Magazines

ప్రతిష్టాత్మకంగా గ్లోబల్‌ సమ్మిట్‌

21 నిమిషాల క్రితం

A prestigious global summit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 3 నిమిషాల చదవడం

ప్రతినిధుల ఆహ్వానం ఘనంగా ఉండాలి..దానికోసం లైజనింగ్‌ ఆఫీసర్‌ వ్యవస్థ

దేశ విదేశాల్లోని యూనివర్సిటీలు హాజరయ్యేలా చూడాలి : సమీక్షా సమావేశంలో సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. రికార్డు స్థాయిలో ఈ కార్యక్రమాన్ని 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అతిపెద్ద బహుళరంగ ఎక్స్ పో గా నిర్వహిస్తున్నామన్నారు. సమ్మిట్ ఏర్పాట్లపై సోమవారం డాక్టర్‌ ‌మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ) లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న సమ్మిట్ ఏర్పాట్ల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమ్మిట్ వేదిక, వివిధ హాల్స్, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్‌పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో, క్లైమేట్ కాంక్లేవ్‌ల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తూ సమ్మిట్ నిర్వహిస్తున్నామనీ, అన్ని రంగాలనుంచి వెయ్యికి పైగా కంపెనీలు పాల్గొంటున్నట్టు సీఎం అధికారులకు వివరించారు. సమ్మిట్‌కు పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరయ్యే అవకాశమున్నందున ఎక్కడా ఇబ్బంది లేకుండా సునాయాసంగా ప్రవేశం కోసం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడాలన్నారు. ఆహ్వానాలు పంపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతినిధులతో అత్యంత మర్యాదగా వ్యవహరించేలా విధుల్లో ఉన్న అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కాకతీయుల శిల్పకళ, సమ్మక్క సారలమ్మ ఆలయంలో ఉన్న తోరణాల నమూనాలు, సోమశిల ఆలయం, నిర్మల్ పెయింటింగ్స్, రాష్ట్రానికి చెందిన భౌగోళిక గుర్తింపు ఉన్న ఉత్పత్తులు, చేనేత, రాష్ట్ర అభివృద్ధి, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర భవిష్యత్ ప్రణాళికలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమైన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులకు అప్పగించాలని ఆదేశించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలనీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు సమ్మిట్‌ ఏర్పాట్లను వివరించారు. 30 ఫుడ్ స్టాల్స్, వివిధ చేనేత వస్త్రాల ప్రదర్శనకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రక్షా ఎక్స్ పో లో భాగంగా డిసెంబర్ 7 వ తేదీన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎయిర్ షోతో పాటు ఇతర కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. ట్రైబల్ సమ్మిట్ లో భాగంగా భారతీయ, వివిధ దేశాల్లోని తెగలకు సంబంధించిన బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు చేయనున్నారు. క్లైమేట్ కాంక్లేవ్ లో భాగంగా సద్గురు జగ్గి వాసుదేవ్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, వివిధ ప్రపంచ స్థాయి నిపుణులు ప్రసంగించనున్నారు. స్థానికంగా ఉన్న ఇక్రిశాట్ వంటి సంస్థల నుంచి శాస్త్రవేత్తలు, స్టార్ట్ అప్స్, స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వాములను చేయనున్నారు. గ్రీన్ ఎకానమీకి సంబంధించిన పెట్టుబడులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. డిసెంబర్ 7న అంతర్జాతీయ విద్యావేత్తలు, నిపుణులతో "స్కూల్‌ ఆఫ్‌ ‌ది ఫ్యూచర్‌" అనే అంశంపై ‌సీఎం స్వయంగా మాట్లాడతారు. డిసెంబర్ 8న "విద్యాసంస్థల్లో సంస్కరణలు’’ అంశంపై చర్చలో పాల్గొంటారు. ఇండియా జాయ్ కాంక్లేవ్ లో భాగంగా దాదాపు 150 యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందులో అడోబ్, సోనీ, ఉబిసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు ప్రదర్శనలు చేయబోతున్నారు. ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 1,500 మంది కంపెనీల సీఈవోలు, ఎండీలు, పెట్టుబడిదారులు, వివిధ దేశాలకు సంబంధించిన రాయబారులు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. సాధారణ పౌరులు, ఔత్సాహికులు సైతం గ్లోబల్ సమ్మిట్ కు డిసెంబర్ 10-13 తేదీల్లో వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు వివరించారు.

​ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, నవీన్ మిత్తల్, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, గ్లోబల్ సమ్మిట్ అధికారుల కమిటీల సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్