Magazines

కరువు కాటుకు విలవిల

45 నిమిషాల క్రితం

Drought-stricken Wilavila
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 5 నిమిషాల చదవడం

లోటు వర్షపాతం...మండుతున్న ఎండలు
ఎండిపోతున్న పంటలు...కాపాడుకోలేక గుండెలవిసేలా రైతుల రోదన
సాగుకే కాదు తాగునీటికీ ముప్పు...పశుగ్రాసం లేక..పాడి పరిశ్రమ కుదేలు
రాష్ట్రంలో సగటు 20 శాతం లోటు వర్షపాతం..400 మండలాల్లో కరువు చాయలు
వట్టిపోయిన జలాశయాలు... నెర్రబారిన పంట పొలాలు
ఎల్‌‌నినో ఎఫెక్ట్‌ ‌వ్యవసాయంపైనే కాదు అనేక రంగాలపైనా ప్రభావం చూపుతోంది. ఫలితంగా రాష్ట్రాన్ని కరువు కాటేస్తోంది. వర్షాల్లేక ఖరీఫ్‌ వ్యవసాయం దెబ్బతిన్నది. నేలంతా బీడుగా మారింది. అరకొర చినుకులకు సాగైన పొలాలు తడిలేక నెర్రబారుతున్నాయి. దీంతో పంటను కాపాడుకోలేక రైతులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. పశుగ్రాసం లేక పాడి పరిశ్రమ కుదేలైంది. మేతలేక జీవాలు అల్లాడుతున్నాయి. జలాశయాలు ఒట్టిపోయి పంట కాలువలు పడావుబడ్డాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. ఈ ఏటా సాగుకే కాదు తాగునీటికీ ఎద్దడి తప్పేలాలేదు. అసలే లోటు వర్షపాతం. ఆ పైన తీవ్రమైన ఎండలు ... దీనికి తోడు కరెంట్‌ ‌కోతలు... వెరసి కరువు కాటుకు పల్లెలు విలవిలలాడిపోతున్నాయి.
నవతెలంగాణ- విలేకరులు
వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమ దెబ్బతిన్నది. పనుల్లేక జనం అల్లాడుతున్నారు. మళ్లీ వలసలు తప్పవా అన్న ఆందోళన నెలకొంది. సర్కార్‌ అంచనా మేరకు 235 మండలాల్లో కరువు నెలకొందని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కరువు మండలాల సంఖ్య రెట్టింపుగానే ఉంటుందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. ​ఉమ్మడి నల్లగొండ జిల్లాను కరువు వెంటాడుతోంది. ఆయకట్టు, నాన్‌ ఆయకట్టు ప్రాంతమంతా నీటి ఎద్దడితో అల్లాడుతోంది. వానాకాలంలో సాధారణ వర్షాపాతం కూడా నమోదు కాకపోవడంతో జలాశయాల్లో ఆశించిన మేర నీటి లభ్యతలేదు. మూసీ ఆధారిత ప్రాంతంలో కాస్త కాలువలు, చెరువుల ఆధారంగా వరి సాగైనప్పటికీ కరెంట్‌ కోతలు సమస్యగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజాపేట, యాదగిరిగుట్ట పరిసరాలు, సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి ప్రాంతం, నల్లగొండ జిల్లాలో చండూరు పరిసరాల్లో 20 మీటర్లకుపైగా లోతులో నీరు లభించే పరిస్థితులు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 22.5 మీటర్ల వరకు పడిపోతున్నట్లు భూగర్భ జల పరిశీలన గణాంకాలు సూచిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొం డ జిల్లాలో వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితి ప్రాంతాన్ని బట్టి తీవ్రంగా మారుతోంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో సాధారణంగా ఏటా 650 నుంచి 750 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో 75–80 శాతం వర్షం జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కురిసే నైరుతి రుతు పవనాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఈసారి రుతుపవనాల హెచ్చుతగ్గులు, దీర్ఘ కాలిక వర్షాభావ పరిస్థితులు భూగర్భ జలాలపై ప్రభావం చూపుతున్నాయి
.

