Magazines

ఫారం–6 మార్పులను ఆమోదించలేదు

1 గంట క్రితం

The changes in Form-6 were not approved.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై పిటిషన్లపై సుప్రీం విచారణ

పలువురికి నోటీసులు
తక్షణ సస్పెన్షన్‌కు నిరాకరణ..
ఈసీ వివరణ తీసుకున్న తర్వాతే నిర్ణయం
‘సర్‌’ నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారన్న ఆరోపణలపై ధర్మాసనం విచారణ

నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న ఫారం–6లో చేసిన మార్పులను సుప్రీంకోర్టు ఆమోదించలేదని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ సహా ఎన్నికల సంఘం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జోయమాల్య బాగ్చి, జస్టిస్‌ వి.మోహనల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సంబంధిత పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది.​ ఫారం–6లో మార్పులను సుప్రీంకోర్టు ఆమోదించిందంటూ ఎన్నికల సంఘం ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో సీజేఐ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. “మార్చిన ఫారం–6ను మేం ఆమోదించలేదు. దీనిపై స్పష్టత ఉండాలి. రికార్డులు సమర్పించినప్పుడు ఎవరు ఈ మార్పులు చేశారో పరిశీలిస్తాం” అని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. బిహార్‌ సర్‌పై మే 2026లో ఇచ్చిన తీర్పులో కొత్తగా మార్చిన ఫారం–6ను సుప్రీంకోర్టు పరిశీలించలేదని కూడా విచారణ సందర్భంగా స్పష్టమైంది. కొత్త ఫారం–6లో తొలిసారి ఓటరుగా నమోదు చేసుకునే వ్యక్తి తాను లేదా తన తల్లిదండ్రులు గత సర్‌ జాబితాలో ఉన్నారా? అనే వివరాలను వెల్లడించాల్సి వస్తోంది. ఈ అదనపు వివరాలను చేర్చడంపై ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు పిటిషన్లలో పేర్కొన్నారు.


సీఈసీ సస్పెన్షన్‌కు
నిరాకరణ ‘సర్‌’ ప్రక్రియలో 14 కీలక నిర్ణయాలను సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌, ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తీసుకున్నారన్న ఆరోపణలపై మరో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌లో జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు కోరారు. అయితే, సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందుగా ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, సీఈసీ, ఇతర సంబంధిత అధికారుల స్పందన తెలుసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. పిటిషనర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది వికాస్‌సింగ్‌ అత్యవసర మధ్యంతర చర్యలు అవసరమని వాదించారు. ‘సర్‌’కు సంబంధించిన నిర్ణయాలు ఎన్నికల సంఘం చట్టపరమైన విధానాలకు విరుద్ధంగా ఏకపక్షంగా తీసుకున్నట్లయితే అవి ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మాత్రమే తక్షణ నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం పేర్కొంది.


ఉల్లంఘించినట్టు తేలితే నిర్ణయాలను వెనక్కి తీసుకుంటాం : న్యాయవాది
ఎన్నికల సంఘం నిర్ణయాలు చట్ట ప్రకారం ఏకగ్రీవంగా లేదా అవసరమైన సందర్భంలో మెజారిటీ అభిప్రాయంతో ఉండాల్సిన నిబంధనను పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రస్తావించారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, చట్టపరమైన నిబంధనలను ఎన్నికల సంఘం పాటించాలని, ఏదైనా ఉల్లంఘన జరిగినట్లు రికార్డుల ద్వారా తేలితే సంబంధిత నిర్ణయాలను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. సర్‌కు సంబంధించిన నిర్ణయాలు, ఓటర్ల జాబితా డేటా నిర్వహణ, ఫారం–6 మార్పులు తదితర అంశాలపై స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్‌ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని మరో పిటిషన్‌లో కోరారు. సర్‌ సందర్భంగా భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయన్న ఆరోపణలపై ఈసీఐనెట్‌, ఈఆర్ఓనెట్‌ డేటాబేస్‌లను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయాలని కూడా పిటిషనర్‌ కోరారు. ఇవన్నీ పిటిషనర్ల ఆరోపణలేనని, వాటిపై సుప్రీంకోర్టు ఇంకా తుది నిర్ధారణకు రాలేదని గమనించాలి. ఇరు పిటిషన్లపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతో సర్‌ ప్రక్రియలో ఎన్నికల సంఘం నిర్ణయాలపై న్యాయపరమైన పరిశీలనకు మార్గం సుగమమైంది. ఫారం–6 మార్పులపై సుప్రీంకోర్టు చేసిన స్పష్టీకరణ కూడా ఈ వ్యవహారంలో కీలకంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్