స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది మహిళలు తమలోని నైపుణ్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. కొంత మంది వ్యాపార వేత్తలుగా మారితే మరికొందరు తమకు తెలిసిన విద్యను సోషల్ మీడియా ద్వారా అందరికీ నేర్పుతున్నారు. మరికొందరు యూట్యూబ్‌లు పెట్టుకొని తమ కళకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటున్నారు. తద్వారా ఆర్థికంగానూ సాధికారత సాధిస్తున్నారు. ఒకప్పుడు నగరాలు, పట్టణాల్లో ఉన్న వారు మాత్రమే టెక్నాలజీని కొంత వరకు ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడు గ్రామీణ మహిళలు కూడా తమ సత్తా చాటుకుంటున్నారు. తమ రోజు వారి జీవన విధానాన్ని యూట్యూబ్‌లో పెడుతూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. అలాంటి వారిలో యశోద లోధి ఒకరు. ఇలా యూట్యూబ్‌లు పెట్టి వీడియోలు అప్‌లోడ్ చేసే వాళ్లు చాలా మందే ఉంటారు. మరి ఈమెలో ప్రత్యేక ఏంటీ అనుకుంటున్నారా..? అయితే మీరే చదవండీ...
యశోధలోని నైపుణ్యం ప్రముఖ బాలివుడ్ నటి ప్రియాంక చోప్రా కంటబడింది. దాంతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చేసింది. తలపై కొంగు.. పక్కా పల్లెటూరి మనిషి.. పొలాల్లో పని చేస్తూ వీడియోలు చేస్తుంటుంది. మాములుగా అయితే ఆమె గతంలో పెద్దగా ఎవరికీ తెలియదు. మహా అయితే వాళ్ల ఊరు, బంధువులు, చుట్ట పక్కల గ్రామాలకు మాత్రమే పరిచయం. కానీ ఇప్పుడు ఆమె ఈ ప్రపంచానికే సుపరిచితురాలైపోయింది. ఆమె వీడియోను నటి ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ప్రియాంక చోప్రా తన వీడియోను షేర్ చేయడం యశోదకు ఊహించని ఆనందాన్ని ఇచ్చింది. ఆ విషయాన్ని ఆమె మరో వీడియో ద్వారా తన ఫాలోవర్లతో పంచుకున్నారు. అంతేకాదు.. అదే రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె నాలుగు లక్షల మంది ఫాలోవర్ల మైలురాయిని కూడా అందుకున్నారు. ‘చాలామందికి ఇది ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ మాత్రమే కావచ్చు. కానీ నాకు మాత్రం ఎంతో ప్రత్యేకమైన క్షణం’ అంటూ యశోదా ఆనందం వ్యక్తం చేశారు.
ఎలాంటి శిక్షణా లేకుండా..
యశోదా ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా సిరతు ప్రాంతంలో పుట్టి పెరిగారు. ఆమెకు ఏడాది వయసున్నప్పుడే ఆమె తల్లిదండ్రులు బంధువులకు అప్పగించారు. పిల్లలు లేని బువా, ఫూఫా ఆమెను పంజాబ్‌లోని లుధియానాకు తీసుకెళ్లి పెంచారు. యశోదా 12వ తరగతి వరకు హిందీ మీడియంలోనే చదువుకున్నారు. కానీ ఆమె ఇప్పుడు ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడలరు. అయితే ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఆమె ఎలాంటి ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. ఇతరులు ఇంగ్లిష్‌లో మాట్లాడే వీడియోలను పదేపదే వింటూ.. వారిని అనుకరిస్తూ సొంతంగా సాధన చేశారు. క్రమంగా మాట్లాడటంలో పట్టు సాధించారు. ఆ తర్వాత తాను నేర్చుకున్నదాన్ని ఇతరులకు కూడా నేర్పించాలని నిర్ణయించుకున్నారు. గ్రామీణ మహిళలు, విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా రోజువారీ జీవితానికి సంబంధించిన ఉదాహరణలతో ఇంగ్లిష్ పదాలు, వాక్యాలు, గ్రామర్ నేర్పడం మొదలుపెట్టారు. పొలంలో పని చేయడం, ఇంటి పనులు చేసుకోవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం.. ఇలా తన చుట్టూ జరిగే విషయాలనే పాఠాలుగా మార్చుకున్నారు.
