Magazines

సర్‌‌పై సుప్రీం నోటీసులు

1 గంట క్రితం

Supreme Court notices
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 4 నిమిషాల చదవడం

​ఇండియా బ్లాక్ నేతల పిటిషన్‌పై నిర్ణయం

ఈసీఐ, సీఈసీ సహా కమిషనర్లకు నోటీసులు

ఓటర్ల తొలగింపుపై 
స్వతంత్ర ఆడిట్‌ కోరిన పిటిషనర్లు

కోర్టు రిజిస్ట్రీలోకి ప్రవేశించడంపై విపక్ష నేతలకూ తాఖీదు


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు, ఓటర్ల పేర్ల తొలగింపులో చోటుచేసుకున్న అవకతవకలను సవాల్‌ చేస్తూ ఇండియా బ్లాక్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషీలకు నోటీసులిచ్చింది. గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం 46 పిటిష‌న్ల‌ను క‌లిపి విచారించింది. ఇండియా బ్లాక్ దాఖ‌లు చేసిన‌ పిటిషన్‌లోని అంశాలపై సమాధానం ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది. అయితే పిటిషన్‌ దాఖలు చేసిన వారిలో ఒకరి ప్రవర్తనపై తదుపరి విచారణ సందర్భంగా ప్రశ్నిస్తామని ప్రధాన న్యాయమూర్తి మౌఖికంగా వ్యాఖ్యానించారు.

ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆందోళన

ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో పారదర్శకత పాటించడం లేదని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు చట్టబద్ధంగా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా తీసుకున్నవేనా అనే అంశంపై న్యాయ సమీక్ష జరగాలని కోరారు. సర్‌ ప్రక్రియకు సంబంధించిన పూర్తి రికార్డులను కోర్టు ముందుంచాలని విజ్ఞప్తి చేశారు. 2025 జూన్‌ 24న ‌సర్‌ ప్రారంభానికి సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి ఫైళ్లను సమర్పించాలని పిటిషన్‌లో కోరారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు రాజ్యాంగంలోని 324వ అధికరణ, 2023 నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టంలోని 18వ సెక్షన్‌, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా ఉన్నాయా లేదా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ఓటర్ల తొలగింపుపై స్వతంత్ర ఆడిట్‌

ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన పేర్లపై స్వతంత్రంగా ఆడిట్‌ నిర్వహించాలని పిటిషనర్లు కోరారు. ఇందుకోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. బూత్‌ల వారీగా తొలగించిన ఓటర్ల పేర్లు, వారి పేర్లను తొలగించడానికి గల కారణాలను బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వయస్సు, లింగం ఆధారంగా తొలగింపుల వివరాలను కూడా వెల్లడించాలని కోరారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, తమ వాదన వినిపించుకునే అవకాశం కల్పించకుండా ఏ ఓటరు పేరునూ తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించారు. అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున తొలగిస్తే తిరిగి చేర్చేందుకు సమర్థవంతమైన విధానం ఉండాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ఫారం-6, ఓటర్ల నమోదు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడాలని కోరారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు దేశవ్యాప్తంగా సర్‌ ప్రక్రియను నిలిపివేయాలని కూడా పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల సంఘం నిర్ణయా‌లు పారదర్శకంగా ఉండాలి : ఇండియా బ్లాక్‌

ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని, చట్టప్రకారం సమష్టి నిర్ణయ ప్రక్రియను అనుసరించాలని ఇండియా బ్లాక్ నేతలు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ‌సర్‌ ప్రక్రియను నిలిపివేయడంతోపాటు, ఓటర్ల పేర్ల తొలగింపుపై సమగ్ర పరిశీలన జరపాలని కోర్టును ఆశ్రయించారు. ‌సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌తో ఈనెల 12న రాహుల్‌ గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టు వైపు నిరసన ప్రదర్శనగా వెళ్లిన అనంతరం ఈ పిటిషన్‌ దాఖలైంది. తొలుత రాహుల్‌ గాంధీ స్వయంగా పిటిషన్‌ సమర్పించాలని భావించినప్పటికీ, సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మూసివేసే సమయం సమీపించడంతో న్యాయవాదుల ద్వారా దాఖలు చేశారు.

ఓవైసీ పిటిషన్‌పైనా నోటీసులు

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ, కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపైనా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సర్‌కు సంబంధిం చిన నిర్ణయాలపై ఎన్నికల సంఘం అంతర్గత ఫైల్‌ నోటింగులు, రికార్డులను తదుపరి విచారణకు ముందే సమర్పించాలని ఓవైసీ తరపు న్యాయవాది కోరారు. పిటిషన్‌లో చేసిన అభ్యర్థనలన్నింటిపైనా నోటీసులు జారీ చేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది.

