Magazines

అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రంగం సిద్ధం

7 గంటల క్రితం

Kabaddi games
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం

- ఈనెల 10, 11, 12 తేదీల్లో నిర్వహణ 

- ప్రోకబడ్డీ స్థాయి లోళఅండర్‌ - 20 బాలికల పోటీలు

- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 10, 11, 12 తేదీల్లో అశ్వారావుపేట మినీ క్రీడా మైదానంలో 52 వ తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్‌ - 20 బాలికల జూనియర్‌ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు,ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారిణులు తరలిరానున్న నేపథ్యంలో పోటీలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం మినీ క్రీడా మైదానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పోటీల వివరాలను వెల్లడించారు.


మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన అండర్‌ - 20 బాలికల కబడ్డీ జట్లు పాల్గొంటాయని ఎమ్మెల్యే తెలిపారు. క్రీడాకారిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలతో పాటు ఇతర అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోటీల నిర్వహణకు మైదానాన్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంత యువతి ల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు బాలికలను క్రీడారంగంలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్రస్థాయి పోటీలకు అశ్వారావుపేటను వేదికగా ఎంపిక చేసినట్లు జారె ఆదినారాయణ తెలిపారు. క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. బాలికలు క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాలు ప్రోత్సహించాలని కోరారు.


రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అశ్వారావుపేట వేదిక కావడం ఈ ప్రాంత క్రీడాభిమానులకు గర్వకారణమన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు కబడ్డీ అసోసియేషన్‌ సభ్యులు, క్రీడా కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్రీడాకారిణులను ప్రోత్సహించాలని కోరారు.

సమావేశంలో కబడ్డీ పోటీల రాష్ట్ర స్థాయి పరిశీలకులు కే.క్రిష్టాఫర్ బాబు,జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి కే. స్వాతిముత్యం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జూపల్లి రమేష్‌బాబు, జిల్లా కోశాధికారి కూరాకుల నరేష్‌, జిల్లా సంయుక్త కార్యదర్శి ఏసు, కబడ్డీ కోచ్‌ సీహెచ్‌. రాంబాబు, సీనియర్‌ క్రీడాకారులు బి. సరీరామ్‌, గాంధీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్