ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ చలో ఢిల్లీ
10 లక్షల మంది వస్తారని అంచనా
న్యూఢిల్లీ : ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నవంబర్ 1న 'చలో ఢిల్లీ' కార్యక్రమానికి ఇండియా బ్లాక్ పిలుపునిచ్చింది. రామ్‌లీలా మైదాన్‌లో జరిగే భారీ బహిరంగ సభకు 10 లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని నేతలు అంచనా వేస్తున్నారు. నవంబర్ 1న రాజధానికి చేరుకోనున్న 'చలో ఢిల్లీ' మార్చ్ రామ్‌లీలా మైదాన్‌లోని సభతో ముగుస్తుంది. ఎన్నికల సంఘం అవకతవకలకు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు వ్యతిరేకంగా ఈ ఆందోళన జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ ప్రముఖంగా లేవనెత్తనుంది. ఆందోళనను వాయిదా వేయాలని ఒత్తిడి వచ్చినా, కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపాయి. ఈ ర్యాలీలో అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు పాల్గొనాలని పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాలు జారీచేశారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండాలని పార్టీ ఎంపీలకు సూచించారు. ఈ మార్చ్‌కు సమీకరణ ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు ఆదివారం ఇందిరా భవన్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు, విభాగాల చైర్పర్సన్లు, ఇన్చార్జి లతో కాంగ్రెస్ నేత వేణుగోపాల్ సమావేశమయ్యారు. సన్నాహాలను కూలంకషంగా సమీక్షించారు. ఈ యాత్రలో కనీసం పది లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశం గురించి వేణుగోపాల్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘నవంబర్ 1న వోట్ చోరీకి వ్యతిరేకంగా జరగనున్న ఇండియా బ్లాక్ మెగా ర్యాలీ సన్నాహాలను సమీక్షించేందుకు ఈరోజు ఇందిరా భవన్లో వివిధ అనుబంధ సంస్థలు, విభాగాల చైర్పర్సన్లు, ఇన్‌చార్జ్‌లతో సమావేశమయ్యాం’’ అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనల్లో పాల్గొని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని, ఈ ఓటు దొంగలను అధికారం నుంచి తరిమికొట్టేందుకు ఐక్యంగా ఉండాలన్నారు. ఈ ఆందోళనకు ముందు, ఈ నెల 30న కాంగ్రెస్ నమూనా పార్లమెంట్ నిర్వహించనుంది. అందులో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతీకాత్మకంగా ‘‘ప్రజా అభిశంసన’’ ప్రక్రియ చేపడతామని ప్రకటించారు.
మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్ : రాహుల్‌గాంధీ
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఇండియా కూటమి తలపెట్టిన ర్యాలీపై అధికార కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ర్యాలీకి తమకంటే ఎక్కువగా బీజేపీ, దాని మిత్రపక్షాలే ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ ర్యాలీకి ఇంత ఉత్సాహంతో పెద్దఎత్తున పబ్లిసిటీ చేస్తున్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీల నేతలకు కృతజ్ఞతలు రాహుల్‌గాంధీ తెలిపారు. రాబోయే 7 రోజులు కూడా ఇదే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని కొనసాగించాలని వ్యంగ్యంగా అన్నారు. మరోవైపు నవంబర్ 1న నిర్వహించతలపెట్టిన నిరసన ర్యాలీలో పాల్గొనాలని విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, వ్యాపారులకు పిలుపునిచ్చారు.







కామెంట్లు (0)