Magazines

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

3 గంటల క్రితం

Nobel Prize
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 3 నిమిషాల చదవడం

కార్ల్ డిసెరోథ్‌, పీటర్ హెగెమన్‌, జార్జ్ నగెల్‌కు ఈ గౌరవం

ఆప్టోజెనెటిక్స్‌పై పరిశోధనలకు గానూ పురస్కారం
కాంతిని ఉపయోగించి మెదడులోని నాడీ కణాలను నియంత్రించడం దీని ప్రత్యేకత
జ్ఞాపకాలు, భావోద్వేగాలను ఎలా ప్రభావితం చేస్తాయన్న దానిపై కీలక ముందడుగు


స్టాక్ హోమ్ : వైద్య శాస్ర్తంలో విశేష కృషికి ముగ్గురు వైద్యులకు నోబెల్‌ ‌పురస్కారం వరించింది. కాంతి ద్వారా జీవకణాల్లోని అయాన్ ఛానెళ్లను నియంత్రించే పద్ధతులు, ఆప్టోజెనెటిక్స్‌ రంగంలో చేసిన పరిశోధనలకు గాను అమెరికాకు చెందిన కార్ల్ డిసెరోథ్‌, జర్మనీకి చెందిన పీటర్ హెగెమన్‌, జార్జ్ నగెల్‌లను నోబెల్ కమిటీ విజేతలుగా ప్రకటించింది. 2026 ఏడాదికి సంబంధించిన నోబెల్‌ పురస్కారాల ప్రకటనలు సోమవారం నుంచి ప్రారంభ మయ్యాయి. తొలిరోజు వైద్యశాస్ర్తంలో విశేష కృషి చేసిన వైద్యుల పేర్ల ప్రకటన స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో వెలువడింది. ఇక మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం రంగాల్లో విశేష కృషి చేసిన వారి పేర్లను వెల్లడించనున్నారు. శుక్రవారం నోబెల్‌ శాంతి బహుమతి విజేతను ప్రకటిస్తారు. అక్టోబర్‌ 12న అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం అందుకునే వారి పేర్లను వెల్లడించనున్నారు. ఈ నోబెల్ ప్రైజ్ మనీ విలువ 12 లక్షల డాలర్లు (రూ.11.5 కోట్లు).


​
చిన్న ఆల్గీ నుంచి పెద్ద ఆవిష్కరణ
క్లామిడోమోనాస్ అనే ఒకే కణం కలిగిన చిన్న ఆల్గీపై శాస్ర్తవేత్త పీటర్ హెగెమన్‌ ఆసక్తి చూపారు. ఆయన మొదటి కీలక అడుగు ఈ పరిశోధనతో ప్రారంభమైంది. ఆ జీవి కాంతి వైపు ఎలా కదులుతుందనే ప్రశ్న ఆయనను పరిశోధన వైపు నడిపించింది. ఆ తర్వాత జార్జ్ నగెల్‌తో కలిసి హెగెమన్‌ చేసిన పరిశోధనల్లో చానల్‌రోడాప్సిన్‌ అనే ప్రత్యేక ప్రొటీన్‌ గుర్తించారు. ఇది ఆ ఆల్గీ కణం ఉపరితలంలో ఉంటుంది. దానిపై నీలి కాంతి పడినప్పుడు ప్రొటీన్‌లోని ఒక మార్గం తెరుచుకుంటుంది. దీంతో విద్యుత్‌ ఛార్జ్‌ కలిగిన అయాన్లు కణంలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా విద్యుత్‌ సంకేతం ఏర్పడుతుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఆ ప్రొటీన్‌ను వేరే కణాల్లోకి ప్రవేశపెట్టినా, ఆ కణాలను కాంతికి స్పందించేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు.


