Magazines

ఓటు హక్కు లేకుండా చేయడం రాజ్యాంగ విరుద్ధం

3 గంటల క్రితం

vote
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 3 నిమిషాల చదవడం

అలాంటి ప్రక్రియను సమర్థించలేం

పేరు తొలగించే ముందు నోటీసు, విచారణ తప్పనిసరి : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌


న్యూఢిల్లీ : కోట్లాది మంది భారతీయ పౌరులను ఓటు హక్కుకు దూరం చేసే ఏ ప్రక్రియ అయినా సహజంగానే ఏకపక్షమైనదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అలాంటి చర్యను ఎలాంటి సాకులతోనూ సమర్థించలేమనీ, అది రాజ్యాంగ వ్యవస్థకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన 19వ జస్టిస్‌ బీఆర్‌ సావ్నీ స్మారక న్యాయవాద పోటీల ముగింపు కార్యక్రమంలో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భారతీయ పౌరులను ఓటు హక్కు నుంచి దూరం చేసి, సొంత దేశంలోనే రెండో తరగతి పౌరులుగా మార్చే పరిస్థితి ఏర్పడితే.. అలాంటి ప్రక్రియ సహజంగానే ఏకపక్షమైనదని జస్టిస్‌ భూయాన్‌ అన్నారు. దాన్ని సమర్థించేందుకు ఎన్ని వాదనలు చేసినా ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగానికి గుండెకాయలాంటి అంశాన్ని దెబ్బతీయడమే కాకుండా, రాజ్యాంగ వ్యవస్థను తిరస్కరించడమే

అవుతుందని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం పౌరులను రెండు వర్గాలుగా విభజించలేదని ఆయన గుర్తుచేశారు.

ఓటు హక్కు ఉన్న పౌరులు, ఓటు హక్కు లేని పౌరులు అనే రెండు వర్గాలు రాజ్యాంగంలో లేవన్నారు. భారతీయ పౌరులను పెద్ద సంఖ్యలో ఓటు హక్కు లేకుండా చేసే ఏ ప్రక్రియ అయినా రాజ్యాంగంలోని 326, 14 అధికరణలకు విరుద్ధమవుతుందని చెప్పారు. ‘‘రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు. ఏ అధికార సంస్థ కూడా ఇలా చేయలేదు. ఏ న్యాయస్థానం కూడా ఇలాంటి చర్యను సమర్థించలేదు’’ అని జస్టిస్‌ భూయాన్‌ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మరణించిన ఓటరు విషయంలో తప్ప, ఒకసారి ఓటర్ల జాబితాలో పేరు నమోదైన తర్వాత సంబంధిత వ్యక్తికి నోటీసు ఇచ్చి, తన వాదనను వినకుండా ఆ పేరును తొలగించరాదని అన్నారు. భారత పౌరుడి హోదా నుంచి ఓటు హక్కును లేదా ఓటర్ల జాబితాలో ఉండే హక్కును వేరు చేయలేమని వివరించారు. అలా చేయడమంటే శరీరం నుంచి ఆత్మను వేరు చేయడం లాంటిదని అభివర్ణించారు.పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవడం రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతంతో కూడా ముడిపడి ఉందని జస్టిస్‌ భూయాన్‌ చెప్పారు.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రోహింటన్‌ నారీమన్‌ చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా మారాయి. సెప్టెంబరు 27న ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి గుండెకాయగా ఉన్న సామాన్యుడి ఓటు హక్కు ప్రస్తుతం తీవ్ర ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఇద్దరు సుప్రీంకోర్టు మాజీ, ప్రస్తుత న్యాయమూర్తుల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్ల తొలగింపుపై వివాదం కొనసాగు తోంది. ఎన్నికల జాబితాల నుంచి పేర్లు తొలగించే ప్రక్రియలో ముస్లిం ఓటర్లు అధికంగా ప్రభావితమ య్యారన్న ఆరోపణలూ ఉన్నాయి. జస్టిస్‌ నారీమన్‌ కూడా పశ్చిమ బెంగాల్‌ పరిణామాలను ప్రస్తావిస్తూ.. ఒక ప్రభుత్వం కోరుకున్న ఫలితం కోసం దేశంలోని సామాన్య పౌరుడి ఓటు హక్కును అక్రమంగా తొలగించడం జరిగిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ భూయాన్‌ చేసిన వ్యాఖ్యలు ఓటు హక్కు, పౌరసత్వం, రాజ్యాంగ పరిరక్షణపై జరుగుతున్న చర్చకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగిం చడం కేవలం ఒక పరిపాలనా చర్య కాదని, అది పౌరుడి ప్రజాస్వామ్య హక్కుపై నేరుగా ప్రభావం చూపే అంశమని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్