Magazines

ఎరువులు-ఇంధన సంక్షోభం

3 గంటల క్రితం

Fertilizer
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 4 నిమిషాల చదవడం

పట్టించుకోని మోడీ సర్కార్‌...కాగితాలపై ఎరువుల నిల్వలు పుష్కలం..

క్షేత్రస్థాయిలో మాత్రం కొరతపై ఫిర్యాదులు..ఎరువుల సబ్సిడీ కోసం రూ.1.71 లక్షల కోట్ల బడ్జెట్‌..

సబ్సిడీ భారం రూ.3 లక్షల కోట్లకు పెరిగే ప్రమాదం

యుద్ధాల దెబ్బకు ముడి పదార్థాల ధరలకు రెక్కలు

రైతు, ఆహార భద్రతపై పెరుగుతున్న ముప్పు

కేంద్రం తదుపరి చర్యల పైనే అనేక ప్రశ్నలు


రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయనీ, సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చెప్తోంది. కానీ అంతర్జాతీయ పరిణామాలు, ఎరువుల ముడి పదార్థాల ధరలు, దిగుమతులపై ఆధారపడటం, పెరుగుతున్న సబ్సిడీ భారం చూస్తే పరిస్థితి అనుకున్న విధంగా కనిపించడం లేదు. ఒకవైపు ఇంధన సంక్షోభం.. మరోవైపు ఎరువుల ధరల పెరుగుదల.. ఇంకోవైపు ప్రభుత్వ ఖజానాపై భారీ భారం..ఇవన్నీ కలిస్తే దేశం ఇంధన, ఎరువుల, ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


న్యూఢిల్లీ : పశ్చిమాసియా, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాల ప్రభావం చమురు ధరలకే పరిమితం కావడం లేదు. ఎరువుల తయారీకి అవసరమైన సహజ వాయువు, అమ్మోనియా, సల్ఫర్‌ వంటి ముడి పదార్థాల ధరలపైనా ప్రభావం పడుతోంది. విదేశీ సరఫరా మార్గాల్లో అంతరాయం ఏర్పడితే దాని ప్రభావం నేరుగా భారత వ్యవసాయంపై పడే అవకాశం ఉంది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కూడా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఎరువుల కొరత, ఆహార సంక్షోభం ముప్పు గురించి హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.


అసలు సమస్య ఏమిటి?
కేంద్రం లెక్కల ప్రకారం.. రబీ సీజన్‌ ప్రారంభంలో దేశంలో 1.701 కోట్ల టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇవి సుమారు 38 శాతం ఎక్కువ. యూరియా నిల్వలు 54 శాతం, డీఏపీ తొమ్మిది శాతం, ఎన్‌పీకేఎస్‌ నిల్వలు 36 శాతం అధికంగా ఉన్నాయని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అంటే పైకి చూస్తే ఎరువుల కొరత లేదనేలా పరిస్థితి కనిపిస్తోంది. కానీ సమస్య నిల్వలతోనే కాదు. భారత్‌ తన మొత్తం ఎరువుల అవసరాల్లో సుమారు 73 శాతం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ.. ఆ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలు, ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడుతోంది. దేశీయ యూరియా ఉత్పత్తి కూడా దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జీ, అమ్మోనియాపై గణనీయంగా ఆధారపడి ఉంది. హార్ముజ్‌ జలసంధి సంక్షోభం తర్వాత ఈ ఏడాది తొలి అర్ధభాగంలో భారత్‌ నైట్రోజన్‌ ఎరువుల దిగుమతులు గతేడాదితో పోలిస్తే 52 శాతం పెరిగాయి. ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం భారత్‌ చైనా, ఈజిప్ట్‌, వియత్నాం వంటి దేశాల వైపు చూడాల్సి వచ్చింది.


ముడి పదార్థాల ధరల మంట
ఎరువుల తయారీలో కీలకమైన సల్ఫర్‌ ధరలు ఏడాది ప్రారంభంతో పోలిస్తే రెట్టింపయ్యాయి. డీఏపీ, ఎస్‌ఎస్‌పీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువుల తయారీ ఖర్చు పెరగడానికి ఇది ప్రధాన కారణాల్లో ఒకటి. ఎరువుల తయారీకి అవసరమైన అమ్మోనియా, నైట్రోజన్‌ ఆధారిత ఎరువులకు సహజ వాయువు కీలక ముడి పదార్థాలు. పశ్చిమాసియా, రష్యా వంటి ఇంధన, ఎరువుల ఉత్పత్తిలో కీలకమైన ప్రాంతాల్లో యుద్ధాలు కొనసాగుతుండటంతో ప్రపంచ సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. హార్ముజ్‌ జలసంధి మూసివేత వల్ల ప్రపంచ ఎరువుల వాణిజ్యంలో దాదాపు మూడో వంతు, ప్రపంచ ఎల్‌ఎన్‌జీ వాణిజ్యంలో 20 శాతం, సల్ఫర్‌ వాణిజ్యంలో సుమారు 50 శాతం ప్రభావితమైంది. దీంతో ఇంధన సమస్య క్రమంగా ఎరువుల సమస్యగా, ఆ తర్వాత ఆహార భద్రత సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


