Magazines

నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపి)కూడా ఓ విధ్వంసమే!

1 గంట క్రితం

NEP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 6 నిమిషాల చదవడం

1934వ సంవత్సరం అంటే జర్మనీలో నాజీలు అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరం అక్కడి చరిత్రకారుడు ఊరిక్ కార్సెంట్ చేసిన ప్రసంగంలోని కొన్ని విషయాల్ని ఈ సందర్భంలో మనం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ‘‘కేవలం పరిశోధన కోసం చేసే పరిశోధన మాకు అక్కరలేదు. తెలిసిన సూక్ష్మజీవుల సంఖ్యను పెంచడానికి మేం వైద్యశాస్త్రంలో పరిశోధనలు చేయం. ఆరోగ్యకరమైన, బలమైన జర్మనీ ప్రజల కోసమే మాకు వైద్యశాస్త్రం కావాలి. సైన్సు నేర్చుకునేది, బోధించేది ABSTRACT LAWS కనుక్కోవడానికి కాదు. ఇతర దేశాలతో జరిగే పోటీలో ముందు నిలబడ డానికి మాత్రమే! గతంలో ఏం జరిగిందో చెబుతూ మేం చరిత్ర బోధించం. జర్మన్ ప్రజలకు కొన్ని సూచనలివ్వడానికి మాత్రమే చరిత్ర బోధిస్తాం!’’ ఈ రకమైన ఆలోచనా విధానంతో నాజీలు మొట్టమొదట పాఠశాలల మీద, విద్యాలయాల మీద, విద్యారంగం మీద దాడిచేశారు.

‘‘అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్రం మాకు అక్కరలేదు’’ అన్నది ఆనాటి నాజీల ముఖ్యమైన నినాదం! సమాజాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఇలాంటి కొన్ని నినాదాలు, విధానాలు ప్రచారం చేశారు. ‘జర్మన్‌తత్త్వం’ ఉంటే చాలునన్నది స్థూలంగా వారి విధానమయ్యింది. ఈ విషయం అక్కడి ప్రభుత్వం ప్రకటించగానే విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు సుమారు మూడొంతుల మంది ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోయారు. ఇతరత్రా జీవనభృతి చూసుకున్నారు. మిగిలిన ఒకవంతు మంది - నాజీలకు లొంగిపోయి, బతుకు జీవుడా అనుకున్నారు. పై ప్రసంగంలోని విషయాలు ఎంత అహేతుకంగా ఉన్నాయో కొద్దిపాటి ఇంగిత జ్ఞానం ఉన్నవారికి సైతం తెలుస్తాయి కదా? ఇక ఆనాటి నాజీలను అనుసరిస్తూ పరిపాలన సాగిస్తున్న మన ప్రస్తుత దేశనాయకులు అంటే అరెస్సెస్ - బీజేపీ వారు నూటికి నూరుపాళ్లు విజ్ఞారంగంలో ‘భారతీయత’ ఉంటే చాలునంటున్నారు. వీరు అధికారంలోకి వచ్చిననాటి నుంచి దేశంలో సైన్సుకు గడ్డుకాలం దాపురించింది. చరిత్ర వక్రీకరణలకు గురవుతూ ఉంది. విద్వేష ప్రసంగాలు చేస్తూ జనాన్ని చీలుస్తూ ఉన్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం, ఆహార భద్రత, పేదరిక నిర్మూలన వంటి విషయాలపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు.

ఆర్థికంగా దిగజారిపోయి, విదేశీ విధానంలో పూర్తిగా దెబ్బతిని ఉండి కూడా పుంజుకుందామన్న స్పృహ లేకుండా, పునరుద్ధరణ విషయమే ఆలోచించకుండా హిందుత్వ పేరుతో ద్వేష రాజకీయాలు చేస్తున్నారు. పన్నుల భారం ఒకవైపు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి మరొకవైపు.. సామాన్యులు దేశంలో విలవిలలాడుతున్నారు.