​సంస్థాన్‌ ‌నారాయణపురంలో..
. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో తీవ్ర కరువు ఛాయలు అలుముకున్నాయి. ఈ మండలంలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఎలాంటి సాగునీటి వనరులు లేకపోవడంతో రైతులు వర్షాధారంగా బోరుబావులను నమ్ముకుని పంటలు సాగు చేస్తున్నారు. ఎల్‌‌నినో ఎఫెక్ట్ వల్ల ఈ యేడు సరైన వర్షాలు కురువ లేదు. సాధారణ వర్షపాతం కన్నా అతి తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారుల లెక్కలు చెబున్నాయి. వర్షాలు కురవని కారణంగా చెరువు, కుంటల్లో చుక్క నీరు చేరకపోవడంతో భూగర్భ జలాలు అడగంటిపోయాయి. బోరు బావులు అప్పుడుప్పుడూ పోస్తున్నాయి. అనేకమంది రైతుల బోరు బావులు ఇప్పటికే వట్టిపోయాయి. బోరు బావుల కింద సాగుచేసిన వరి నిట్ట నిలువునా ఎండి పోయింది. పశువులకు మేతగా మారుతోంది. పత్తి రైతు చిత్తయిపోయాడు. ఒక పంట కాలానికే మూడుసార్లు విత్తనాలు పెట్టారు. పెట్టుబడుల రూపేనా కోట్లాది రూపాయలు భూమిలో పోశారు. వర్షాలు లేని కారణంగా పత్తి చేలో ఉండిపోయాయి. ఒక్క రూపాయి తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మండలంలో ఈ ఏడు వానాకాలం సీజన్‌లో 44,287 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. అందులో 30,624 ఎకరాలు పత్తి, 2,593 ఎకరాల్లో వరి, 99 ఎకరాల్లో కంది, మరో 971 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. ఇప్పటికే పత్తి పంట మొత్తం పనికి రాకుండా పోయి, ఎకరాకు ఒక క్వింటా వచ్చే పరిస్థితి లేదు. వరి సగం ఎండిపోయింది. వరి, పత్తి, కంది, ఇతర పంటలు సాగు చేయడానికి రైతులు ఎకరాకు రూ.15నుంచి 20వేలు ఖర్చుపెట్టారు. మండలంలోని సుమారు రూ.90 కోట్లు పెట్టుబడి పెట్టిన రైతులకు వరి పంట ద్వారా కొంత తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ ఎల్‌‌నినో ప్రభావం వల్ల రూ.50 కోట్ల నష్టం వాటిల్లనుందని రైతులు వాపోతున్నారు.

కరీంనగర్‌లో... ‘
ఎల్‌నినో’ రూపంలో ఎదురైన తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనా తీవ్ర ప్రభావం చూపాయి. జిల్లా వ్యాప్తంగా సాగైన 12.05 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేసిన రైతుల కంటిపై కునుకు లేకుండా పోయింది. జూన్ 1 నుంచి గడిచిన 110 రోజుల్లో 50 నుంచి 55 రోజులు మాత్రమే వర్షపు రోజులుగా నమోదయ్యాయి. బోర్లు, బావుల్లో నీరు అడుగంటుతోంది. దీనికి తోడు కరెంటు కోతలూ పెరగడంతో పంటలకు నీరందకపోవడం చూస్తుంటే ఈ వానాకాలం పంటలు చేతికి వస్తాయో లేదోనని అన్న దాతలు ఆందోళన చెందుతున్నారు. జూన్ మొదలుకొని ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడమే కాక, భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. వారం, పది రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం కొంత ఊరటనిచ్చినప్పటికీ, మళ్లీ పాత పరిస్థితులే పునరావృతమవుతున్నాయి. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 32డిగ్రీల సెల్సియస్‌ నుంచి 34డిగ్రీల వరకూ నమోదువుతున్నాయి. దీంతో పొలాల్లో నీరు ఆవిరైపోవడమే కాకుండా, నీరు వేడెక్కి వరి మొక్కల ఎదుగుదల దెబ్బతింటోంది.

