భారత్, కివీస్ తొలి టెస్టు డ్రా
ఆఖరు రోజు ఆటలో మూడే వికెట్లు
డ్రాకు అంగీకరించిన భారత కెప్టెన్ గిల్
న్యూజిలాండ్ గడ్డపై టెస్టు విజయం అంత సులువు కాదు. కోహ్లి, రోహిత్‌లకే ఆ ఘనత సాధ్యపడలేదు. కానీ శుభ్‌మన్ గిల్ తొలి ప్రయత్నంలోనే ఆ ఘనత దక్కించుకునేలా కనిపించాడు. వెల్లింగ్టన్ టెస్టులో ఐదు రోజులూ భారత్ ఆధిపత్యం కొనసాగినా.. ఆఖరు రోజు ఆటలో పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించలేదు. 8 వికెట్ల కోసం వేట మొదలెట్టిన టీమ్ ఇండియా 75 ఓవర్లలో 3 వికెట్లే పడగొట్టింది. మరో 15 ఓవర్ల ఆట ఉండగా, మరో ఐదు వికెట్లు పడే అవకాశాలు సన్నగిల్లటంతో కెప్టెన్ గిల్ డ్రాకు అంగీకరించాడు. భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు శుక్రవారం నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో జరుగనుంది.
నవతెలంగాణ-వెల్లింగ్టన్
భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు చప్పగా ముగిసింది. విజయంపై కన్నేసి ఐదో రోజు ఆటలో బరిలోకి దిగిన టీమ్ ఇండియా.. ఆతిథ్య న్యూజిలాండ్‌పై స్పష్టమైన పైచేయి సాధించింది. కానీ, పిచ్ నుంచి బౌలర్లకు ఏమాత్రం సహకారం లభించలేదు. దీంతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపించినా, పిచ్‌పై పైచేయి సాధించలేక వెల్లింగ్టన్ టెస్టులో విజయానికి దూరమైంది. డార్లీ మిచెల్ (49 నాటౌట్, 186 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), గ్లెన్ ఫిలిప్స్ (26 నాటౌట్, 126 బంతుల్లో 2 ఫోర్లు) జోడీ అజేయ ఆరో వికెట్ భాగస్వామ్యం 43 ఓవర్ల పాటు సాగింది. ఈ జోడీ పరుగుల వేటలో నెమ్మదించినా, వికెట్లు ఇవ్వలేదు. ఫలితంగా, న్యూజిలాండ్ స్వదేశీ టెస్టులో ఓటమి కోరల నుంచి బయటపడింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 120 ఓవర్లలో 5 వికెట్లకు 239 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 720/9 పరుగుల రికార్డు స్కోరు చేయగా, కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో కివీస్‌ను నిలబెట్టిన హెన్రీ నికోల్స్ (175 నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఆరంభంలో ఆశలు రేగినా..
ఐదో రోజు ఆటను టీమ్ ఇండియా ఆశాజనకంగానే మొదలెట్టింది. తొలి గంటలోనే రెండు కీలక వికెట్లు పడగొట్టింది. డెవాన్ కాన్వే (65, 165 బంతుల్లో 7 ఫోర్లు)ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేయగా.. రచిన్ రవీంద్ర (37, 129 బంతుల్లో 4 ఫోర్లు)ను ప్రసిద్ కృష్ణ సాగనంపాడు. 60 ఓవర్లలో 139 పరుగులకు న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టీమ్ ఇండియా విజయం వైపుగా దూసుకెళ్తోందని అనిపించింది. డార్లీ మిచెల్ (49 నాటౌట్), టామ్ బ్లండెల్ (15, 54 బంతుల్లో 1 ఫోర్) ఐదో వికెట్ భాగస్వామ్యానికి అన్షుల్ కాంబోజ్ తెరదించాడు. 77 ఓవర్లలో కివీస్ 176 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఇంకో 58 ఓవర్ల ఆట మిగిలి ఉండటంతో భారత్ విజయం ఖాయమే అనిపించింది.
