స్పిన్‌కు విలవిల్లాడిన బ్యాటర్లు
ఆంధ్రతో రంజీ ట్రోఫీ మ్యాచ్ తొలి రోజు
నవతెలంగాణ-హైదరాబాద్
రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో త్రిపురపై ఇన్నింగ్స్ విజయం సాధించిన హైదరాబాద్.. రెండో రౌండ్లో తొలి రోజు ఆటలోనే చతికిల పడింది. విజయనగరం వేదికగా జరిగిన రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే కుప్పకూలింది. టాస్ నెగ్గిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు అభిరథ్ రెడ్డి (67, 108 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), తన్మయ్ అగర్వాల్ (42, 75 బంతుల్లో 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 109 పరుగులతో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. అభిరథ్ రెడ్డి అర్థ సెంచరీతో మెరువగా, తన్మయ్ అగర్వాల్ ఫామ్ కొనసాగించారు. కొత్త బంతిని ఓపెనర్లు సమర్థవంతంగా ఎదుర్కొవటంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించేలా కనిపించింది. కానీ, బంతిపై మెరుపు తగ్గిన తర్వాత పిచ్ నుంచి టర్న్ లభించటంతో హైదరాబాద్ బ్యాటర్లు విలవిల్లాడారు. ఆంధ్ర స్పిన్నర్లు త్రిపురణ విజయ్ (4/90), సౌరభ్ కుమార్ (3/75), లలిత్ మోహన్ (3/78) స్పిన్ మాయాజాలం ప్రదర్శించారు.
ఓపెనర్లు ఇద్దరినీ సౌరభ్‌కుమార్ అవుట్ చేయగా.. మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. రాహుల్ సింగ్ (20), కొడిమెల హిమతేజ (10) నిరాశపరిచారు. ప్రజ్ఞయ్ రెడ్డి (31, 67 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ రాడేశ్ (58 నాటౌట్, 105 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్థ సెంచరీతో కదంతొక్కాడు. సివి మిలింద్ (1), అనికెత్ రెడ్డి (9), తనయ్ త్యాగరాజన్ (14), రుతిక్ యాదవ్ (7), మహ్మద్ సిరాజ్ (6) తేలిపోయారు. 86 ఓవర్లలో హైదరాబాద్ 275 పరుగులకే కుప్పకూలింది. తొలి రోజు ఆఖర్లో 2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆంధ్ర వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. ఓపెనర్లు హేమంత్ రెడ్డి (4 నాటౌట్), అభిషేక్ రెడ్డి (5 నాటౌట్) అజేయంగా క్రీజులో నిలిచారు.
మనోళ్లు మాయ చేస్తేనే:
విజయనగరం పిచ్ స్పిన్‌కు సహకరిస్తోంది. జింఖాకాలోనూ ఎర్ర మట్టి తొలి రోజే స్పిన్‌కు అనుకూలించింది. దీంతో ఆంధ్ర ఇన్నింగ్స్‌లో వేసిన రెండు ఓవర్లను హైదరాబాద్ స్పిన్ బౌలింగ్ వేసింది. హైదరాబాద్‌లో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. తనయ్ త్యాగరాజన్, అనికెత్ రెడ్డితో పాటు రుతిక్ యాదవ్ పిచ్ నుంచి సహకారం అందిస్తే వికెట్ల వేట సాగిస్తారు. తొలి రోజు ఉదయం సెషన్లో పేసర్లు బంతి పాతబడే వరకు వికెట్ల వేటకు ప్రయత్నించినా.. బంతిపై మెరుపు తగ్గిన తర్వాత త్యాగరాజన్, అనికెత్ రెడ్డి, రుతిక్ యాదవ్ మాయ చేయగలరు. రెండో రోజు ఆటలో మన స్పిన్నర్లు ఆంధ్రను మాయ చేస్తేనే... ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ పాయింట్లపై కన్నేసేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే, తొలి మ్యాచ్‌లో కర్నాటకపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఆంధ్రను నిలువరించటం కష్టతరంగా మారుతుంది. కెప్టెన్ మహ్మద్ సిరాజ్‌కు ఈ మ్యాచ్ కీలకం కానుంది. న్యూజిలాండ్ సిరీస్ ముంగిట పేసర్‌గా వికెట్లు తీయటంతో పాటు నాయకుడిగా అందుబాటులోని బౌలర్లను సమర్థవంతంగా ప్రయోగించటం సిరాజ్ ముందున్న తక్షణ సవాల్.
స్కోరు వివరాలు
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ : తన్మయ్ అగర్వాల్ (సి) అభిషేక్ రెడ్డి (బి) సౌరభ్ కుమార్ 42, అభిరథ్ రెడ్డి (సి) రికీ భుయ్ (బి) సౌరభ్ కుమార్ 67, రాహుల్ సింగ్ (సి) హేమంత్ రెడ్డి (బి) సౌరభ్ కుమార్ 20, కొడిమెల హిమతేజ (సి) రికీ భుయ్ (బి) విజయ్ 10, ప్రజ్ఞయ్ రెడ్డి (బి) లలిత్ మోహన్ 31, రాహుల్ రాడేశ్ నాటౌట్ 58, సీవీ మిలింద్ (ఎల్బీ) లలిత్ మోహన్ 1, అనికెత్ రెడ్డి (సి) రాహుల్ (బి) విజయ్ 9, తనయ్ త్యాగరాజన్ (సి) రేవంత్ రెడ్డి (బి) విజయ్ 14, రుతిక్ యాదవ్ (బి) విజయ్ 7, మహ్మద్ సిరాజ్ (సి) రేవంత్ రెడ్డి (బి) లలిత్ మోహన్ 6, ఎక్స్‌ట్రాలు : 10,
మొత్తం : (86 ఓవర్లలో ఆలౌట్) 275.
వికెట్ల పతనం : 1-109, 2-120, 3-133, 4-141, 5-194, 6-200, 7-211, 8-245, 9-253, 10-275.
బౌలింగ్ : కావురి సాయితేజ 7-2-18-0, లలిత్ మోహన్ 22-3-78-3, కెవి శశికాంత్ 4-3-6-0, త్రిపురణ విజయ్ 27-5-90-4, సౌరభ్ కుమార్ 26-6-75-3.
ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ : హేమంత్ రెడ్డి బ్యాటింగ్ 4, అభిషేక్ రెడ్డి బ్యాటింగ్ 5, మొత్తం : (2 ఓవర్లలో) 9.
బౌలింగ్ : తనయ్ త్యాగరాజన్ 1-0-4-0, అనికెత్ రెడ్డి 1-0-5-0.







కామెంట్లు (0)