నాగార్జున నగర్‌లో డ్రైనేజీ సమస్య.. పట్టించుకోని అధికారులు!

14 నిమిషాల క్రితం

Nagarjuna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - నాచారం : ఉమ్మడి చర్లపల్లి–కుషాయిగూడ డివిజన్ పరిధిలోని నాగార్జున నగర్ కాలనీలో డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సాయి సింధు గ్రామర్ స్కూల్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు రోడ్డుపై నిలిచిపోతోంది. దీంతో పాఠశాల విద్యార్థులు, కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసన, దోమల బెడదతో చిన్నారులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా కాలనీలోని ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో చెట్లు, పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఈ సమస్యలపై జీహెచ్‌ఎంసీ శానిటేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని వాపోతున్నారు.

డ్రైనేజీ సమస్యపై పలుమార్లు జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసినా పరిష్కారం లభించలేదని కాలనీవాసులు తెలిపారు.

ఇప్పటికైనా ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా ఐఏఎస్ స్పందించి కాలనీలో సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. జలమండలి అధికారులతో సమన్వయం చేసి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలోని చెట్లు, పిచ్చిమొక్కలను తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులు, కాలనీవాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్