబడిన వారసత్వం. ముస్సోలినీ ఇటలీని పార్లమెంటు ద్వారా స్వాధీనం చేసుకోలేదు, అతను దానిని స్క్వాడ్రిస్టీ (వీధి పోరాటాలు లేదా దౌర్జన్యం)ద్వారా స్వాధీనం చేసుకున్నాడు. ప్రభుత్వం ఎన్నికలను దొంగిలించిం దని ప్రతిపక్ష ఎంపీ గియాకోమో మట్టెయోట్టి బయటపెట్టిన కొద్ది రోజులకే, జూన్ 1924లో అతన్ని హత్య చేశాడు. ‘ఓట్ చోరీ’ అనేది ఒక పాత నేరం, దాన్ని బయటపెట్టిన వ్యక్తి గొంతు నొక్కడం కూడా పాత నేరమే.
జనవరి 1923లో, ముస్సోలినీ ఆ స్క్వాడ్లకు యూనిఫాం, జీతం ఇచ్చి, వాటిని తనకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వ నిధులతో నడిచే మిలీషియాగా మార్చాడు. హిట్లర్ కూడా బ్రౌన్షర్ట్లతో అదే చేశాడు, వారిని 1933లో ‘‘సహాయక పోలీసులు’’గా నియమించాడు. రెండు దేశాలలోనూ, మొదట ప్రైవేట్ మిలీషియా, ఆ తర్వాత ప్రభుత్వ అనుమతి అనేదే అసలు ఉద్దేశం. దాని గొప్పతనం పూర్తిగా నిరాకరణలోనే ఉంది. ఆ పార్టీ సూటు వేసుకుని పరిపాలన సాగించగా, దాని వాలంటీర్లు రక్తపాతం సృష్టించారు. అందుకే వారిని ‘భారత్ బ్లాక్‌షర్ట్‌లు’ అంటారు-ఎలాంటి నియామక పత్రం లేకుండా, ఢిల్లీ పోలీసులు ఇచ్చారని చెప్పుకునే లాఠీని పట్టుకుని, ప్రధానమంత్రిని తన అన్నయ్య అని పిలుచుకునే వ్యక్తి, భారత దృష్టిలో అసలైన రోమన్ లాంటివాడు. ఆరెస్సెస్ ఫాసిస్ట్ భావజాలాన్ని కాపీ చేసి, ప్రతి దశలోనూ వారి అడుగుజాడల్లోనే నడిచింది. ఇది పత్రబద్ధమైన వాస్తవం.
సంఘ్ పెద్దలే స్వయంగా దీన్ని రాసిపెట్టారు. 1931 మార్చిలో, ఆరెస్సెస్ వ్యవ స్థాపకుడు కె.బి. హెడ్గేవార్ గురువు అయిన డాక్టర్ బి.ఎస్. మూంజేను పలాజో వెనిజియాలో ముస్సోలినీ కలుసుకుని, బలిల్లా, అవాన్గార్డిస్టీలను చూపించారు. ఆయన డ్యూస్‌తో ఇలా అన్నారు-‘‘ఆశలున్న, ఎదుగుతున్న ప్రతి దేశానికి ఇలాంటి సంస్థలు అవసరం’’, భారతదేశ సైనిక పునరుజ్జీవనం కోసం అవి అత్యంత అవసరమని ఆకాంక్షించాడు. ఆయన స్వదేశానికి తిరిగి వెళ్లి ఒకదాన్ని నిర్మించాడు- 1935లో సెంట్రల్ హిందూ మిలిటరీ ఎడ్యుకేషన్ సొసైటీ, 1937లో భోంసాలా మిలిటరీ స్కూల్. బలిల్లాను భారత దేశంలో పునర్నిర్మించారు. భారతదేశపు ‘‘ముస్లిం సమస్య’’కు జర్మనీ తన యూదుల పట్ల వ్యవహరించిన తీరే సమాధానమని వి.డి.సావర్కర్ 1938లో పేర్కొన్నాడు. ఒక సంవత్సరం తర్వాత, ‘వుయ్ ఆర్ అవర్ నేషన్ హుడ్ డిఫైన్డ్’ అనే పుస్తకంలో, ఆ తర్వాత ముప్పై మూడేండ్ల పాటు ఆరెస్సెస్‌కు నాయకత్వం వహించిన ఎం.ఎస్. గోల్వాల్కర్, జర్మనీ యూదులను ‘‘నిర్మూలించడాన్ని’’ ‘‘జాతి గర్వానికి పరాకాష్ట’’ అని ప్రశంసించాడు. దాన్ని ‘‘హిందుస్థాన్‌లో మనం నేర్చుకుని, ప్రయోజనం పొందటానికి ఒక మంచి పాఠం’’ అని అభివర్ణిం చాడు. అప్పటి నుండి గడిచిన 87 ఏండ్లలో, ఏ ఆరెస్సెస్ అధిపతి కూడా ఆ మాటలను వెనక్కి తీసుకోలేదు. ఎందుకో వారినే అడగండి.