నాడీకణాలకు లైట్ స్విచ్ ఆ ఆవిష్కరణను నాడీకణాలపై ఉపయోగించే దిశగా కార్ల్ డిసెరోథ్‌ కీలక అడుగు వేశారు. ఎలుకల నాడీకణాల్లో చానల్‌రోడాప్సిన్‌ కోసం అవసరమైన జన్యువును ప్రవేశపెట్టారు.
ఆ తర్వాత నీలి కాంతిని ఉపయోగించి ఆ నాడీకణాలను యాక్టివేట్‌ చేయగలిగారు. 2005లో ఆయన ఈ పరిశోధనను ప్రచురించారు. 2007లో మరో కీలక ముందడుగు వేశారు. జీవించి ఉన్న ఎలుక మెదడులోనే కాంతిని ఉపయోగించి నాడీకణాలను నియంత్రించ గలిగారు. అక్కడి నుంచి ఆప్టోజెనెటిక్స్‌ ప్రపంచవ్యాప్తంగా న్యూరోసైన్స్‌ పరిశోధనల్లో కీలకమైన పద్ధతిగా మారింది.


​మెదడు రహస్యాలను తెలుసుకునేందుకు!
ఆ పద్ధతితో మెదడులోని నిర్దిష్ట నాడీకణాలను యాక్టివేట్‌ చేయడం లేదా వాటి కార్యకలాపాలను తగ్గించడం సాధ్యమైంది. దీంతో కొన్ని ప్రత్యేక జ్ఞాపకాలు, భావోద్వేగాలు, ప్రవర్తనల వెనుక పనిచేసే నాడీ సర్క్యూట్లను పరిశోధకులు మరింత స్పష్టంగా అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా నాడీ సంబంధిత, మానసిక సమస్యలకు సంబంధించిన మెదడు సర్క్యూట్లను అర్థం చేసుకోవడంలో ఇది ఉపయోగపడుతోంది. చూపు కోల్పోయిన వారికి తిరిగి దృష్టిని అందించే ప్రయత్నాల్లోనూ ఆప్టోజెనెటిక్స్‌ను ఉపయోగించే పరిశోధనలు జరుగుతున్నాయి.


​ముగ్గురికి సమానంగా నోబెల్ నగదు

కార్ల్ డిసెరోథ్‌ అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. పీటర్ హెగెమన్‌ జర్మనీలోని హంబోల్ట్ యూనివర్సిటీకి చెందినవారు. జార్జ్ నగెల్ కూడా జర్మనీలోని వుర్జ్‌బర్గ్ యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్నారు. ఆ ముగ్గురూ కలిసి అందుకున్న 2026 వైద్యశాస్త్ర నోబెల్ పురస్కారం నగదు 12 మిలియన్ స్వీడిష్ క్రోనర్. ఆ మొత్తాన్ని ముగ్గురూ సమానంగా పంచుకోనున్నారు. గతేడాది వైద్యశాస్త్రంలో నోబెల్‌ బహుమతి మానవ రోగ నిరోధక వ్యవస్థపై కీలక పరిశోధనలు చేసిన మేరీ ఈ. బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్‌, షిమోన్ సకగుచిలకు దక్కింది.


​ఆప్టోజెనెటిక్స్ అంటే?

కాంతిని ఉపయోగించి నాడీకణాల పనితీరును నియంత్రించే పద్ధతినే ఆప్టోజెనెటిక్స్ అంటారు. మన మెదడులో కోట్లాది నాడీకణాలు ఒకదానితో ఒకటి సంకేతాలను పంపించుకుంటూ పనిచేస్తుంటాయి. ఏ నాడీకణం ఏ పని చేస్తుంది? దాన్ని యాక్టివ్‌ చేస్తే ఏం జరుగుతుంది? దాన్ని ఆపితే ఏ మార్పు వస్తుంది? అనే విషయాలను తెలుసుకోవడం ఇంతకుముందు అంత సులభం కాదు. గతంలో శాస్త్రవేత్తలు మెదడులోని ఏ ప్రాంతం ఏ పనికి సంబంధించిందో గుర్తించేందుకు ప్రయత్నించారు. కానీ ఒక నిర్దిష్ట నాడీకణం కారణంగానే ఒక జ్ఞాపకం, భావన లేదా ప్రవర్తన ఏర్పడుతోందని కచ్చితంగా నిరూపించడం కష్టంగా ఉండేది. మెదడుకు ఒక మ్యాప్‌ వేసినట్టే సమాచారం ఉండేది. కానీ అందులో చాలా ప్రశ్నార్థకాలు ఉండేవి. ఆ పరిస్థితిని మార్చడంలో ముగ్గురి పరిశోధనలు కీలకంగా మారాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్