మోడీ సర్కారు చెప్తున్నదొకటి.. అంతర్జాతీయ నివేదికలో మరొకటి
భారత వైమానిక దళంలో 35 నుంచి 32కు తగ్గిన క్రియాశీల రాఫెల్ విమానాలు
ఫ్లైట్గ్లోబల్ నివేదికపై రక్షణశాఖ అభ్యంతరం
ఆపరేషన్ సిందూర్ తర్వాత విమానాల నష్టంపై ఇప్పటికీ స్పష్టత కరువు
36 విమానాల నిర్వహణకు టెండర్ ఇచ్చామంటున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ : దేశ రక్షణ రంగంలో అత్యాధునిక యుద్ధవిమానాలుగా ప్రచారం చేసుకుంటున్న రాఫేల్ విమానాల సంఖ్యపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వద్ద క్రియాశీలంగా ఉన్న రాఫెల్ యుద్ధవిమానాల సంఖ్య 35 నుంచి 32కు తగ్గినట్టు బ్రిటన్కు చెందిన విమానయాన ప్రచురణ సంస్థ ఫ్లైట్గ్లోబల్ తాజా నివేదిక వెల్లడించింది. అయితే ఈ అంచనాలను రక్షణశాఖ తోసిపుచ్చడం, ఆపరేషన్ సిందూర్ తర్వాత యుద్ధవిమానాల నష్టంపై ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి వివరాలు వెల్లడించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫ్లైట్గ్లోబల్ విడుదల చేసిన ప్రపంచ వైమానిక దళాల తాజా డైరెక్టరీలో భారత వైమానిక దళం వద్ద క్రియాశీలంగా ఉన్న రాఫేల్ యుద్ధవిమానాల సంఖ్యను 32గా పేర్కొంది. గతేడాది విడుదల చేసిన నివేదికలో ఈ సంఖ్య 35గా ఉంది. ఫ్రాన్స్ నుంచి భారత్ మొత్తం 36 రాఫేల్ విమానాలను కొనుగోలు చేసింది. వీటిలో 28 సింగిల్ సీటర్, ఎనిమిది రెండు సీట్ల విమానాలు ఉన్నాయి.
అయితే ఈ నివేదికలోని వివరాలను రక్షణశాఖ అధికారులు ప్రశ్నించారు.
ఈ గణాంకాలు భారత వైమానిక దళం నుంచి సేకరించినవి కావనీ, మంత్రిత్వశాఖ కూడా ఈ సమాచారాన్ని అందించలేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత వైమానిక దళం యుద్ధంలో నష్టాలు సహజమని వ్యాఖ్యానించినప్పటికీ, ఎన్ని విమానాలు దెబ్బతిన్నాయి? ఏయే రకాల విమానాలు నష్టపోయాయి? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో రాఫేల్ విమానాల సంఖ్య తగ్గడంపై సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు, ఈ ఏడాది జూన్లో మొత్తం 36 రాఫేల్ విమానాలకు నిర్వహణ, మరమ్మతుల సహకారం అందించేందుకు వైమానిక దళం టెండర్ జారీ చేసిందని రక్షణశాఖ వర్గాలు చెప్తున్నాయి. అయితే విమానాల నిర్వహణకు టెండర్ జారీ చేయడం వాటన్నింటినీ ప్రస్తుతం యుద్ధానికి సిద్ధంగా ఉన్న విమానాలుగా చెప్పలేమని నిపుణులు అంటున్నారు.
సిరియం అనే సంస్థ అందించే సైనిక విమానాల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఫ్లైట్గ్లోబల్ ఈ అంచనాలను రూపొందించింది. విమానాల నిర్వహణ, ఆధునికీకరణ, మరమ్మతుల కారణంగా కూడా క్రియాశీల విమానాల సంఖ్యలో మార్పులు రావచ్చని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా వైమానిక దళం కోసం మరో 114 రాఫేల్ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. నౌకాదళం కోసం ఇప్పటికే 26 రాఫేల్-మెరైన్ విమానాలకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశ రక్షణ సామర్థ్యంపై భారీ ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఉన్న యుద్ధవిమానాల వాస్తవ పరిస్థితిపై మాత్రం పూర్తి పారదర్శకత చూపాల్సిన అవసరం ఉందనే ప్రశ్నలు ఈ పరిణామంతో మరోసారి ముందుకొస్తున్నాయి.






కామెంట్లు (0)