Magazines

బ్రెజిల్‌లో ఎర్రబావుటా

1 గంట క్రితం

Red Flag in Brazil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 3 నిమిషాల చదవడం

ప్రపంచమంతా పెట్టుబడిదారీ వ్యవస్థదే రాజ్యమని, ఎర్రజెండాకు కాలం చెల్లిందని, కమ్యూనిస్టుల పని అయిపోయిందని చాటుతున్న పాలకులకు ప్రజల తీర్పులు చెంపపెట్టు అవుతున్నాయి. కార్పొరేట్లకు కాసుల వర్షం కురిపిస్తూ, సామాన్యుల బతుకులను భారంగా మార్చే వ్యవస్థలపై అసంతృప్తులు, ఆందోళనలు పెరుగుతున్నాయి. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతున్న కొద్దీ సమానత్వం కోసం గొంతులు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌లో లూలా విజయం, అమెరికాలోని న్యూయార్క్‌లో జోహ్రాన్‌ మమ్దానీ గెలుపు, జర్మనీ రాజధాని బెర్లిన్‌‌లో వామపక్ష పార్టీ పుంజుకోవడం ఎర్రజెండా భావజాలానికి కొత్త ఊపునిస్తున్నాయి. ఇవన్నీ ఒకే తరహా కమ్యూనిస్టు విజయాలు కాకపోయినా, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం కోసం పోరాడే శక్తులకు ఆదరణ తగ్గలేదని చాటు తున్నాయి. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం లేదనే అహంకా రానికి ప్రజాస్వామ్య తీర్పులు గట్టి సమాధానమిస్తున్నాయి.

బ్రెజిల్‌కు రెండు విడతల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు ఆదివారం రాత్రి విడుదలయ్యాయి. అధ్యక్షునిగా లూయిజ్‌ ఇనాసియో లూలా డ సిల్వా 51.79 శాతం ఓట్లతో నాలుగోసారి విజయం సాధించడం ప్రత్యేక ప్రాధా న్యత సంతరించుకుంది. మితవాద అభ్యర్థి ఫ్లావియో బోల్సొ నారోపై ఆయన సాధించిన విజయం లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి, కార్మికోద్యమం నుంచి దేశాధ్యక్షుడిగా ఎదిగిన లూలా రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమం, కార్మికుల హక్కులు, ఆర్థిక అసమానతల తగ్గింపు ఆయన రాజకీయాల్లో కీలకాంశాలు. ఆర్థిక వృద్ధి గణాంకాలకంటే సామాన్యుల జీవన ప్రమాణాలే ముఖ్యమని ఆయన గెలుపు మరోసారి గుర్తుచేస్తోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనుసరిస్తున్న సుంకాల విధానాన్ని లూలా బహిరంగంగా సవాలు చేశారు. 2025 జూలైలో బ్రెజిల్‌పై అమెరికా సుంకాల బెదిరింపులను వ్యతిరేకిస్తూ, తమదేశ సార్వ భౌమాధికారాన్ని ఎవరూ శాసించ లేరని స్పష్టం చేశారు. అమెరికా ఒత్తిళ్లకు తలవంచకుండా చర్చలు, పరస్పర గౌరవం, జాతీయ ప్రయోజ నాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులనూ బ్రెజిల్‌ ప్రభుత్వం ఖండించింది. యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదని, అంతర్జాతీయ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని లూలా పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని శాసించే అధికారం ఏ ఒక్క దేశానికీ లేదన్న ఆయన వైఖరి సామ్రాజ్యవాద ఆధి పత్యాన్ని ప్రశ్నిస్తోంది. అమెరికా ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లకు లొంగ కుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా ట్రంప్‌‌ విధానాలకు మోకరిల్లుతున్న భారత్‌‌లాంటి దేశానికి కీలక సందేశం.

అమెరికాలో పెట్టుబడిదారీ వ్యవస్థకు కేంద్రంగా భావించే న్యూయార్క్‌లో ప్రజాస్వామ్య సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ విజయం కూడా ప్రాధాన్యం కలిగినదే. అద్దె భారాన్ని తగ్గించడం, ప్రజా సేవలను విస్తరించడం, ధనవంతులపై పన్నులు పెంచడం వంటి అంశాలతో ఆయన ప్రజల మద్దతు పొందారు. బెర్లిన్‌‌లో2025 ఎన్నికల్లో వామపక్ష పార్టీ డీ లింకే తన ఓట్ల శాతాన్ని 4.9 నుంచి 8.8కు పెంచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ఇప్పటికే చైనా, వెనిజులా, క్యూబా, వియత్నాం, లావోస్‌, ఉత్తర కొరియా వంటి దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికా రంలో ఉన్నాయి. మరోవైపు పలు దేశాల్లో వామపక్ష, సామాజిక ప్రజాస్వామ్య శక్తులు ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాయి. ఆయా దేశాల రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు భిన్నమైనప్పటికీ, సంపద పంపిణీ, కార్మికుల హక్కులు, విద్యా వైద్యం వంటి ప్రజా అవసరాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ పరిణామాలు పెట్టుబడిదారీ వ్యవస్థపై విమర్శలకు, ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాల అన్వేషణకు ప్రాధాన్యం పెరుగుతోందని సూచిస్తున్నాయి.

పెట్టుబడిదారీ విధానంలో సంపద కొద్దిమందికే పరిమితమవుతూ, కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలు భారాలు మోస్తున్నప్పుడు వామపక్ష ప్రత్యామ్నాయాల అవసరం మరింత పెరుగుతుంది. లూలా విజయం ప్రపంచ వామపక్షాలకు ఉత్సాహాన్నిచ్చే పరిణామం. ఎర్రజెండా కేవలం ఒక రాజకీయ చిహ్నం కాదు.. శ్రమకు గౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం సాగుతున్న పోరాటానికి ప్రతీక. ఈ విజయోత్సాహాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి దోహదపడే శక్తిగా మలచుకోవడమే వామపక్షాల ముందున్న అసలు సవాలు. కార్పొరేట్ల లాభాల కోసం కాకుండా ప్రజల బతుకుల కోసం పనిచేసే రాజకీయాలే భవిష్యత్తుకు బాటలు వేయగలవు. ఆ దిశగా ప్రపంచం కొత్తదారులను వెతుకు తోంది.ఆ ప్రత్యామ్నాయ స్వరం మరింత బలపడాలంటే, ఎర్రజెండా ఆశలకు, ఆశయాలకు ప్రజలు అండగా నిలవాలి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్