లైంగిక నేరాలకు పాల్పడే వారిలో భయం కలిగించాలి
నేరం జరిగిన తర్వాత చర్యల కంటే ముందస్తు నివారణే ముఖ్యం
మెట్రో, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో నిఘా ఉండాలి : సుప్రీంకోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని ఢిల్లీలో రాత్రివేళల్లోనూ మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా సంచరించే పరిస్థితులు కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిలో చట్టం పట్ల భయం కలిగేలా పోలీసులు వ్యవహరించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మహిళలు, బాలికలపై వరుసగా జరుగుతున్న లైంగిక దాడుల కేసులను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించగా జస్టిస్ జె.బి పార్దీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నేరం జరిగిన తరువాత నిందితులను పట్టుకుని చర్యలు తీసుకోవడం మాత్రమే సరిపోదని, నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే అత్యంత ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు సురక్షితంగా లేరన్న భావన నెల కొనడం ఆందోళనకరమని తెలిపింది. రాత్రి 10 లేదా 11 గంటల సమయం లోనైనా మహిళలు వీధుల్లో నడవడంతోపాటు మెట్రోలో ప్రయాణించే సమయం లో పూర్తి భద్రతా భావనతో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మహిళలపై నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులపై నిరోధక ప్రభావం కలిగేలా పోలీసు చర్యలు ఉండాలని కోర్టు పేర్కొంది.
ప్రజల విశ్వాసాన్ని పోలీసులు తిరిగి పొందాల్సిన అవసరం ఉందని, ప్రజలు పోలీసులను చూసి భయపడే పరిస్థితి కాకుండా, నేరస్తులు చట్టాన్ని చూసి భయపడే పరిస్థితి రావాలని ధర్మాసనం సూచించింది. హాట్‌స్పాట్లపై ప్రత్యేక నిఘా పార్కులు, రైల్వేస్టేషన్లు, సబ్‌వేలు, బస్టాండ్లు, బస్‌స్టాప్‌లు, మెట్రో స్టేషన్లు వంటి మహిళలకు ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టాలని కోర్టు సూచించింది. పాఠశాలలు, కళాశాలలు, ఢిల్లీ విశ్వ విద్యాలయం నార్త్, సౌత్ క్యాంపస్‌ల పరిసరాల్లోనూ నిరంతర పర్యవేక్షణ అవ సరమని పేర్కొంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి దృశ్యా లను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థ ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అవ సరమైన ప్రాంతాల్లో పోలీసు కంట్రోల్‌రూమ్ వాహనాల హాల్టింగ్ పాయింట్లను బలోపేతం చేయాలని, బీట్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించింది.
అక్రమ తినుబండారాలపై దృష్టి
ఢిల్లీలోని అక్రమ, అనధికారిక తినుబండారాల్లో మద్యం సరఫరా, అసాంఘిక కార్యకలాపాలపై కూడా దృష్టి పెట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. నేరాలకు అవకాశం కల్పించే ప్రాంతాలను ముందుగానే గుర్తించి పోలీసు నిఘా పెంచాలని పేర్కొంది. పోలీసులు క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా మమేకమై స్థానిక సమస్యలను తెలుసుకోవాలని ధర్మాసనం తెలిపింది. కేవలం కాగితాలపై పథకాలు రూపొందించడం కాకుండా అవి వాస్తవంగా అమలవుతున్నాయా లేదా అన్నదే ముఖ్యమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, పోలీసు శాఖ, కోర్టు నియమించిన అమికస్ క్యూరీ కలిసి మహిళల భద్రతకు అవసరమైన చర్యలను రూపొందించాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను నవంబర్ 13కు వాయిదా వేసింది.







కామెంట్‌లు (0)