కాగితాలపై భరోసా.. క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు
దేశంలో ఎరువుల కొరత లేదని కేంద్రం పదేపదే చెప్తున్నప్పటికీ.. పలు రాష్ట్రాల్లో రైతులు కొరతపై ఆందోళనలు చేపడుతున్నారు. కర్నాటకలో ఎరువుల కొరతపై రైతు సంఘాలు నిరసనలు చేపట్టాయి. యూపీ, హర్యానా, రాజస్తాన్‌, ఒడిశా, బీహార్‌ తదితర రాష్ట్రాల్లో కూడా ఎరువుల కొరత, సరఫరాలో ఇబ్బందులపై అనేక వార్తలు వెలువడ్డాయి. ఇది దేశంలోని వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.


మాటల్లోనే 'ఆత్మనిర్భర్‌' ‘ఆత్మనిర్భర్‌

భారత్‌’ పేరుతో దేశీయ ఉత్పత్తిని పెంచుతున్నామని మోడీ ప్రభుత్వం చెప్తోంది. అయితే ఎరువుల విషయంలో సమస్య కేవలం దేశంలో ఎంత ఉత్పత్తి జరుగుతోందన్నది కాదు. ఆ ఉత్పత్తికి అవసరమైన ఇంధనం, సహజ వాయువు, అమ్మోనియా, సల్ఫర్‌ వంటి ముడి పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నదే కీలకం. భారత్‌ మొత్తం ఎరువుల అవసరాల్లో సుమారు 73 శాతం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ... దేశీయ ఎరువుల తయారీ కూడా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై ఆధారపడుతోంది. దీంతో అంతర్జాతీయ సంక్షోభం ముదిరితే దేశీయ ఉత్పత్తి కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.


ఇదే అసలు ప్రశ్న అందుకే ఇప్పుడు ప్రFertilizerశ్న
కేవలం “దేశంలో ఎరువులు ఉన్నాయా?” అన్నది కాదు. “రైతులకు తక్కువ ధరకు ఎరువులు అందిస్తూ, పెరుగుతున్న సబ్సిడీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతకాలం భరించగలదు?” అన్నదే కీలక ప్రశ్న. పశ్చిమాసియా, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంధనం, ఎరువులు, ఆహార భద్రత, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పరస్పరం ముడిపడి ఉన్నాయి. అంతర్జాతీయ ధరలు, సరఫరా అంతరాయాలు కొనసాగితే రైతులకు ధరలు పెరగకుండా రక్షణ కల్పించేందుకు కేంద్రంపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం భారత్‌పై పడకుండా మోడీ ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసింది? దిగుమతులపై ఆధారపడటాన్ని ఎంతవరకు తగ్గించింది? పెరుగుతున్న సబ్సిడీ భారాన్ని ఎలా భరిస్తుంది? రైతులకు ఎరువుల సరఫరాలో క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న సమస్యలను ఎలా పరిష్కరిస్తుంది? ఈ ప్రశ్నలకు రాబోయే నెలల్లో సమాధానాలు కీలకం కానున్నాయని నిపుణులు చెప్తున్నారు.


ప్రభుత్వానికి భారీ భారం

భారత్‌లో 45 కిలోల యూరియా బస్తా ధర రూ.242 గా ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం అదే ఎరువును ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ తేడాను రైతుకు సబ్సిడీ రూపంలో కేంద్రం భరిస్తోంది. 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ కోసం రూ.1.71 లక్షల కోట్లు కేటాయిం చారు. అయితే అంతర్జాతీయ ధరలు పెరుగుతుం డటంతో ఈ సబ్సిడీ భారం రూ.3 లక్షల కోట్లకు మించ వచ్చని ఎరువుల శాఖ కార్యదర్శి అంచనా వేశారు. యుద్ధానికి ముందు కాలంతో పోలిస్తే యూరియాపై ఒక్కో బస్తాకు సబ్సిడీ భారం 106 శాతం, డీఏపీపై 61 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. అంటే రైతులకు ఎరువుల ధరలు పెరగకుండా చూడటానికి కేంద్ర ప్రభుత్వం మరింత ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదే సమయంలో ఇంధన ధరలను నియంత్రించేందుకు చమురు మార్కెటింగ్‌ సంస్థల కు కూడా ప్రభుత్వం మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్