లిస్బన్లో గుడారాలు తొలగించి ఆందోళనకారుల అరెస్టు
ఆకాశాన్నంటుతున్న ఇండ్ల ధరలు, అద్దెలతో యువతకు కష్టాలు
పోలీసుల తీరు సరికాదన్న లెఫ్ట్ బ్లాక్ పార్టీ
లిస్బన్: నివాస గృహాల ధరలు, అద్దెల పెరుగుదలకు వ్యతిరేకంగా పోర్చుగల్ రాజధాని లిస్బన్లో చేపట్టిన నిరసనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన నిరసన శిబిరాన్ని ఆదివారం తెల్లవారుజామున తొలగించి, పలువురిని అరెస్టు చేశారు. ఈ చర్యలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. పోర్చుగల్లో గృహ సంక్షోభం తీవ్రంగా ఉంది. 2017 నుంచి ఇండ్ల ధరలు రెండింతలకు పైగా పెరిగాయి. అలాగే కొత్త అద్దె ఒప్పందాల ధరలు కూడా దాదాపు రెట్టింపయ్యాయి. ముఖ్యంగా యువత ఇల్లు కొనలేక, అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. శనివారం వేలాది మంది ప్రధాన రహదారిపై నిరసన ప్రదర్శన నిర్వహించి, రోస్సియో కూడలిలో వందకు పైగా గుడారాలు వేశారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల తర్వాత పోలీసు బలగాలు, పోలీసు కుక్కలతో అక్కడికి చేరుకుని గుడారాలను తొలగించాయి. నిరసనకారులు అడ్డుకోవడంతో పలువురిని అరెస్టు చేశారు. పోలీసుల చర్య పూర్తిగా అసమంజసమని లెఫ్ట్ బ్లాక్ పార్టీకి చెందిన ఫాబియన్ ఫిగ్యురెడో విమర్శించారు. దేశవ్యాప్తంగా 3 లక్షల ఇండ్ల కొరత ఉందని పోర్చుగల్ సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది. అద్దె నియంత్రణలను తొలగించి, అద్దెదారులను ఇండ్ల నుంచి ఖాళీ చేయించడం సులభం చేసే ప్రభుత్వ ప్రతిపాదనను నిరసనకారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లుకు పార్లమెంటులో తొలి దశ ఆమోదం లభించింది. ఇండ్ల సమస్యపై బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్లలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి.







కామెంట్లు (0)