నవతెలంగాణ–రాయపోల్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ విద్యా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన బర్కం పావనికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తరఫున రూ.10 వేల నగదు బహుమతి చెక్కును ఆమె తండ్రి బి. నర్సింలుకు అందజేశారు. అనంతరం 'చదువుకో తెలంగాణ' పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడంతో పాటు, వారిలోని ప్రతిభను వెలికితీసి ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమన్నారు.
వడ్డేపల్లి సర్పంచ్ రాజాగారి రాజాగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ యాజమాన్యానికి, సంస్థ వ్యవస్థాపకులు త్యాగరాజన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు తనవంతుగా 2026–27 విద్యా సంవత్సరంలో రాయపోల్ మండల స్థాయిలో పదో తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించే విద్యార్థులకు వరుసగా రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి చొప్పున నగదు బహుమతులు అందజేస్తానని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో బేగంపేట సర్పంచ్ మద్ద గీత ప్రవీణ్, వడ్డేపల్లి సర్పంచ్ రాజాగారి రేణుక, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రమీల, గోవర్ధన్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ గజ్వేల్ బ్రాంచ్ సీనియర్ ఏరియా మేనేజర్ విమల, అసిస్టెంట్ మేనేజర్ రవీందర్, ఉద్యోగులు శ్రీను, డెవలప్మెంట్ ఆఫీసర్ జాల శ్రీనివాస్, సేల్స్ ఆఫీసర్ మద్ద ప్రవీణ్, సీఆర్పీ యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)