శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ-హిరోషిమా మధ్య పారిశ్రామిక, సాంకేతిక, విద్యా రంగాల్లో సహకారం పెరగాలి : శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి అంతర్జాతీయ శాసనసభల మధ్య పరస్పర సహకారం అవసరం అని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీని జపాన్ హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ, ప్రభుత్వ ప్రతినిధుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో జపాన్ దేశానికి చెందిన హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ, ప్రిఫెక్చరల్ ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసన మండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్ , మండలి కార్యదర్శి డా. నరసింహాచార్యులు , అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జపాన్ ప్రతినిధుల బృందానికి తెలంగాణ శాసనసభ తరఫున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం, జపాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలు పరస్పర విశ్వాసం, గౌరవం, సహకారానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని అన్నారు.
జపాన్ దేశం సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక అభివృద్ధి, క్రమశిక్షణ, పరిశోధనలు, ఆవిష్కరణల రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కూడా సమాచార సాంకేతికత, ఫార్మా, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్ర విధ్వంసాన్ని ఎదుర్కొన్నప్పటికీ శాంతి, పునర్నిర్మాణం, అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి జపాన్లోని మియోషి నగరంతో ఉన్న సోదర నగర సంబంధాలు ఇరు ప్రాంతాల మధ్య సాంస్కృతిక, సామాజిక అనుబంధానికి నిదర్శనమని అన్నారు.
శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ భారతదేశం, జపాన్ దేశాల మధ్య చారిత్రక స్నేహ సంబంధాలు ఉన్నాయని అన్నారు. రెండు దేశాలు ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ, హిరోషిమా ప్రాంతాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలు, విద్య, పరిశోధనలు, ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, పరిశోధన, పారిశ్రామిక రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
జపాన్ దేశానికి చెందిన పారిశ్రామిక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, దీని ద్వారా రెండు ప్రాంతాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన, జవాబుదారీతనం పెంపొందించడంలో శాసనసభల పాత్ర అత్యంత ముఖ్యమైనదని వివరించారు. తెలంగాణ శాసనసభ, హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ మధ్య శాసన విధానాలు, సభా నిర్వహణ, శాసనసభ కమిటీల పనితీరు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై పరస్పర అనుభవాలను పంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. రెండు ప్రాంతాల శాసనసభల మధ్య ప్రతినిధుల పర్యటనలు, అధ్యయన కార్యక్రమాలు, పరస్పర చర్చలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. జపాన్ దేశం నుంచి క్రమశిక్షణ, సమయపాలన, సాంకేతిక నైపుణ్యం, విపత్తుల నిర్వహణ వంటి అంశాల్లో నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ, జపాన్ మధ్య విద్యార్థులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల పరస్పర మార్పిడి కార్యక్రమాలు పెరగాలని ఆకాంక్షించారు.






కామెంట్లు (0)