ఆసియా క్రీడలు
2026
క్రికెట్, హాకీలో భారత్‌కు పసిడి
ఆర్చరీ, గోల్ఫ్‌లో చారిత్రక గోల్డ్ మెడల్స్
రెజ్లింగ్‌లో ఆమన్ షెరావత్ బంగారు పట్టు
టీమ్ ఇండియా పసిడి ప్రతాపం. అటు క్రికెట్లో, అటు హాకీలో బంగారు పతకం నిలుపుకున్న భారత్.. ఆర్చరీ, రెజ్లింగ్, గోల్ఫ్‌లోనూ బంగారు పతకాలు కొల్లగొట్టింది. ఆసియా క్రీడల ఆఖరు రోజు ఐదు స్వర్ణాలు సాధించిన భారత్.. పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి ఎగబాకింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో భారత్ 85 మెడల్స్‌తో ఆసియా క్రీడలను ముగించింది. నేడు ముగింపు వేడుకలతో నగోయా ఆసియా క్రీడలు ముగియనున్నాయి. 2030 ఆసియా క్రీడలు దోహా (ఖతార్)లో జరుగుతాయి.
నవతెలంగాణ-నగోయా
హలో పసిడి, చలో లాస్ఏంజెలెస్
ఆసియా క్రీడల హాకీలో టీమ్ ఇండియా పసిడి స్వీప్ చేసింది. మహిళల హాకీలో భారత్ విజేతగా నిలువగా.. తాజాగా పురుషుల జట్టు సైతం పసిడి పతకం సాధించింది. ఫైనల్లో మలేషియాపై 5-1తో గెలుపొంది ఆసియా క్రీడల బంగారు పతకంతో పాటు 2028 లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది. గణాంకాలు భారత్ ఆధిపత్యం సూచించినా, మ్యాచ్ హోరాహోరీగా సాగింది. 11వ నిమిషంలోనే లభించిన రెండో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచాడు. 14వ నిమిషంలో సిల్వరస్ షెల్‌లో మెరుపు గోల్‌తో స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత మలేషియాకు మూడు పెనాల్టీ కార్నర్లు లభించగా సుమిత్ అద్భుతంగా నిలువరించాడు. ఆరంభంలో ఇరు జట్లు తప్పిదాలు చేయటంతో పాటు గోల్ అవకాశాలు సృష్టించుకున్నాయి. 23వ నిమిషంలో జగ్రాగ్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్ కొట్టగా భారత్ 2-1తో ముందంజ వేసింది. 42వ నిమిషంలో హార్దిక్ సింగ్, 54వ నిమిషంలో షిలానంద్ లక్రా, 57వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ మళ్లీ గోల్ చేయగా భారత్ 5-1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. తొలి మూడు క్వార్టర్ల ఆటలో ఒక్కో గోల్ కొట్టిన భారత్.. ఆఖరు 15 నిమిషాల ఆటలో రెండు గోల్స్‌తో రెచ్చిపోయింది.
పాక్‌పై పంజా విసిరి..
క్రికెట్లోనూ టీమ్ ఇండియా పసిడి ధమాకా మోగించింది. అమ్మాయిలు పసిడి పతకంతో మెరువగా.. అబ్బాయిలు వారి బాటలోనే నడిచారు. శనివారం జరిగిన పసిడి పోరులో పాకిస్తాన్‌పై భారత్ 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (61, 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), తిలక్ వర్మ (51 నాటౌట్, 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. శివం దూబె (27), ఇషాన్ కిషన్ (20), శ్రేయస్ అయ్యర్ (21) రాణించారు. భారీ ఛేదనలో పాక్ బ్యాటర్ హసన్ నవాజ్ (96, 51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో పోరాడినా ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులే చేసింది. 19 పరుగుల తేడాతో భారత్ గెలుపొంది పసిడి పతకం సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో దూబె (2/33), అక్షర్ పటేల్ (2/29), వాషింగ్టన్ సుందర్ (2/29) రెండేసి వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ సిల్వర్ మెడల్ దక్కించుకోగా.. కాంస్య పతక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 63 పరుగులతో గెలుపొంది బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది.