ఏదైనా ఒక విషయాన్ని గతంలో మన దేశం ఎలా అర్థం చేసుకుందో ఇప్పుడు ప్రతి విద్యార్థికి తెలియజెప్పాలన్నదే నేటి జాతీయ విద్యావిధానం! ప్రాచీన భారతీయ జ్ఞానం అంటే సాధారణ శకానికి ముందు (B.C.E) వచ్చిన చార్వాక, బౌద్ధ, జైన, ఆజీవక, సాంఖ్య వంటి దర్శనాల గురించి చెప్పాలి. అంతేగాని, వైదిక రుషుల గురించి చెప్పడం ఎందుకూ? వారి రచనలన్నీ తర్వాత కాలంలో సాధారణ శకం (C.E) లో వచ్చినవి కదా? భారతీయ జ్ఞానం గొప్పది. అయితే, దాన్ని నాశనం చేసి, భారతీయ మూలాలేవో భారతీయులకు తెలియకుండా చేసిన వైదిక మతాన్ని తిరగతోడి ప్రస్తుత ప్రభుత్వం గొప్పగా నిలబెట్టాలని అనుకుంటోంది.

ప్రశ్న బలపడిన ఈ కాలంలో ప్రశ్ననే ఊపిరి చేసుకుని ఈ దేశ యువత ఉద్యమిస్తున్న కాలంలో - నేటి ఈ ప్రభుత్వపు దురుద్దేశం ఎక్కువకాలం కొనసాగదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆనాటి జర్మనీ నాజీల అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రభుత్వం దేశంలోని విద్యావిధానాన్ని ధ్వంసం చేసింది. గతంలో వీరు చేయించిన ఎన్నో మారణకాండల్లాంటిదే- ఈ జాతీయ విద్యావిధానం NEP. దీని ఉద్దేశం ఏమిటంటే ‘‘ప్రాచీన, వారసత్వ, శాశ్వత, భారతీయ ఙ్ఞానం, ఆలోచనా సరళి అవసరం’’అని! ఇందులో పద్దెనిమిది మంది ప్రాచీన రుషులను ప్రస్తావించి, భారతీయ జ్ఞానాన్ని భవిషత్ తరాల కోసం పెంపొందించి, పరిరక్షించి, పరిశోధనలు చేసి, మెరుగు పరిచి, దాన్ని కొత్త ప్రయోజనాల కోసం వినియోగించాలి అని! ఇందుకోసం NEPలో IKSDని కూడా ఏర్పరిచారు. IKSD అంటే-Indian knowledge Systems Division. NEPలో NEC (Non Major Elective Course ఇంకా VAC (value added Course) వంటి కోర్సులు కూడా ప్రవేశపెట్టారు. వారి NEP కే విలువ లేనప్పుడు ఇంకా లోపల value added Courseలు పెడితే ఏం లాభం?ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కింద ఒక ఫాకుల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం (FDP) కూడా పెట్టారు. ఇవన్నీ ఆన్‌లైన్ ప్రోగామ్స్. వీటిని వీడియోలతో, స్లైడ్స్‌తో నిర్వహిస్తారు. అవైనా, నిర్వాహకులు తయారు చేయించి ఇచ్చినవి మాత్రమే ఉపయోగించాలి. ఇక వీటి స్థాయి ఎలా ఉందో చూడండి - I KS: మాస్టర్ స్థాయి శిక్షకులు చెప్పిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి.

1. పైథాగరస్ ఆవిష్కరణ మన భారతీయుల ఆవిష్కరణ-అని చెప్పాడు ఒక శిక్షకుడు. పైథాగరస్ 495 BCE నాటి గ్రీకు తత్త్వవేత్త కాదా? ఆయన పేరుతో ఉన్నది భారతీయ ఆవిష్కరణ ఎలా ఆవుతుందీ?

2. మనుషులకు మూడవ కన్ను ఉంటుంది. అది యోగా చేసిన వారిలో తెరుచుకుంటుంది - ఇది మరొక మాస్టర్స్ స్థాయి శిక్షకుడు చెప్పిన విషయం.

3. హిందూ ప్రార్థనలు చేస్తే, చెరకు దిగుబడి బాగా పెరుగుతుంది.

4. మంత్రోచ్చారణ వెనుక - న్యూరో సైన్స్ (Neuro Science) ఉంది.

5. భగవద్గీతలో ‘కర్మయోగ’ ఉంది.

