నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు మరో కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. తాజాగా గేమింగ్ పరిశ్రమలో పెట్టుబడిదారుడిగా మారాడు. ముంబైకి చెందిన ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 'షాట్‌గన్ గేమ్స్'లో ఆయన వ్యూహాత్మక పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
ఈ విషయాన్ని సంస్థ సహ వ్యవస్థాపకులు జీత్ చందన్, విదిత్ మెహతా ధ్రువీకరించారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని 'టేక్‌డౌన్ జెనెసిస్' పేరుతో యాక్షన్ అడ్వెంచర్ గేమ్‌ను రూపొందిస్తున్నారు.
అమెరికా, యూరప్, యూకే మార్కెట్ల కోసం ఈ గేమ్‌ను అభివృద్ధి చేయనున్నారు. దర్శకుడు విక్కీ అరోరా నేతృత్వంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ.. భారతదేశంలో సృజనాత్మక ప్రతిభకు కొదవలేదని, భారతీయ టాలెంట్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నాడు. కొత్త రంగంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని తెలిపాడు. ఇప్పటికే సినిమా నిర్మాణం, థియేటర్లు, హెల్త్ అండ్ వెల్నెస్ రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న మహేశ్ బాబు తాజాగా గేమింగ్ పరిశ్రమలోకి ప్రవేశించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పెట్టుబడి విలువకు సంబంధించిన వివరాలను సంస్థ వెల్లడించలేదు.





కామెంట్లు (0)