దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 ఏళ్లు పూర్తయినా దళితులపై కులవివక్ష, దాడులు, పెత్తందారుల దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలందరూ సమానమేనని, కులవివక్ష, అంటరానితనం చట్టవిరుద్ధమని రాజ్యాంగం స్పష్టం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో దళితులకు ఆ హక్కులు పూర్తిస్థాయిలో అందడం లేదు. స్వాతంత్య్రం సాధించిన దేశంలోనే దళితులు తమ ఆత్మగౌరవం, సమానత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలోని కొనాయిపల్లి ఘటన ఈ సామాజిక వాస్తవానికి నిదర్శనం. గ్రామంలో తరతరాలుగా దళిత యువకులు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా డప్పులు కొడుతున్నారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయం ప్రకారం డప్పులు కొట్టాలని కోరగా, పెరిగిన నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకుని తమకు ఇచ్చే పారితోషి కాన్ని పెంచాలని యువకులు అడిగారు. అయితే, వారి న్యాయమైన డిమాండ్‌ను అర్థం చేసుకోవాల్సిన గ్రామ నాయకత్వం అహంకార పూరితంగా వ్యవహరించింది.
కులం పేరుతో దూషిస్తూ, అవమానకరమైన మాటలు మాట్లాడటమే కాకుండా, ఇతర ప్రాంతాల నుంచి బ్యాండ్ వారిని తీసుకురావడంతో వివాదం తీవ్రమైంది.
తమ ఉపాధికి నష్టం కలగకూడదని ప్రశ్నించిన దళితులపై గ్రామ సర్పంచ్, ఆయన అనుచరులు మూకుమ్మడిగా దాడి చేయడం దారుణం. ఈ దాడిలో మహిళలు, పురుషులు సహా పలువురు గాయపడటం, తమ కుటుంబ సభ్యులను రక్షించేం దుకు వెళ్లిన మహిళలపైనా దాడులు జరగడం పెత్తందారీ అహంకారానికి పరాకాష్ట. తమకు నచ్చినట్లు వ్యవహరించకపోతే దళితులను భయపెట్టవచ్చనే ఆధిపత్య ధోరణి ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తోంది.ఇది కేవలం డప్పుల పారితోషికానికి సంబంధించిన వివాదం మాత్రమే కాదు. దళితులు తమ హక్కుల గురించి మాట్లాడటాన్ని సహించలేని కులాధిపత్య మనస్త త్వానికి ప్రతిబింబం. తమ శ్రమకు తగిన ప్రతిఫలం అడిగినందుకు దాడులకు గురికావడం, కులం పేరుతో అవమానించ బడటం సమానత్వ సూత్రానికే విరుద్ధం.
గ్రామంలో దళితులు భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాలు.
కొనాయిపల్లితో పాటు మెదక్ జిల్లాలోని కుచారం, నవాబ్‌పేట్, కిష్టాపూర్ ఘటనలు కూడా దళితులపై వివక్ష వివిధ రూపాల్లో కొనసాగుతోందని తెలియజేస్తున్నాయి. కుచారంలో దళిత సర్పంచ్ బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారనే కారణంతో అగ్రకులాలకు చెందిన మహిళలు వేరే చోట ఉత్స వాలు నిర్వహించడం, నవాబ్‌పేట్‌లో డప్పులు సరిగా కొట్ట లేదనే నెపంతో దళిత యువకులపై దాడి జరగ డం, కిష్టాపూర్‌లో దళిత మహిళల బతుకమ్మ ఉత్సవా లను అడ్డుకోవడం ఈ వివక్షకు ఉదాహ రణలు. స్వాతంత్య్రం అనంతరం సమా నత్వం, సామాజిక న్యాయం సాధించాల్సిన చోట కుల పెత్తం దారుల దౌర్జన్యాలు కొనసాగడం ఆందోళనకరం. రాజ్యాంగం కల్పించిన హక్కులు కాగితాలకే పరిమితం కాకుండా గ్రామ స్థాయిలో అమలు కావాలి. దళితులపై దాడులు జరిగినప్పుడు బాధి తులకే రక్షణ కల్పించాలి.
నింది తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలి. పోలీసుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం వంటి ఆరోపణలపై కూడా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి.
కొనాయిపల్లి ఘటనపై ప్రజాసంఘాలు బాధితులకు అండగా నిలబడి, గ్రామాన్ని సందర్శించి, కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందిం చడం దళితుల న్యాయపోరాటానికి బలాన్నిచ్చింది. అయితే, హామీలు మాత్రమే సరిపోవు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం, బాధితులకు భద్రత కల్పించడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత.స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దళితులు సమానత్వం కోసం పోరాడాల్సి రావడం మన సామాజిక వ్యవస్థలోని లోపాలను బయట పెడు తోంది. కులవివక్షకు, పెత్తం దారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడటమే మార్గం. దళితులకు న్యాయం జరిగి, వారి ఆత్మగౌరవానికి భంగం కలగని సమాజం ఏర్పడినప్పుడే స్వాతంత్య్రం, రాజ్యాంగం అందించిన సమానత్వానికి నిజమైన అర్థం లభిస్తుంది.
ఎం. అడివయ్య, 9490098713






కామెంట్లు (0)