నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా సింగూరు- మంజీరా జలాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి అదనపు జలాలను తరలించేందుకు జలమండలి చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఎంబీఆర్)కు గోదావరి జలాలను తరలించేందుకు చేపడుతున్న 1600 మి.మీ. వ్యాసం గల మిషన్ భగీరథ- జలమండలి పైప్‌లైన్ అనుసంధాన పనులను రెండ్రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జలమండలి ఎమ్‌డీ అశోక్ రెడ్డి మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డితో కలిసి శుక్రవారం పైప్‌లైన్ అనుసంధాన పనులను పరిశీలించారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, ట్రయల్ రన్‌కు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.
అటవీ ప్రాంతంలో రాతి పొరలతో జాప్యం
వాస్తవానికి ఈ నెల 15 నాటికే పైప్‌లైన్ నిర్మాణం, అనుసంధాన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే, అటవీ ప్రాంతంగుండా వెళ్లే 150 మీటర్ల పైప్‌లైన్ మార్గంలో భారీ రాతి పొరలను తొలగించాల్సి రావడంతో పనుల్లో జాప్యం ఏర్పడింది. దాంతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం మిగిలిన పనులను వేగవంతంగా చేస్తున్నామని, రెండ్రోజుల్లో పూర్తి చేసి, అనంతరం ట్రయల్ రన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఇదిలావుండగా, ఘన్‌పూర్ ఎంబీఆర్ ప్రాంగణంలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన పైప్‌లైన్ జంక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యి వినియోగానికి సిద్ధంగా ఉంది. మిషన్ భగీరథ పైప్‌లైన్ అనుసంధాన పనులు పూర్తయిన వెంటనే ట్రయల్ రన్ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సింగూరు–మంజీరా జలాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో సింగూరు- మంజీరా జలవనరుల్లో నీటి లభ్యత తగ్గుతున్న దృష్ట్యా నగర తాగునీటి సరఫరాకు జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రోజుకు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలను నగరానికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా సింగూరు- మంజీరా జలాలపై ఆధారపడిన ప్రాంతాలకు నీటి సరఫరాలో ఏర్పడే లోటును సుమారు 50 శాతాన్ని గోదావరి అదనపు జలాలను తరలించి భర్తీ చేయనున్నారు.
సమన్వయంతో పనిచేయాలి: ఎమ్‌డీ
పైప్‌లైన్ పనులను వేగవంతం చేయడంతోపాటు మిషన్ భగీరథ పనులను జలమండలి అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని ఎమ్‌డీ అశోక్ రెడ్డి సూచించారు.
మిగిలిన సాంకేతిక పనులను పూర్తి చేసి, ట్రయల్ రన్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి టెక్నికల్ డైరెక్టర్ ప్రభు, సీజీఎం బలరాం రాజు, మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ రాంచందర్ నాయక్, ఎస్సీ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)