6. అంతర్గత నిశ్శబ్దపు ప్రాధాన్యత (Importance of inner silence) పెంచుకోవాలి!

7. మన ప్రదర్శన కళల్లో ‘నాట్యకళ’అత్యంత పురాతనమైంది.
విద్యార్థులకు బోధించే- శిక్షణనిచ్చే శిక్షకుల ఆలోచనలే ఇంత అహేతుకంగా ఉంటే, ఇక భావిభారత పారుల స్థాయి అంధభక్తుల స్థాయే కదా? వైదిక, బ్రాహ్మణ సంప్రదాయాలపైనే ఆరెస్సెస్-బీజేపీలు దృష్టి సారించి, అందుకు అనుగుణంగా మన తరగతి గదులను మార్చాలని, తద్వారా రాబోయే తరాలను మార్చాలని ప్రయత్నిస్తోంది! ఉదాహరణ కు చూడండి -

1. బోధనా పద్ధతుల్ని వారే నియంత్రిస్తున్నారు.

2. పరిశోధనాంశాలను వారే నిర్ణయిస్తున్నారు.

3. భారతీయ సంస్కృతి అంటే వైదిక సంస్కృతి/ బ్రాహ్మణ సంస్కృతి అని మాత్రమే ప్రస్తుత పాలకులు భావిస్తున్నారు.

4. వారి కనుసన్నల్లో మెదిలే అధికారులు వారికి వంత పాడుతున్నారు.

5. ప్రపంచానికి భౌతికవాదం మొదటగా చెప్పింది ఈ దేశమేనన్న విషయం- ఈ దేశ ప్రజలు గుర్తుంచుకోగూ డదని పాలకులు ఎత్తులు వేస్తున్నారు.

NEPలో భాగంగా వారు రూపొందించిన కోర్సులలో ఏమేమున్నాయో ఈ జేశ ప్రజలు పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంది. దాన్ని రద్దుచేయించడానికి ఉద్యమించాల్సి ఉంది. 1. భగవద్గీత : A Guide to Holistic Well Being - సంపూర్ణ మానవ శ్రేయస్సుకు భగవద్గీత ఒక మార్గదర్శి అని వారి భావన! అలాగే 2. భారతదేశాన్ని రామాయణం కోణంలో అర్థం చేయించాలని మరొక వీడియో కోర్స్ ఏర్పాటు చేశారు. దాని శీర్షిక - Comprehending India Through Ramayana. 3. రామరాజ్యానికి సంబంధించిన కోర్సు ఒకటి ఇలా ఉంది. Ideal state and Goverence in The Ramayana. 4. కులాలు ఎవరూ ఏర్పాటు చేయలేదని, వారు చేపట్టిన వృత్తుల వల్ల అతి సహజంగా ఏర్పడ్డాయని ఆ కోర్సులో బోధిస్తున్నారు. 5. కుల వివక్ష ఈ వ్యవస్థ నుంచి పుట్టలేదన్నది వారి వాదన!

ఇకపోతే 6.Vedic Philosophy- ని కళాశాలల్లో పాఠ్యాంశంగా నేరుగా జొప్పించడానికి ‘సిద్ధాంత పొండేషన్’ అనే ప్రయివేటు సంస్థకు బాధ్యతను ఇచ్చి, కరికులమ్ కటెంట్‌ను ఏర్పాటు చేయమన్నారు. వారికి రూ.70 లక్షల నిధిని సమకూర్చారు. ఈ కోర్సులకు మెటీరియల్ తయారు చేయడానికి సంస్కృత విశ్వవిద్యా లయాలకు, సిద్ధాంత పాండేషన్ లాంటి ప్రయివేటు సంస్థలకు సబ్‌కాంట్రాక్ట్ ఇచ్చారు. మళ్లీ ఇదొక వ్యాపారం! ఇంతకూ ఈ సిద్ధాంత పౌండేషన్‌కు లోగడ ఏం అనుభవముంది? - అని వెతికి చూస్తే, తెలిసిందేమంటే, ఇది లోగడ ఆగ్రోకెమికల్స్ తయారు చేసే కంపనీ. డబ్బులు దండుకోవడానికి భారతీయ త‌త్త్వశాస్త్రంపై దృష్టి సారించిందన్న మాట! తమకు భజన చేసే కంపనీ అయి ఉంటుంది - అందుకే ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టు వారికిచ్చి, నిధులు సమకూర్చారన్నమాట!