యూట్యూబ్‌తో మొదలై..
యశోదా ఇంగ్లీష్ విత్ దెహతీ మేడమ్ (English With Dehati Madam) పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. స్పోకెన్ ఇంగ్లిష్, గ్రామర్, రోజువారీ సంభాషణలకు సంబంధించిన వీడియోలు చేసి అందులో అప్లోడ్ చేసేవారు. అయితే ప్రారంభంలో ఆమె వీడియోలకు పెద్దగా స్పందన లేదు. అయినా ఆమె ఏ మాత్రం విసుగు చెందకుండా వీడియోలు చేస్తూనే వుండేది. క్రమంగా ఆమె వీడియోలకు ఆదరణ పెరిగింది. అతి తక్కువ కాలంలోనే లక్షల మంది ఆమెను ఫాలో చేయడం మొదలుపెట్టారు. 2023 నాటికే ఆమె ఛానెల్‌కు సుమారు మూడు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆమెకు యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ కూడా లభించింది. ఆమె ప్రత్యేకత పుస్తకాల్లోని ఇంగ్లిష్‌ను చెప్పడం కంటే.. సాధారణ జీవితంలో ఎలా మాట్లాడాలో నేర్పడమే. అందుకే గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి ఆమె వీడియోలు సులభంగా కనెక్ట్ అయ్యాయి.
మొదట్లో వ్యతిరేకించారు
యశోద ప్రయాణం మొదట్లో అంత సులభంగా సాగలేదు. యూట్యూబ్ పెట్టి వీడియోలు అప్‌లోడ్ చేస్తానని ఇంట్లో చెప్పింది. దీని ద్వారా ఏదైనా సాధించగలనని కుటుంబ సభ్యులతో తన ఆలోచనను పంచుకుంది. అయితే కుటుంబం నుండి ప్రోత్సాహం లభించలేదు. భర్త నుంచే ఆమెకు వ్యతిరేక వచ్చింది. ‘ఇంట్లో పనులు మానేసి అవేం వీడియోలు’ అంటూ ఆయన నిరుత్సాహపరిచేవారని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. అయినా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. వినడం, మాట్లాడటం, తప్పులు సరిదిద్దుకోవడం.. ఇదే తన ఇంగ్లిష్ నేర్చుకునే మార్గమని ఆమె చెబుతున్నారు. ఇప్పుడు ఆయనే ఆమె భుజం తట్టి అభినందిస్తున్నారట.
ఇప్పుడు గ్లోబల్ వైడ్..
గ్రామీణ ప్రాంతంలో సాధారణ జీవితాన్ని గడుపుతూ తనకు తానే ఇంగ్లిష్ నేర్చుకున్న యశోద.. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ప్రభుత్వం, ఎన్జీవోల తరఫున పలు ఈవెంట్లలో పాల్గొని మరికొందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. అలాంటి వ్యక్తి వీడియోను ప్రియాంక చోప్రా షేర్ చేయడంతో పల్లెటూరి మేడమ్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది.
‘దేహాతీ’ అనే పేరే బ్రాండ్‌గా..
యశోదా తన గ్రామీణ నేపథ్యాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. చీర, నెత్తిపై కొంగుతోనే ఎక్కువ వీడియోల్లో ఆమె కనిపిస్తుంది. ‘‘పల్లెటూరిలో పుట్టాం.. ఇంగ్లిష్ మాట్లాడకూడదా? మళ్లీ పుడతామా ఏంటి?’’ అన్నట్టుగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. అందుకే ‘దేహాతీ మేడమ్’(పల్లెటూరి మేడమ్)కు ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఆమె వీడియోలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకునే వారిలో మంచి ఆదరణ పొందాయి. ఎంతో మంది మహిళలు ఆమె వీడియోలు చూసి చక్కగా ఇంగ్లింష్ నేర్చుకుంటున్నారు.







కామెంట్‌లు (0)