ఆరెస్సెస్‌కు ప్రసిద్ధ లక్షణమైన చేసిన దుర్మార్గాలను చేయలేదని బుకాయించడం కూడా బయటి నుండే దిగుమతి చేయబడింది. డెబ్బై ఎనిమిదేండ్ల పాటు, నాథూరామ్ గాడ్సే ఎన్నడూ తమవాడు కాదని ఆరెస్సెస్ అబద్దాలు చెప్పింది. 2026 ఆగస్టులో పూణే కోర్టులో ఆ అబద్దానికి తెర పడింది. వినాయక్ దామోదర్ సావర్కర్ మనవడైన సత్యకి సావర్కర్, గాడ్సే, అతని సోదరుడు గోపాల్ క్రియాశీలక ఆరెస్సెస్ సభ్యులని కోర్టుకు ప్రమాణం చేసి చెప్పాడు. ఇది ఫాసిస్టుల అబద్ధాలు చెప్పే వ్యూహం-శాఖ ఆ వ్యక్తులకు శిక్షణ ఇస్తుంది, బజరంగ్ దళ్, గోరక్షక్ బృందాల వంటి అనుబంధ సంస్థలు వారిని రంగంలోకి దించుతాయి, పార్టీకి వారి గురించి ఎన్నడూ తెలియదు. పదేపదే అబద్ధాలు చెప్పడం ఆరెస్సెస్ అవలంబించిన మరో ఫాసిస్ట్ సూత్రం.
రక్తపు మరకల చిట్టా
దిగుమతి చేసుకున్న డిజైన్ సృష్టించేది ఇదే. 1999 జనవరి 22-23 రాత్రి ఒడిశాలో మిషనరీ గ్రహం స్టెయిన్స్, అతని పదేండ్ల, ఆరేండ్ల కుమారులను వారి వాహనంలోనే సజీవ దహనం చేశారు. బజరంగ్ దళ్ కార్యకర్త దారా సింగ్‌కు శిక్ష పడింది. మూఢనమ్మ కాలను వ్యతిరేకించినందుకు 2013లో కాల్చి చంపబడిన నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో 2024 మేలో పూణే కోర్టు ఇద్దరు వ్యక్తులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2017లో గౌరీ లంకేష్ హత్య కేసులో సిట్ పేర్కొన్న సనాతన్ సంస్థ పన్నిన కుట్రతో ఈ హత్యకు సంబంధం ఉందని సీబీఐ తేల్చింది. 2015లో కాల్చి చంపబడిన గోవింద్ పన్సారే, ఎం.ఎం. కల్బుర్గిలను కూడా దీనికి జోడించండి. ఈ నలుగురు హేతువాదులు, హిందుత్వను నిర్దాక్షిణ్యంగా విమర్శించే వారు కావడం యాదృచ్ఛికం కాదు. ఇది హత్య చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నవారి జాబితా.
ఆ తర్వాత మూకదాడుల ఆర్థిక వ్యవస్థ ఉంది.
• మహమ్మద్ అఖ్లాక్ - 2015లో దాద్రీలో మూకదాడికి గురై హత్యకు గురయ్యాడు.
• పెహ్లూ ఖాన్ - 2017లో అల్వార్‌లో మూకదాడికి గురై హత్యకు గురయ్యాడు.చనిపోతూ తన హంతకుల పేర్లను వెల్లడించినప్పటికీ, వారందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు.
• నాసిర్ మరియు జునైద్ - 2023లో భివానీలో సజీవ దహనం చేయబడ్డారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్లో బజరంగ్ దళ్ గోరక్షక దళ్ నాయకుడి పేరు ఉంది.
• జేఎన్‌యూ, జనవరి 2020 - ముసుగులు ధరించిన మూక ఇనుప రాడ్లతో హాస్టళ్లపై దాడి చేసింది. ఈ దాడి తమదేనని హిందూ రక్షా దళ్ ప్రకటించుకుంది.
