Magazines

యువతకేదీ ఉపాధి?

1 గంట క్రితం

youth
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 3 నిమిషాల చదవడం

చదువులు పూర్తిచేసినా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరకక విద్యార్థులు, నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దేశంలో ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్నప్పటికీ, వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. 2025 పిఎల్‌ఎఫ్‌ఎస్‌ గణాంకాల ప్రకారం దేశంలో 15-29 ఏళ్ల యువతలో నిరుద్యోగిత రేటు 9.9 శాతంగా ఉంది. తెలంగాణలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. యువతకు చదువు పూర్తయిన తర్వాత గౌరవప్రదమైన, స్థిరమైన ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించకపోవడంతో చాలామంది యువత తక్కువ వేతనాలతో, తమ విద్యార్హతలకు సంబంధం లేని ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ నిస్తేజంగా జీవిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కొరత యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలోని దాదాపు 250 జిల్లాల్లో 15–29 ఏళ్ల యువతలో 25 శాతానికి పైగా ఉద్యోగం, విద్య లేదా వృత్తి శిక్షణ-ఈ మూడింటిలో ఏదీ పొందడం లేదనే గణాంకాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని ప్రకటిస్తూ యేటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే ఉద్యోగ క్యాలెండర్‌, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి హామీలు ఇచ్చినా వాటి అమలుపై యువతలో నిరాశ నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా, నిర్దిష్ట కాలపరిమితిలో అమలు చేయాలి.

ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను గుర్తించి పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు విడుదల చేసి నియామకాలు చేపట్టాలి.ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా దేశంలో ఉన్న సహజ వనరులు, సాగుభూమి, విస్తారమైన మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్థానికంగానే వస్తువులు, సేవలు ఉత్పత్తి చేసే విధంగా పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. స్థానిక మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి, వాటికి అవసరమైన నైపుణ్యాలను స్థానిక యువతకు అందిస్తే చదువు పూర్తయిన తర్వాత ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుంది. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను విద్యలో భాగం చేయాలి. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి స్థానిక మార్కెట్‌, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించాలి. చదువుతో పాటు నైపుణ్యం, నైపుణ్యంతో పాటు ఉపాధి లభించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలి. ‘లెర్నింగ్‌తో పాటు ఎర్నింగ్‌’ అనే విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా యువతను స్వయం ఉపాధి వైపు కూడా ప్రోత్సహించాలి. విద్యారంగానికి తగినంత బడ్జెట్‌ కేటాయించి నాణ్యమైన విద్యను అందించాలి. మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులు లేకుండా పాఠశాలలను మూసివేయడం భవిష్యత్తు మానవ వనరులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

పాఠశాలలను మూసివేయడం కంటే వాటిని బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భవిష్యత్తులో ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించాలి. విద్యపై పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే దేశ మానవ వనరులను సమర్థంగా అభివృద్ధి చేయగలం.నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలి. యువత తమకు ఉన్న నైపుణ్యాలతో చిన్న వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందించాలి. ఒక యువకుడికి స్వయం ఉపాధి కల్పించడం ద్వారా అతని కుటుంబ ఆదాయం పెరగడమే కాకుండా మరికొందరికి కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. దీనివల్ల వ్యక్తిగత ఆదాయాలు పెరగడంతో పాటు రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది. దేశంలో ఉన్న విస్తారమైన మానవ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే నిరుద్యోగ సమస్యను అవకాశంగా మార్చుకోవచ్చు. స్థానిక అవసరాలకు అనుగుణంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, యువతకు శిక్షణ ఇవ్వడం, స్వయం ఉపాధికి రుణాలు అందించడం ద్వారా కుటుంబ ఆదాయాలు పెరగడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. యువతను కేవలం ఓటు వేసే యంత్రాలుగా కాకుండా దేశ భవిష్యత్తును నిర్మించే శక్తిగా ప్రభు త్వాలు గుర్తించాలి. ఉద్యోగాలు, నైపుణ్యాలు, పరిశ్రమలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించిన ప్పుడే యువతలో విశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించ కుండా కేవలం ఎన్నికల హామీలతో యువతను మభ్యపెట్టే రోజులు ఎక్కువ కాలం ఉండవు. రాబోయే రోజుల్లో విద్యార్థి, నిరుద్యోగ యువత తమ సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసి ప్రశ్నించే పరిస్థితి తప్పదు.


అనంతుల మధు, 9505866698

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్