కుమ్కుమ్ గురి అదిరింది
రికర్వ్ ఆర్చరీలో యువ ఆర్చర్ కుమ్కుమ్ మొహోద్ అదరగొట్టింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం సాధించింది. ఫైనల్లో దక్షిణ కొరియా ఆర్చర్ యెజిన్‌పై 6-5తో కుమ్కుమ్ గెలుపొందింది. 27-29, 29-29, 30-29, 27-28, 30-28తో కుమ్కుమ్ పైచేయి సాధించింది. అంతకుముందు క్వార్టర్ఫైనల్లో దక్షిణ కొరియా ఆర్చర్ కాంగ్‌పై 6-4తో, సెమీఫైనల్లో చైనా ఆర్చర్ జిహుపై 6-2తో కుమ్కుమ్ విజయం సాధించింది. పురుషుల రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో నీరజ్ చౌహాన్ కాంస్య పతకం సాధించగా, బొమ్మదేవర ధీరజ్ నాల్గో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సెమీఫైనల్లో కొరియా ఆర్చర్ లీ చేతిలో ధీరజ్ 3-7తో నిరాశపరచగా, నీరజ్ 1-7తో జపాన్ ఆర్చర్ చేతిలో ఓడాడు. కాంస్య పతక మ్యాచ్‌లో ధీరజ్‌పై 6-4తో పైచేయి సాధించిన నీరజ్ బ్రాంజ్ మెడల్ ఖాతాలో వేసుకున్నాడు.
రెజ్లింగ్‌లో ఆమన్ షెరావత్ బంగారు పట్టుతో మెరిశాడు. పురుషుల ఫ్రీ స్టయిల్ 57కేజీల విభాగం ఫైనల్లో ఉత్తర కొరియా రెజ్లర్ హాన్ చాంగ్ సాంగ్‌పై ఆమన్ షెరావత్ 11-7తో విజయం సాధించాడు. పసిడి పోరులో ఓ పట్టు పట్టిన ఆమన్ మ్యాట్‌పై ఆధిపత్యం చూపించాడు. మహిళల ఫ్రీ స్టయిల్ 53 కేజీల విభాగం ఫైనల్లో అంతిమ్ పంఘాల్కు నిరాశే ఎదురైంది. పసిడిపై కన్నేసి మ్యాట్‌పై అడుగుపెట్టిన అంతిమ్ జపాన్ రెజ్లర్ మోయె చేతిలో ఓటమి చెందింది. అంతిమ్ పంఘాల్ సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. పురుషుల ఫ్రీస్టయిల్ 97 కేజీల విభాగం కాంస్య పతక పోరులో దీపక్ పూనియా ఆకట్టుకున్నాడు. మంగోలియా రెజ్లర్‌పై విజయం సాధించి దీపక్ పూనియా కాంస్య పతకం గెల్చుకున్నాడు.
గోల్ఫ్‌లో రికార్డు పసిడి
గోల్ఫ్‌లో భారత్ చారిత్రక పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రణవి శరత్ ఆసియా క్రీడల్లో ఈ ఈవెంట్లో భారత్‌కు తొలి బంగారు పతకం అందించింది. నాలుగు రౌండ్ల అనంతరం 265 పాయింట్లతో నిలిచిన ప్రణవి అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. 266 పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచినా.. చైనా గోల్ఫర్ యిన్ సిల్వర్, సింగపూర్ గోల్ఫర్ టాన్ బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నారు. మహిళల గోల్ఫ్ జట్టు విభాగంలోనూ భారత్ సిల్వర్ మెడల్‌తో మెరిసింది. ప్రణవి, అదితి అశోక్, దీక్షా దగర్ త్రయం 546 పాయింట్లతో భారత్ ద్వతీయ స్థానంలో నిలిచి రజత పతకం అందుకుంది. చైనా 538 పాయింట్లతో పసిడి నెగ్గగా, చైనీస్ తైపీ కాంస్యం సాధించింది.
భారత్‌కు నాల్గో స్థానం
495 మంది క్రీడాకారులు, 36 క్రీడా పోటీల్లో, 14 రోజులుగా భారత్ గర్వపడే ప్రదర్శన చేసేందుకు సర్వశక్తులూ వడ్డారు. హాంగ్జౌ క్రీడలతో పోల్చితే పతకాల సంఖ్య తగ్గినా.. నగోయాలో టీమ్ ఇండియా సంతృప్తికరం ప్రదర్శన కనబరిచింది.
2026 ఆసియా క్రీడలను భారత్ నాల్గో స్థానంతో ముగించింది. 21 పసిడి, 27 రజత, 37 కాంస్య పతకాలతో ఓవరాల్‌గా 85 మెడల్స్ భారత్ సాధించింది. చైనా 169 పసిడి, 89 రజత, 83 కాంస్యాలతో 341 మెడల్స్ సాధించి అగ్రస్థానం నిలుపుకుంది. ఆతిథ్య జపాన్ 83 పసిడి, 95 రజత, 91 కాంస్యాలతో 269 మెడల్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా 39 పసిడి, 42 రజతాలు, 91 కాంస్యాలతో 150 మెడల్స్ దక్కించుకుంది. 2022 ఆసియా క్రీడల్లో భారత్ 28 పసిడి పతకాలతో 107 మెడల్స్ కొల్లగొట్టింది.







కామెంట్లు (0)