• ఢిల్లీ అల్లర్లు, ఫిబ్రవరి 2020 - 53 మంది మృతి, వీరిలో ఎక్కువ మంది ముస్లింలు; ఇది ప్రణాళికాబద్ధమైన, లక్ష్యిత దాడి అని ఒక కమిషన్ పేర్కొంది, దీనికి కొన్నిరోజుల ముందు కపిల్ మిశ్రా పోలీసులకు ఇచ్చిన అల్టిమేటమే ప్రధాన కారణంగా ప్రస్తావించబడింది. ఆరేండ్ల తర్వాత, భరద్వాజ్ ఉదంతంలో అదే పేరు మళ్లీ తెరపైకి వచ్చింది.
ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే జరుగుతున్న దంతా ఆరెస్సెస్ దిగుమతి చేసుకున్న భావజాలమే. ఇవి మినహాయింపులు కావు. దళితులపైనా, ఆదివాసుల పైనా జరిగిన నేరాల సంఖ్య 2019లో 54,192 ఉండగా, 2024 నాటికి అది 64,760కి పెరిగిందని ఎన్‌సిఆర్‌బి లెక్కలు చెబుతున్నాయి. అంటే దాదాపు ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒకటి జరుగుతోంది. ఈ ఫిర్యాదును ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా తెలియడం లేదు. ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నివారణ) చట్టం కింద 3,07,355 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్ కేసులు, దిగుమతి చేసుకున్న పథకం అనుకున్న విధంగా పనిచేయడమే. శాఖ దాడి చేసిన వ్యక్తికి శిక్షణ ఇస్తుంది, పార్టీ అతడిని వదిలేస్తుంది, బాధితుడు మాత్రం న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు. కేవలం ముస్లింలు లేదా దళితులు మాత్రమే కాదు, ప్రతి భారతీయుడు దీనికి భయపడాలి. ఒక గణతంత్రం ఒకే ఒక వాగ్దానంపై ఆధారపడి ఉంటుంది.బలం ప్రభుత్వానికి చెందుతుంది, ప్రభుత్వం చట్టానికి జవాబుదారీగా ఉంటుంది. ఒక పార్టీ వాలంటీర్ పోలీసు లాఠీ పట్టుకున్నప్పుడు, ఒక ఫోన్ కాల్ ఎఫ్ఐఆర్ కంటే గొప్పదిగా పరిగణించ బడినప్పుడు, అందరికీ ఇచ్చిన ఆ వాగ్దానం చచ్చిపోయినట్లే. ఈరోజు లాఠీ ఒక దళితుడిపై పడుతుంది, రేపు ఒక ముస్లింపై, ఆ మరుసటి రోజు విరాళం ఇవ్వని దుకాణదారుడిపై. మూకశక్తి ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోదు.
మన ముందున్న ఏకైక మార్గం
బీజేపీ, ఆరెస్సెస్‌లు ఒక చేత్తో పాలిస్తూ, మరో చేత్తో విరుచుకుపడతాయి. ఆ రెండు చేతులలో ఒకటి మరొక దానికి తెలవనిది అని మనల్ని నమ్మమని అడుగుతాయి. అవి ఒకదానికి మరొకటి తెలవనివి కావు. దాని మూల ప్రణాళిక రోమ్ నుండి వచ్చింది, నాగ్‌పూర్‌కు చెందిన ఒక వైద్యుడు దాన్ని మన దేశానికి తీసుకువచ్చాడు. దాన్ని నిర్మించిన దేశాలను అది ఎక్కడికి తీసుకువెళ్లిందో మనకు తెలుసు. కాబట్టి, బి.ఆర్. అంబేద్కర్ మనకు అందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, చట్టం ఒక విద్యార్థిని ఎలా బంధిస్తుందో, ఒక స్వయంసేవకుడిని కూడా అలాగే బంధించాలని పట్టుబట్టడానికి, అత్యంత శక్తివంతమైన లాఠీలను మోసే ఏ గుంపునకూ ఈ దేశం ఎన్నడూ చెందకుండా చూడాలి. ఈ దేశాన్ని కాపాడటానికి, మనమందరం మతం, కులం, భాష, ప్రాంతాలకు అతీతంగా ఏకమవుదాం. గణతంత్రం నశించిపోలేదు. కానీ అది విచారణలో ఉంది, ప్రజలమైన మనమే దానికి న్యాయనిర్ణేతలం.
అనువాదం: వెంకట్రావ్
రాజీవ్ శర్మ





కామెంట్లు (0)