- ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని నెమలిపేటలో ఇటీవల బైక్ ప్రమాదంలో మృతి చెందిన ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు పాయం దుర్గారావు దశదిన కర్మ కు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం హాజరై నివాళులర్పించారు. దుర్గారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీ సమాజ సమస్యలపై స్పందిస్తూ ప్రజల కోసం పనిచేసిన దుర్గారావు ఆకస్మిక మృతి బాధాకరమన్నారు. ఆయన మృతి కుటుంబ సభ్యులతో పాటు ఆదివాసీ సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. విషాద సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
దుర్గారావు కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాద వివరాలు, కుటుంబ పరిస్థితులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. దుర్గారావు దశదినకర్మకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆదివాసీ జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్థులు హాజరై నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మడకం కుమారి ఆంధ్రయ్య, ఉపసర్పంచ్ ఆకుల శ్రీను, వార్డు సభ్యుడు మడకం ఆంధ్రయ్య, వేల్పుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)