రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బొబ్బల యాకుబ్ రెడ్డి
నవతెలంగాణ-నెల్లికుదురు
నవంబర్ 15 నుంచి 18 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కేంద్రమైన నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ అఖిలభారత మహాసభల సందర్భంగా 15న జరిగే రైతు బహిరంగ సభ ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బొబ్బల యాకూబ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గునగంటి రాజన్న, జిల్లా కోశాధికారి ఆకుల రాజు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ నుండి బహిరంగ సభ ప్రచార జాతను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
దేశవ్యాప్తంగా 1.58 కోట్లకు పైగా సభ్యత్వంతో అఖిలభారత కిసాన్ సభ ప్రపంచంలోనే అతిపెద్ద రైతాంగ ఉద్యమ సంస్థగా కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెభాగా, వర్లీ ఆదివాసీ, పున్నప్ర-వయలార్, సుర్మా లోయ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను నిర్మిస్తోందని పేర్కొన్నారు. ఆ చారిత్రాత్మక పోరాటాల చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశవ్యాప్తంగా రైతులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం అఖిలభారత కిసాన్ సభ అనునిత్యం అండగా నిలుస్తోందని వివరించారు.
నవంబర్ 14న నిర్వహించే రైతు ఎగ్జిబిషన్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించిన చారిత్రక పోరాటాలు, రైతాంగ ఉద్యమాలు, వ్యవసాయ పరిస్థితులను ప్రతిబింబించే అంశాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.ఈ మహాసభలు రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగ భవిష్యత్తు, రైతుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై దేశవ్యాప్త చర్చకు కీలక వేదికగా నిలవనున్నాయని పేర్కొన్నారు. జిల్లా నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అన్నదాతను కాపాడటం అంటే దేశాన్ని కాపాడటమేనని, శ్రమజీవుల హక్కులను పరిరక్షించకుండా సమానత్వంతో కూడిన అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇసంపేల్లి సైదులు పెరుమాండ్ల బాబుగౌడ్, తోట నర్సయ్య, బానాలయాకయ్య, ,తొటశ్రీను ,అచ్చ నగేష్ ,బండవెంకన్న, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)