Magazines

భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల మెస్ సమస్యను పరిష్కరించాలి

1 గంట క్రితం

భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల  మెస్ సమస్యను పరిష్కరించాలి
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

ఎస్ఎఫ్ఐ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న వైద్య విద్యార్థులు మెస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ఘటనపై స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కనీసం నాణ్యమైన భోజనం కూడా అందించలేని పరిస్థితి ఏర్పడటం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. మెస్ నిర్వహణలో ఏర్పడిన సమస్యల కారణంగా రోజుల తరబడి భోజనం అందక వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు భోజనం కోసం ఇండ్ల వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. మెస్ బిల్లుల చెల్లింపుల విషయంలో సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని గుర్తుచేశారు. ఆ సమస్యల భారాన్ని విద్యార్థులపై మోపడం సరికాదని స్పష్టం చేశారు. మెస్ కాంట్రాక్టర్, కళాశాల యాజమాన్యం, సంబంధిత అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వైద్య కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు హాస్టల్, మెస్, తాగునీరు, పారిశుధ్యం వంటి కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు వైద్యం అందించాల్సిన వైద్య విద్యార్థులే తమ భోజనం కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించి, విద్యార్థులకు క్రమం తప్పకుండా నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను సమీకరించి ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్