అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో అధునాతన నీటిపారుదల వ్యవస్థ
తొలి విడతలో కి.మీ 119 నుంచి 121 వరకు..
ట్రాఫిక్ అంతరాయం, రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం
10 రోజుల పరిశీలన అనంతరం దశలవారీ విస్తరణకు ప్రతిపాదన
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఓఆర్ఆర్ వెంబడి పచ్చదనం నిర్వహణను మరింత మెరుగుపరచడంతోపాటు ప్రయాణికుల భద్రతను పెంపొందించేందుకు హెచ్ఎండీఏ చర్యలకు శ్రీకారం చుట్టింది. హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఓఆర్ఆర్పై ప్రయోగాత్మకంగా అధునాతన స్ప్రింక్లర్ నీటిపారుదల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. తొలి విడతలో భాగంగా కిలోమీటర్ 119 నుంచి 121 మధ్య ఈ ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వ్యూహాత్మకంగా అమర్చిన ఈ స్ప్రింక్లర్ల ద్వారా రహదారి పక్కన ఉన్న మొక్కలు, గ్రీన్ బెల్ట్లు, సుందరీకరించిన ప్రాంతాలకు సమర్థవంతంగా నీటిని అందించే సదుపాయం కలగనుంది.
ట్రాఫిక్కు, ప్రమాదాలకు అడ్డుకట్ట
ఓఆర్ఆర్పై మొక్కలకు నీరు అందించేందుకు క్రమం తప్పకుండా వాటర్ ట్యాంకర్లను తిప్పాల్సి వచ్చేది. ఆ ట్యాంకర్ల రాకపోకల అవసరాన్ని పూర్తిగా నివారించడమే ఈ నూతన విధానం ప్రధాన లక్ష్యం. ట్యాంకర్లు లేకపోవడం వల్ల ఓఆర్ఆర్పై వాహనాల రద్దీకి, ట్రాఫిక్కు కలిగే అంతరాయాలు తొలగిపోతాయి. తద్వారా రోడ్డు ప్రమాదాల ముప్పును కూడా తగ్గించేందుకు వీలు కలుగుతుంది.
నీరు, నిర్వహణ వ్యయాల ఆదా
ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యం మెరుగుపడటంతో పాటు నీటి సంరక్షణ సాధ్యమవుతుంది. అలాగే, మానవ వనరుల అవసరం, నిర్వహణ వ్యయాలు కూడా భారీగా తగ్గనున్నాయి. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ స్ప్రింక్లర్ వ్యవస్థ పనితీరు, సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు 10 రోజుల పాటు నిశితంగా పర్యవేక్షించనున్నారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉంటే, ఓఆర్ఆర్లోని ఇతర ప్రాంతాలకు కూడా దశలవారీగా ఈ స్ప్రింక్లర్ నీటిపారుదల వ్యవస్థను విస్తరించాలని హెచ్ఎండీఏ ప్రతిపాదిస్తోంది. ఆధునిక నీటిపారుదల సాంకేతికతలను అందిపుచ్చుకోవడం, రహదారి భద్రతను మెరుగుపరచడం, నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఓఆర్ఆర్ వెంబడి పచ్చదనాన్ని సుస్థిరంగా నిర్వహించడం పట్ల తమకున్న నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోందని హెచ్ఎండీఏ స్పష్టం చేసింది.






కామెంట్లు (0)