ప్రజలు జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకుంటారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకు భద్రతతో పాటు వడ్డీని ఆశిస్తారు. కానీ ఆర్థిక సంస్కరణల పేరుతో మోడీ ప్రభుత్వం ప్రజల పొదుపులను ప్రమాదకరమైన షేర్ మార్కెట్ పెట్టుబడుల వైపు మళ్లించే పరిస్థితులను ప్రోత్సహిస్తోంది. బ్యాంకు వడ్డీ కంటే స్టాక్ మార్కెట్లోనే ఎక్కువ లాభాలంటూ చేసే ప్రచారం ప్రజలను ఆకర్షిస్తోంది. నవంబర్ 11న సెన్సెక్స్, నిఫ్టీ గణనీయంగా పెరిగినా, చిన్న మదుపరుల సొమ్మును ప్రమా దంలోకి నెట్టే కృత్రిమ ధరల పెంపు, మోసాలపై ప్రశ్నలు మరుగునపడకూడదు. కంపెనీల వ్యాపారం పెరగకపోయినా షేర్ల ధరలు పెరుగు తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారు. ఆశపడి డబ్బు పెట్టిన సామాన్యులు నష్టపోతుంటే, ముందుగానే షేర్లు కొన్నవారు లాభాలతో బయటపడుతున్నారు.
ఈ మోసపూరిత పద్ధతినే ‘పంప్ అండ్ డంప్’ అంటారు. కొందరు ముందుగా ఒక కంపెనీ షేర్లను తక్కువ ధరకు కొంటారు. ఆ తర్వాత వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ద్వారా వాటి ధరలు పెరుగుతాయని, భారీ లాభాలు వస్తాయని ప్రచారం చేస్తారు. ఆ మాటలు నమ్మి సామాన్యులు కొనుగోలు చేయడంతో షేరు ధర పెరుగుతుంది. ఇదే అదనుగా ముందుగా కొన్నవారు అధిక ధరలకు అమ్ముకుని తప్పుకుంటారు. ధర పడిపోయాక చివర్లో కొన్నవారు నష్టపోతారు. అంటే సామాన్యుల డబ్బుతో కొందరు తమ లాభాలను పెంచుకుంటున్నారు. సెబీ 2026 ఆగస్టు అధ్యయనం ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో 87.7 శాతం మంది వ్యక్తిగత మదుపరులు నష్టపోయారు. వారి మొత్తం నికర నష్టాలు రూ.91,685 కోట్లకు చేరాయి. అక్టోబర్ 22న వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ షేర్ చిట్కాలు, తప్పుడు లాభాల ప్రచారంపై సెబీ హెచ్చరించాల్సి వచ్చింది.
ఇంతటి నష్టాలు జరుగుతున్నా మోసాలను అరికట్టడంలో నియంత్రణ వ్యవస్థ మరింత కఠినంగా ఎందుకు వ్యవహరించడం లేదు?
విదేశీ పెట్టుబడుల విషయం లోనూ పారదర్శకతపై ప్రశ్నలు ఉన్నాయి. 2018 ఏప్రిల్ 10, సెప్టెంబర్ 21 తేదీల్లో సెబీ విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల (ఎఫ్‌పీఐ) కెవైసి, అర్హత నిబంధనలపై మార్గదర్శకాలు జారీ చేసింది. 2018-19లో జరిగిన నిబంధనల మార్పులతో విదేశీ పెట్టుబడుల వెనుక అసలు యజమా నులను గుర్తించడంపై సందేహాలు తలెత్తాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం అసలు లబ్ధిదారులను గుర్తించడం అవసరం. ఈ ప్రక్రియ బలహీనపడితే డొల్ల కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలకు అవకాశం ఏర్పడుతుంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూపు విదేశీ పెట్టుబడి సంస్థల యాజమాన్యంపై ప్రశ్నలు లేవనెత్తింది.
విదేశీ డొల్ల కంపెనీల ద్వారా షేర్ల ధరలను పెంచారనే ఆరోపణలు చేసింది. ‘రౌండ్ ట్రిప్పింగ్’ అంటే దేశంలో సంపాదించిన డబ్బును విదేశాలకు తరలించి, అక్కడి కంపెనీల ద్వారా తిరిగి భారత మార్కెట్లో పెట్టుబడిగా తీసుకురావడం. ఇలా జరిగితే దేశీయ డబ్బే విదేశీ పెట్టుబడిగా కనిపిస్తుంది. 2024 జనవరి 3న సుప్రీంకోర్టు అదానీ వ్యవహారంపై సెబీ విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించేందుకు నిరాకరించింది. అయినా విదేశీ పెట్టుబడుల వెనుక అసలు యజమానులను గుర్తించే వ్యవస్థపై ప్రజలకు స్పష్టత అవసరం.
ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ విరాళాలు ఇచ్చినవారి వివరాలను మోడీ ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. సుప్రీంకోర్టు ఆ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసి పారదర్శకత అవసరమని స్పష్టం చేసింది. రాజకీయ విరాళాలైనా, విదేశీ పెట్టుబడులైనా అసలు వివరాలను దాచడం వల్ల లాభపడేది ఎవరు? మార్కెట్ సూచీలు పెరిగాయని చెప్పడం వేరు, ప్రతి మదుపరికి లాభం రావడం వేరు.
షేర్ల ధరలను కృత్రిమంగా పెంచే మోసాలు, డొల్ల కంపెనీల లావాదేవీలపై సెబీ కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ విదేశీ పెట్టుబడుల యాజమాన్య వివరాల వెల్లడిపై సందేహాలు, కార్పొరేట్ సంస్థలకు కల్పిస్తున్న వెసులుబాట్లు చూస్తుంటే చిన్న మదుపరుల రక్షణకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందన్న ప్రశ్న తలెత్తుతోంది. పెద్ద పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలు మారుతున్నప్పుడు సామాన్యుల పొదుపుల భద్రత ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతోంది?
మోడీ అధికారంలోకి రావడానికి మద్దతుగా నిలిచిన మధ్యతరగతి ప్రజల పొదుపులే ప్రమాదంలో పడుతుంటే వారి పక్షాన ప్రభుత్వం ఎందుకు నిలబడటం లేదు? చట్టాలు ప్రజల ఆస్తులను కాపాడేందుకా? లేక కార్పొరేట్ సంస్థల లాభాలకు రక్షణగా నిలిచేందుకా? ప్రజల కష్టార్జితాన్ని కొందరి లాభాలకు బలిచేసే విధానాలను మార్చకుండా ఆర్థిక అభివృద్ధి గురించి చేసే ప్రచారానికి అర్థమేమిటి? దేశ ఆర్థిక విధానాలు ప్రజల కోసమా, కార్పొరేట్ శక్తుల కోసమా? మోడీ సర్కార్ సమాధానం చెప్పాలి.





కామెంట్లు (0)