Magazines

సుమతి సేవలు, అంకితభావం స్ఫూర్తిదాయకం

1 గంట క్రితం

Sumathi's services and dedication are inspiring.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం

సంస్మరణ సభలో ఐద్వా సీనియర్ నాయకురాలు టి.జ్యోతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహిళా ఉద్యమం, అభ్యుదయ ఉద్యమాల పట్ల సుమతి చూపిన అంకితభావం, నిబద్ధత స్ఫూర్తిదాయకమని ఐద్వా రాష్ట్ర సీనియర్ నాయకురాలు టీ. జ్యోతి అన్నారు. సుమతి సంస్మరణ సభ ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌. అరుణజ్యోతి అధ్యక్షతన జరిగింది. అనంతరం ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు సుధా సుందర రామన్, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కేఎన్ ఆశాలత సుమతి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సుమతి వీఆర్‌ఎస్‌ తీసుకున్న అనంతరం రాష్ట్ర కేంద్రంలో మహిళా సంఘం పనిలో చురుకుగా పని చేశారని జ్యోతి తెలిపారు. ప్రతి పనిలోనూ సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారని, అప్పగించిన బాధ్యతను సకాలంలో పూర్తి చేయడానికి ఎంతో శ్రద్ధ చూపేవారని గుర్తుచేశారు. ‘మానవి’ పత్రిక బాధ్యతలు చేపట్టిన తర్వాత పత్రికను సమయానికి తీసుకురావడానికి ఆమె ఎంతో కష్టపడ్డారని తెలిపారు. అవసరమైతే రాత్రి 10, 11 గంటల వరకు కూడా కార్యాలయంలో ఉండి పత్రిక పనిని పూర్తి చేయించేవారని తెలిపారు. డీటీపీ ఆపరేటర్‌గా పనిచేసే సుధను కూడా పని పూర్తయ్యే వరకు ఉంచి, పత్రిక సకాలంలో వెలువడేలా చూసేవారని చెప్పారు. ప్రజాశక్తి, చైతన్య, మానవి పత్రికల్లో సందర్భానుసారంగా సుమతి గారు అనేక వ్యాసాలు రాశారని తెలిపారు. సరళమైన భాషలో క్లిష్టమైన విషయాలను కూడా అందరికీ అర్థమయ్యేలా వివరించడం ఆమె రచనల ప్రత్యేకత అని కొనియాడారు. రాష్ట్ర కేంద్రంలో పూర్తికాలం పని చేసే యువత పట్ల కూడా ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపేవారని జ్యోతి అన్నారు. వారి చదువు, ఆరోగ్యం, భోజనం వంటి విషయాలను కూడా పట్టించుకుంటూ ఆప్యాయంగా చూసుకునేవారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర నాయకులు కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వడంలో కూడా ఆమె ముందుండేవారని గుర్తుచేశారు. సంస్థ నిర్మాణం విషయంలో సుమతి ఎంతో నిక్కచ్చిగా ఉండేవారని, పనిలో తప్పులు కనిపిస్తే వాటిని నిర్మొహమాటంగా నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేవారని అన్నారు. సంస్థ ప్రయోజనాలను ముందుపెట్టి పని చేయడం, బాధ్యత పట్ల అంకితభావం, సహచరుల పట్ల ఆప్యాయత ఆమె ప్రత్యేకతలని తెలిపారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ సుమతితో తమ అనుబంధాన్ని, మహిళా ఉద్యమంలో ఆమె చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. మహిళా సంఘం పనిలో ఆమె చూపిన నిబద్ధత, సహచరులకు అందించిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. సుమతి ఆశయాలను కొనసాగిస్తూ మహిళా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని సభలో వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కే. నాగలక్ష్మి, ఎన్. రత్నమాల, మందలపు జ్యోతి , కే.గీతారాణి, ఏ.మహేశ్వరి, ఉపాధ్యక్షురాలు పి.శశికళ, షబానా బేగం, రాష్ట్ర కమిటీ నాయకులు ఎం.లక్ష్మమ్మ, సుజాత, ఎం.జ్యోతి, నర్మదా, స్వరూప, లలితా, సునీత, విజయలక్ష్మి, సీతామహాలక్ష్మి, అమల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్