పండుగ రద్దీతో 68 శాతం పెంపు
ఢిల్లీ–హైదరాబాద్ ప్రయాణం భారం
ఏటీఎఫ్ ధరల సెగ
ముంబయి : పండుగ సీజన్‌లో సొంతూళ్లకు, విహారయాత్రలకు వెళ్లాలనుకునే విమాన ప్రయాణికులకు టికెట్ ధరలు చుక్కలు చూపిస్తు న్నాయి. ప్రధాన దేశీయ మార్గాల్లో విమాన చార్జీలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 68 శాతం వరకు పెరిగాయి. ప్రయాణ డిమాండ్ ఎక్కువగా ఉండటం, విమానాల రాకపోకల సంఖ్య తగ్గడం, విమాన ఇంధనం ధరలు పెరగడం తదితర పరిణామాలు టికెట్ చార్జీలను పైకి నెట్టాయి. ఓఎన్‌జీ డేటా అంచనా ప్రకారం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో దేశీయ విమానాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 5 శాతం తగ్గింది. సీట్ల సామర్థ్యం కూడా1.2 శాతం తగ్గింది. ఎక్కువ సీట్లున్న పెద్ద విమానాలను నడపడానికి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే పలు కీలక మార్గాల్లో ప్రయాణికులపై తీవ్ర భారం పెరిగింది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 10 మధ్య సగటు ఒకవైపు ప్రయాణ చార్జీలను పరిశీలిస్తే ఢిల్లీ–హైదరాబాద్ మార్గంలో 68 శాతం, ముంబయి–కోల్‌కతాలో 51 శాతం, ఢిల్లీ–గోవాలో 39 శాతం, ముంబయి–బెంగళూరులో 37 శాతం పెరిగాయి. ముఖ్యంగా డిమాండ్ ఎక్కువగా ఉండి విమానాల రాకపోకలు తక్కువగా ఉన్న మార్గాల్లో ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
మరోవైపు విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాలపై విమాన ఇంధనం ఎటిఎఫ్ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్టోబర్ 1న దేశీయ ఏటీఎఫ్ ధర లీటరుకు రూ.16 పెరిగి సుమారు రూ.137కు చేరింది. అంతకుముందు ఆగస్టులో రూ.5, సెప్టెంబర్‌లో రూ.6.28 చొప్పున కూడా పెరిగింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఇంధనం వాటా 30–40 శాతం ఉండటంతో ఈ పెరుగుదల నేరుగా చార్జీలపై ఒత్తిడి పెంచుతోందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి తోడు విమాన లీజులు, నిర్వహణ వంటి డాలర్ ఆధారిత వ్యయాలు ఉండటంతో రూపాయి పతనం కూడా ఎయిర్‌లైన్స్ ఖర్చులను ప్రభావితం చేస్తున్నాయని భావిస్తున్నారు. పండుగ రద్దీతో గోవా, లేహ్, డెహ్రాడూన్, అమృత్‌సర్ వంటి దేశీయ గమ్యస్థానాలకు డిమాండ్ బలంగా ఉంది. గోవాకు బుకింగ్‌లు ఏడాది ప్రాతిపదికన 10 శాతం పెరిగాయి. విదేశీ ప్రయాణాలపైనా ఆసక్తి పెరుగుతోంది. హనోయ్ బుకింగ్‌లు రెండింతలకు పైగా పెరగగా.. బాలి 89 శాతం, కొలంబో 76 శాతం, బ్యాంకాక్ 74 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దేశీయ చార్జీలు ఇప్పటికే 30–40 శాతం, అంతర్జాతీయ చార్జీలు 30–50 శాతం అధికంగా ఉన్నాయని ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి. ప్రయాణ తేదీలు దగ్గరపడే కొద్దీ అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో చార్జీలు మరో 15–20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.







కామెంట్‌లు (0)