​సగం పంట ప్రశ్నార్థకమే..
కరీంనగర్‌ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణంలో 98శాతం (3,23,606 ఎకరాలు) పంటలు వేసినప్పటికీ, 13 శాతం లోటు వర్షపాతం జిల్లాను తీవ్రంగా వేధిస్తోంది. సింహ భాగం వరి 2.65 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. కాలువల కింద నీరు రాక, బావుల్లో నీరు సరిపోక పంటను కాపాడుకోవడం సవాలుగా మారింది. 45,836 ఎకరాల్లో వేసిన పత్తి పంట కూడా ఎల్‌నినో ధాటికి వాడి పోతోంది. పెద్దపల్లి జిల్లాలో సాధారణ విస్తీర్ణా నికి అత్యంత చేరువగా 2.67 లక్షల ఎకరాలు సాగు చేపట్టినప్పటికీ వరి గతేడాది కంటే స్వల్పంగా పెరిగింది. చివరి తడులు అందే సమయానికి కెనాల్స్ ద్వారా నీటి పారకం నిలిచిపోవడంతో పొలాలు బీటలు వారుతు న్నాయి. జగిత్యాల జిల్లాలో 20 మండలాలకు 7 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాకతీయ కాలువ, వరద కాలువల కింద ఉన్న 2.10 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈసారి ఆశించిన స్థాయిలో ప్రాజెక్ట్ నుంచి నీరు అందక వరితోపాటు , 38,910 ఎకరాల్లో వేసిన మొక్కజొన్న పంట కూడా నీళ్లలేక ఎండిపోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముందస్తు ఎల్‌నినో హెచ్చరికలతో 30 వేల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ ఈ జిల్లాలోని సుమారు 90వేల వ్యవసాయ బోరు బావుల కింద సాగవుతున్న పంటకు విద్యుత్ కోత సమస్యగా మారింది.

అడుగంటిన జలాశయాలు
రాష్ట్రంలో ప్రధాన జలాశయాలు నీళ్లులేక అడుగుంటుతున్నాయి. మెదక్‌ ‌జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే సింగూరు ‌జలాశయం నీళ్లులేక అడుగంటింది. 215 టీఎంసీల సామర్ధ్యం కల్గిన ఈ ప్రాజెక్టులో కేవలం 87 టీఎంసీలే ఉన్నాయి. ఎగువలో వర్షాలు పడకపోవడంతో వరదలు రాలేదు. స్థిరీకరించిన 40 వేల ఎకరాలకు క్రాప్‌ హాలిడే ప్రకటించారు. మహబూబ్‌‌నగర్‌‌లోని జూరాలకు ఆశించిన మేర నీళ్లు రాలేదు. ఆలస్యంగా కర్నాటక నుంచి వరద నీరు వచ్చినా తాగునీటి అవసరాలకు నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ‌జలాశయానికి కృష్ణా పరివాహక ప్రాంతంలో వరదల్లేక నీళ్లు రాలేదు. 312 టీఎంసీల సామర్ధ్యం కాగా ప్రస్తుతం 181 టీఎంసీలే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్ర్షాలకు తాగునీటి అవసరాలకు సరిపోతాయా లేదా అన్న భయం నెలకొంది. నిజాంసాగర్‌‌లో పూర్తిస్థాయి నీటి నిల్వ 17 టీఎంసీలు కాగా కేవలం 12 టీఎంసీలే ఉన్నాయి. శ్రీరాంసాగర్‌కు వరదలు రాకపోవడంతో ప్రాజెక్టు పరిధిలోని జిల్లాల ఆయకట్టుకు నీరందే పరిస్థితిలేదు.

235 మండలాల్లో కరువు చాయలు
రాష్ట్రంలో ప్రాథమిక సమాచారం మేరకు 253 మండలాల్లో కరువు నెలకొందని ప్రభుత్వం అంచనా వేసింది. 
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించి సహాయక నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని భావిస్తోంది. అయితే వాస్తవ పరిస్థితి మరింత అధ్వానంగా ఉందనేది రైతు సంఘాల మాట. సుమారు 400 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయని చెబుతున్నారు.ఈ పరిస్థితుల నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదల్ని ఆదుకునేందుకు కరువు సహాయ నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌ 27 నాటికి రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 726.7 మిల్లీమీటర్లకు గాను 615.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై 17 శాతం లోటు ఏర్పడింది. ఇదే సమయంలో నల్లగొండ జిల్లాలో 32 శాతం లోటు నమోదైంది. కరీంనగర్‌ ‌జిల్లాలో 17 శాతం లోటు వర్షాపాతం నమోదైంది. మెదక్‌‌లో 18 శాతం వరకు సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లాలో 20 మండలాలకు పైగా లోటు వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. మహబూబ్‌‌నగర్‌ ‌జిల్లాలోనూ వర్షాభావం నెలకొంది. ఆలస్యంగా జూరాలకు నీళ్లు వచ్చినా సాగు చేసిన వరిపైర్లు నీళ్లందక ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. మెట్ట పంటలైన పత్తి, మక్కలు చేతికొస్తాయో లేదోనన్న ఆందోళనలో రైతులున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్