సీఎస్ సంజయ్ జాజుకు బాబులాల్ వినతి పత్రం
నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం కప్‌లో విజేతలకు నిలిచిన క్రీడాకారులకు ప్రైజ్‌మనీ బకాయిలు తక్షణమే చెల్లించాలని తెలంగాణ క్రీడాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాబులాల్ కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజును కలిసిన బాబులాల్ ఈ మేరకు వినతి పత్రం అందజేశాడు. ‘నిపుణుల కమిటీ సిఫారసులు లేకుండానే ఏకపక్షంగా స్టేడియాల అద్దె, క్రీడాకారుల శిక్షణ ఫీజులు అమాంతం పెంచారు. ఫీజు పెంపు జీవోను రద్దు చేసి పాత ఫీజులనే అమలు చేయాలి. స్టేడియాల్లో మౌలిక సదుపాయాలు లేవు, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణ లేమితో క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎస్ఆర్ నిధులతో స్టేడియాలతో మెరుగైన సదుపాయాలు కల్పించాలి. 12 ఏండ్లుగా కోచ్‌ల నియామకం లేదు. అర్హత లేని వారు క్రీడాశాఖలో డిప్యూటేషన్ల పేరిట తిష్ట వేశారు. వారిని తక్షణమే సొంత శాఖలకు పంపించాలి. సీఎం కప్ విజేతల నగదు బహుమతుల బకాయిలను చెల్లించాలని’ సీఎస్‌కు వినతి పత్రం అందించినట్టు బాబులాల్ తెలిపారు.







కామెంట్లు (0)