Magazines

వాళ్లు విద్యార్థులే.. విద్రోహులు కాదు

3 గంటల క్రితం

not subversives.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

​పరీక్షలు నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బాంబే హైకోర్టు

ముంబయి: మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎంపీఎస్సీ ) పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నిరసన తెలుపుతున్న వారు విద్యార్థులేనని.. సంఘవిద్రోహ శక్తులేమీ కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉద్యోగ నియామక పరీక్షలు నిష్పక్షపాతంగా నిర్వహించేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది. పరీక్షలపై ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించింది. ఎంపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలపై పూణెలో విద్యార్థులు చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ‘‘పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని విద్యార్థులు భావిస్తే.. వారికి ఆందోళన చేసే హక్కు ఉంటుంది. ఎందుకంటే వారు సన్నద్ధత కోసం ఎంతో సమయం వెచ్చించి ఉంటారు’’ అని సీజే జస్టిస్‌ మహేశ్‌చంద్ర త్రిపాఠి, జస్టిస్‌ అద్వైత్ సేథ్నా ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆందోళనలపై అధికారులు సంయమనం పాటిస్తున్నారని, నిరసనకారులపై ఎటువంటి కేసులూ నమోదు చేయలేదని తెలిపారు. అదేవిధంగా వారు లేవనెత్తిన డిమాండ్లలో చాలా వరకు ప్రభుత్వం నెరవేర్చిందని, ఎంపీఎస్సీ చైర్మెన్ రాజీనామా అంశం కూడా గవర్నర్‌ పరిశీలనకు పంపినట్లు చెప్పారు. కేసులు నమోదు చేయలేదనే విషయాన్ని హైకోర్టు అభినందిస్తూనే.. ‘‘వారు విద్యార్థులు.. సంఘ విద్రోహ శక్తులు కాదు’’ అని వ్యాఖ్యానించింది. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉన్నందున.. విద్యార్థులు కూడా తమ చదువులపై దృష్టి సారించాలని సూచించింది. తదుపరి విచారణను నవంబరు 25కు వాయిదా వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్