​ఢిల్లీ పోలీస్ కమిషనర్ క్షమాపణ

రాజధానిలో రవాణా, ప్రజా రాకపోకలపై ఆంక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు ఈనెల 9, 11 తేదీల్లో జారీ చేసిన మధ్యంతర ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ ఢిల్లీ అధికారులపై దాఖలైన ధిక్కార పిటిషన్లపై విచారణ జరిగింది. ధర్మాసనం ముందు దాఖలు చేసిన రెండు అఫిడవిట్లలో, ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ కోర్టు ఆదేశాలను పాటించడంలో ఏదైనా లోపం జరిగినట్ట భావించినట్లయితే ఆయన దానికి ‘షరతులు లేని, సంపూర్ణ క్షమాపణ’’ చెప్పాలి అని సుప్రీం తెలిపింది. అయితే, కోర్టు ఆదేశాలను ‘ఉద్దేశపూర్వకంగా లేదా కావాలని పాటించకపోవడం మాత్రం జరగలేదని ఢిల్లీ సీపీ స్పష్టం చేశారు. ధిక్కార నోటీసును రద్దు చేయాలని కోరారు. ధిక్కార నోటీసులకు ప్రతిస్పందనల్లో క్షమాపణను చేర్చామని సొలిసిటర్ జనరల్ (ఎస్‌జి) తుషార్ మెహతా స్పష్టం చేశారు. ప్రభుత్వం వాస్తవాల ఆధారంగా తన చర్యలను సమర్థించుకుంటోందని ఆయన నొక్కి చెప్పారు. ‘మీడియా ఏమి చేస్తుందనేది అప్రస్తుతం. మేము మీడియా కోసం విచారణలు జరపడం లేదు’ అని సీజేఐ సూర్య కాంత్ వ్యాఖ్యానించగా, సొలిసిటర్ జనరల్ సమర్పణను బట్టి చూస్తే, ఆ క్షమాపణ షరతులతో కూడి ఉన్నట్లు కనిపిస్తోందని జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు.

మహిళా జర్నలిస్టుల హక్కులు, భద్రతపై విచారణ

నిరసన ప్రదర్శనలను కవర్ చేస్తున్న మహిళా జర్నలిస్టుల హక్కులు, భద్రతపైనా విచారణ జరిగింది. నెట్‌వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా,ఇండియా (ఎన్‌డ‌బ్ల్యుఎంఐ), ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (డీయూజే), ఫ్రీ స్పీచ్ కలెక్టివ్ దాఖలు చేసిన పిటిషన్ల‌పై విచార‌ణ జ‌రిగింది. మహిళా జర్నలిస్టులు తమ పని హక్కును వినియోగించుకుంటున్న సమయంలో నిరసన ప్రదేశాలలో వేధింపులను ఎదుర్కొంటున్నారని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసేందుకు ధర్మాసనం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ కమిటీలో మాజీ మహిళా న్యాయమూర్తులు, ఐపీఎస్ అధికారులు, సామాజిక కార్యకర్తలు ఉండాలని, వారు ‘ప్రధానంగా లేదా ప్రత్యేకంగా మహిళలతోనే’ కూడి ఉండాలని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. బాధితులైన జర్నలిస్టుల వివరాలు, సూచించిన కమిటీ పేర్లను సీల్డ్ కవర్లలో సమర్పించాలని ఆదేశించారు. డీయూజే తరపున సీనియర్ న్యాయవాది సియూ సింగ్ వాదిస్తూ జర్నలిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను తిరిగి ఇవ్వాలని తక్షణ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పోలీసులు ఎలాంటి పరికరాలనూ స్వాధీనం చేసుకోలేదని ఎస్‌జి మెహతా కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌పై కోర్టు నోటీసు జారీ చేసింది. జర్నలిస్టులు ఆర్టికల్ 19(1)(ఎ) కింద భావప్రకటనా స్వేచ్ఛ, ఆర్టికల్ 19(1)(జి) కింద వృత్తిని కొనసాగించే హక్కు అనే రెండు హక్కులను ఏకకాలంలో వినియోగించుకుంటారని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. గుర్తింపు పొందిన రిపోర్టర్లు, ఫ్రీలాన్సర్లు, స్వతంత్ర జర్నలిస్టులు, కంటెంట్ సృష్టికర్తలకు వర్తించే విభిన్న స్థాయిల రక్షణను కోర్టు పరిశీలిస్తుందని జస్టిస్ బాగ్చి తెలిపారు.జంతర్ మంతర్‌ డీ-నోటిఫైపై ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్