ఆ ఇద్దరు ప్రతిఘటించారు
డార్లీ మిచెల్ ఓ ఎండ్‌లో నిలదొక్కుకోగా.. మరో ఎండ్ నుంచి గ్లెన్ ఫిలిప్స్ (26 నాటౌట్) నుంచి అతడికి గొప్ప సహకారం లభించింది. ఈ జోడీ భారత బౌలర్లను విసిగించింది. 43 ఓవర్ల పాటు వికెట్ ఇవ్వకుండా క్రీజులో నిలిచారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫీల్డింగ్ మొహరింపులు, బౌలింగ్ ప్రణాళికలు, పేస్, స్పిన్‌తో పాటు పార్ట్‌టైమ్ బౌలింగ్‌ను సైతం ప్రయోగించాడు. అయినా, ఈ జోడీ వికెట్ నిరాకరించింది. ఆఖరు సెషన్ ఆటలో మరో 15 ఓవర్ల ఆట మిగిలి ఉండగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డ్రాకు ప్రతిపాదించాడు. కివీస్ బ్యాటర్లతో షేక్ హ్యాండ్ చేయటంతో వెల్లింగ్టన్ టెస్టు చప్పని డ్రాగా ముగిసింది.
జట్టు కూర్పుపై విమర్శలు
ఐదు రోజుల ఆటలో భారత్ స్పష్టమైన ఆధిపత్యం. ఆఖరు రోజు ఆటలో 8 వికెట్లే అవసరం. చేతిలో 90 ఓవర్లు. అయినా, టీమ్ ఇండియా వెల్లింగ్టన్ టెస్టును డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విజయం ఖాయం అనుకున్న మ్యాచ్‌ను గిల్‌సేన అలా వదిలేసింది. జశ్‌ప్రీత్ బుమ్రాకు తోడు మరో ఎండ్ నుంచి ప్రభావంతంగా వికెట్లు పడగొట్టగల పేసర్ లేడనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహ్మద్ సిరాజ్ అందుబాటులో ఉన్నప్పటికీ.. చీఫ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అతడిని బెంచ్‌కు పరిమితం చేసింది. అనుభవం ఉన్న సీమర్లు, బలమైన గాలులు వీచే మైదానంలో బంతిని వికెట్‌కు ఇరువైపులా స్వింగ్ చేయగల సమర్థుడు మహ్మద్ సిరాజ్. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్లు త్వరగా పడగొట్టినా.. ఆ తర్వాత వికెట్ కోసం బౌలర్లు చెమటోడ్చారు. ఆఖరు రోజు ఆటలో 43 ఓవర్ల పాటు వికెట్ పడకపోవటం పిచ్ నుంచి సహకారం లేకపోవటం ప్రధాన కారణం. కానీ, ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ అనుభవంతో వికెట్లు పడగొట్టేందుకు సిరాజ్ ప్రయత్నం చేసేవాడు. మహ్మద్ సిరాజ్‌తో పాటు సీనియర్ లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను సైతం బెంచ్‌కు పరిమితం చేశారు. పేస్‌తో సిరాజ్, స్పిన్‌తో జడేజా వెల్లింగ్టన్ టెస్టులో కచ్చితమైన వ్యత్యాసం చూపించేవారని విమర్శకుల మాట.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 368/10
భారత్ తొలి ఇన్నింగ్స్ : 720/9 డిక్లేర్డ్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : టామ్ లేథమ్ (సి) రిషబ్ పంత్ (బి) జశ్‌ప్రీత్ బుమ్రా 0, డెవాన్ కాన్వే (సి) రిషబ్ పంత్ (బి) వాషింగ్టన్ సుందర్ 65, హెన్రీ నికోల్స్ (సి) ధ్రువ్ జురెల్ (బి) ప్రసిద్ కృష్ణ 31, రచిన్ రవీంద్ర (సి) రాహుల్ (బి) ప్రసిద్ కృష్ణ 37, డార్లీ మిచెల్ నాటౌట్ 49, టామ్ బ్లండెల్ (సి) పంత్ (బి) కాంబోజ్ 15, గ్లెన్ ఫిలిప్స్ నాటౌట్ 26, ఎక్స్‌ట్రాలు : 16, మొత్తం : (120 ఓవర్లలో 5 వికెట్లకు) 239.
వికెట్ల పతనం : 1-0, 2-60, -132, 4-139, 5-176.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 20-7-42-1, ఆకాశ్ దీప్ 20-6-47-0, అన్షుల్ కాంబోజ్ 22-05-45-1, ప్రసిద్ కృష్ణ 19-10-23-2, వాషింగ్టన్ సుందర్ 35-14-65-1, దేవదత్ పడిక్కల్ 1-0-2-0, యశస్వి జైస్వాల్ 2-0-4-0, ధ్రువ్ జురెల్ 1-0-1-0.






కామెంట్‌లు (0)