మరొకవైపు, ఈ జాతీయ విద్యావిధానం యువత పై బలవం తంగా సంస్కృతాన్ని రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. పేపర్ లీక్‌ మీద ఉద్యమం చేస్తూ, ప్రధాని మోడీని ఉద్దేశించి విమర్శలు చేస్తూ జెన్ జి ప్లకార్డులు ప్రదర్శించిన విషయం మనకు తెలుసు. జెన్ జి వారికే సంస్కృతం రాకపోవడం వల్లనే వారు మోడీ గురించి అవాకులు చవాకులు రాసి ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని NEP నిర్వాహకులు ఆరోపించారు. సంస్కృత పఠనం సాధన చేస్తే సహనం అలవడుతుందనీ, వారిలో హింసాత్మకమైన స్వభావం ఉండదని అన్నారు. ఈ నూతన విద్యావిధానంలో భాగంగా ‘‘అధునిక కాలానికి సంస్కృతం యొక్క ఆవశ్యకత’’ అనే అంశంపై పెద్దఎత్తున సదస్సులు నిర్వహించాలని అనుకున్నారు. ప్రయత్నించారు కూడా! శీర్షిక చూడగానే ఎక్కడివారు అక్కడే పారిపోయారు. ఆశించినంత మంది రాలేదు.

దానికి నిర్వాహకులు చెప్పిన సమాధాన మేమంటే- ‘‘జనం అశాంతితో, గందరగోళంలో ఎందుకున్నారంటే అందుకు కారణం, వారు సంస్కృతం నేర్చుకోక పోవడమే’’ అని చెప్పారు. ఒకప్పుడు అధిక సంఖ్యాకులైనా బహుజనులు సంస్కృత పదం ఉచ్ఛరిస్తేనే నాలుకలు కోసేశారే- మరి ఇప్పుడు ఏమైంది? మారిన పరిస్థితుల దృష్ట్యా ‘‘బాబ్బాబు నేర్పుతాం! నేర్చుకోండి!’’ అని జనాల వెంట పడి బతిమిలాడినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఎంతటి బలమైన ప్రభుత్వాలైనా జనం బలం ముందు దిగదుడుపే. సమాజాన్ని వెనక్కి నడుపుతామంటే ఎవరూ సహకరించరు. పైగా తీవ్రంగా ప్రతిఘటిస్తారు. ఆ ప్రతిఘటనలనే మనం ప్రస్తుతం దేశంలో చూస్తున్నాం.

గతంలో ‘నీట్’ పేపర్ లీక్ కారణంగా, ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫలితంగా ఢిల్లీ జంతర్ మంతర్‌‌లో నిరసనలు పెల్లుబికాయి. అంటే, విద్యారంగానికి సంబంధించిన విషయంతోనే ఉద్యమాలు ఊపిరి పోసుకున్నాయి. మోడీ ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటి కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేసి పారిపోయాడు. ఆ తరువాత ఇప్పుడు ‘‘ఓట్‌ చోరీ’’ మీద (SIR) ఉద్యమం నడుస్తోంది. దీని తర్వాత దేశంలో ఉన్న అనేక సమస్యల మీద ఉద్యమాలు తలెత్తే అవకాశం ఉంది. నేటి బాలబాలికల భవిష్యత్తు, యవతీ యువకుల భవిషత్తు అంధకారం చేయబోయే ఈ నేషనల్ ఎడ్యుకేషన్‌ పాలసీ రద్దు చేయాలని కూడా ఒక ఉద్యమం ఊపందుకోవచ్చు. ఎందుకంటే, ఇది కూడా గుజరాత్- మణిపూర్‌లలో మో‌డీ జరిపించిన మారణకాండ లాంటిదే! పౌర సమాజం ఆలోచించే యువతకు వెన్నుదన్నుగా నిలబడుతూ ఉంది !!

​- నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా పూర్వ సలహా సంఘ సభ్యుడు, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్.


ప్రొ. దేవరాజు మహారాజు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్