భారత్‌లో వ్యాపార వాతావరణంపై అమెరికా ఆందోళన
పన్నులు, నిబంధనలు, దిగుమతి ఆంక్షలపై నివేదికలో ప్రస్తావన
న్యూఢిల్లీ : భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే అమెరికా కంపెనీలకు అడుగడుగునా నిబంధనలు, పన్నులు, అనుమతుల సమస్యలు ఎదురవుతు న్నాయని అమెరికా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా నియంత్రణ వ్యవస్థలో మార్పులు, అవినీతి భయాలు, విదేశీ-దేశీయ పెట్టుబడిదారులకు వర్తించే వేర్వేరు నిబంధనలు పెట్టుబడుల ఆకర్షణపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది.
విదేశీ పెట్టుబడిదారులకు అసమాన నిబంధనలు
భారత్ చాలా రంగాల్లో ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండానే ( మొదటిపేజీ తరువాయి )
100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతిస్తోంది. అయితే మల్టీ బ్రాండ్ రిటైల్, ప్రయివేటు బ్యాంకింగ్, ఔషధాలు, రక్షణ, ప్రింట్, డిజిటల్ మీడియా, ఉపగ్రహ రంగాల్లో విదేశీ పెట్టుబడిదారులకు అదనపు అనుమతులు అవసరమని నివేదిక వివరించింది. భారత్‌లోనే ఏర్పాటైన, భారతీయ పన్నులు చెల్లించే, భారతీయ సిబ్బందిని నియమించుకునే విదేశీ కంపెనీలకు కూడా కొన్ని రంగాల్లో ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడం పెట్టుబడిదారులకు అడ్డంకిగా మారుతోందని పేర్కొంది.
అమెరికా పెట్టుబడులు తగ్గాయి
భారత్‌లో అమెరికా ప్రత్యక్ష పెట్టుబడుల నిల్వ 2024లో 58.54 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2023తో పోలిస్తే 3.37 శాతం తక్కువ. అయితే ఈ ఏడాది జులైలో భారత్ నికర ఎఫ్‌డీఐ 7.35 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఐదేండ్లకుపైగా కాలంలో ఇదే అత్యధిక నెలవారీ నికర ఎఫ్‌డీఐ అని నివేదిక పేర్కొంది.
ఎఫ్‌డీఐ–ఎఫ్‌పీఐ నిబంధనలపై అభ్యంతరం
ఐపీఓకు ముందు ఎఫ్‌డీఐ మార్గంలో ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టిన విదేశీ పెట్టుబడిదారు.. ఆ వాటాలను పూర్తిగా విక్రయించే వరకు అదే కంపెనీలో ఎఫ్‌పీఐ మార్గంలో అదనపు పెట్టుబడి పెట్టలేని నిబంధనను అమెరికా ప్రశ్నించింది. ఒకే సంస్థకు చెందిన వేర్వేరు పెట్టుబడి నిధులు ఈ నిబంధన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. ఇప్పటికే లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులకు 10 శాతం ఎఫ్‌పీఐ పరిమితి ఉందని, మళ్లీ ఎఫ్‌డీఐ–ఎఫ్‌పీఐపై అదనపు ఆంక్షలు అవసరమా? అని అమెరికా నివేదిక ప్రశ్నించింది.
దిగుమతులపైనా ఆంక్షలు
భారత్‌లో ప్రత్యేకమైన, అధునాతన పరికరాలను దిగుమతి చేసుకోవడంలోనూ విదేశీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నివేదిక పేర్కొంది. హైఎండ్ సర్వర్లు, సెమీకండక్టర్లు, ఆధునిక పరీక్షా పరికరాల వంటి వాటి దిగుమతులపై అనుమతుల ప్రక్రియ, స్పష్టత లేని మార్గదర్శకాలు వ్యాపార అనిశ్చితిని పెంచుతున్నాయని తెలిపింది. భారత్‌లో విదేశీ బ్యాంకులపై పన్ను భారం దేశీయ బ్యాంకులతో పోలిస్తే ఎక్కువగా ఉందని అమెరికా నివేదిక పేర్కొంది.
లంచాలపై ఆందోళన
భారత్‌లో అవినీతి కూడా అమెరికా కంపెనీలకు సమస్యగా ఉందని నివేదిక వివరించింది. వాస్తవంగా జరిగిన అవినీతి కేసులతో పాటు.. ప్రభుత్వ నియంత్రణ సంస్థలతో వ్యవహరించే సమయంలో అవినీతి జరిగే అవకాశం ఉందన్న భయాలు కూడా కంపెనీల్లో ఉన్నాయని తెలిపింది. కంపెనీల్లో అవినీతి నిరోధక విధానాలు, విజిల్‌బ్లోయర్ రక్షణ, స్వతంత్ర డైరెక్టర్లు, ప్రవర్తనా నియమావళి వంటి చర్యలను కంపెనీల చట్టం నిర్దేశిస్తోందని నివేదిక గుర్తుచేసింది. భారత్-అమెరికా వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ నివేదిక రావడం గమనార్హం.







కామెంట్‌లు (0)