నైపుణ్యాలు, పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి : మంత్రి శ్రీధర్‌బాబు
టీజీసీహెచ్‌ఈ ఆధ్వర్యంలో రీచ్–2026
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్య, పరిశోధనల్లో మార్పులు రావాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్‌ఈ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌లో నిర్వహించిన ‘రీచ్–2026’ పరిశోధన, విద్యా అభివృద్ధి సదస్సును మంత్రి ప్రారంభించి మాట్లాడారు. వేగంగా మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా ఉన్నత విద్యా పాఠ్యప్రణాళికలను ఎప్పటికప్పుడూ సవరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను కేవలం డిగ్రీలకే పరిమితం చేయకుండా నైపుణ్యాలు, పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు. పరిశ్రమ-విద్యాసంస్థల మధ్య సమన్వయాన్ని మరింత పెంచాలని, విశ్వవిద్యాలయాల్లో ఇంక్యుబేషన్ కేంద్రాలను బలోపేతం చేయాలని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్త బివి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతోపాటు ఆచరణాత్మక అనుభవాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన ఫలితాలను పరిశ్రమతో అనుసంధానం చేసి సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, విలువ సృష్టిపై దృష్టి పెట్టాలని సూచించారు. టీజీసీహెచ్‌ఈ చైర్మెన్ ప్రొ. వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. విశ్వ విద్యాలయాలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడమే ‘రీచ్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. జేఎన్‌టీయూహెచ్ వీసీ ప్రొ. టి. కిషన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. పరిశ్రమల సహకారంతో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పరిశోధనలను పరిశ్రమలు, సంస్థల అవసరాలకు అనుసంధానం చేయడంపై దృష్టి సారిస్తున్నామని వివరించారు. సదస్సులో ‘ప్రపంచ పోటీతత్వం కోసం ఉన్నత విద్యలో పరివర్తన’, ‘పరిశోధన నైపుణ్యం-సహకారం-ఆవిష్కరణలు’, ‘పరిశోధన నుంచి సంస్థ వరకు ఆవిష్కరణ–వ్యవస్థాపకత’ తదితర అంశాలపై నిపుణులతో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి రచిం చిన ‘హైదరాబాద్: విద్య, పరిశోధన, ఆవిష్కరణ, వ్యవస్థాపకతకు కేంద్రం’ పుస్తకాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీసీహెచ్‌ఈ వైస్‌చైర్మెన్ ప్రొఫెసర్ ఇ. పురుషోత్తం, ఓయూ వీసీ ప్రొఫె సర్ కుమార్ మొలుగారం, టీజీసీహెచ్‌ఈ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, జేఎన్‌టీయూహెచ్ రెక్టర్ డాక్టర్ ఎ. దామోదరం, రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.జయలక్ష్మి, వివిధ విశ్వవిద్యాలయాల వీసీలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యలో మార్పులు రావాలి
41 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)