Magazines

ఘనంగా సాంస్కృతిక సంబురాలు

48 నిమిషాల క్రితం

Cultural Celebrations
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 2 నిమిషాల చదవడం

తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది..ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కల్లుగీత కార్మిక సంఘం 69వ వార్షికోత్సవాలు బుధవారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య కళానిలయంలో ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మలతో మహిళల నృత్యాలు, పాటలు, వివిధ కళా ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి చాలా గొప్పదనీ, కళలు ఉత్సాహపరచడమే కాకుండా చైతన్యవంతుల్ని చేసేవిగా ఉండాలని ముఖ్యఅతిథిగా హాజరైన సుద్దాల అశోక్‌‌తేజ అభిప్రాయపడ్డారు. గీత కార్మికుల గురించి సంఘం రూపొందించిన కత్తి నూరే టోల్లం, కల్లు గీసే టోల్లం పాట చాలా బాగుందని అభినందించారు. మాజీ శాసనమండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడి 69 సంవత్సరాల వార్షికోత్సవ సంబురాలు అంగరంగ వైభవంగా జరిపారనీ అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం మొదటి నుంచి సమరశీల పోరాటం చేస్తున్నదని గుర్తు చేశారు. కల్లుగీత కార్మికుల హక్కుల కొరకు సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకపోతుల వెంకరమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులు రాష్ట్రంలో 37వేల 381 మంది పెన్షన్‌ ‌కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ ఇవ్వాలనీ , వృత్తి చేసే వారందరికీ కంఠమయ్య రక్షణ కవచం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్టుగా గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇస్తామనీ, వృత్తిలో ఆధునీకరణ పద్ధతులు తీసుకువస్తామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీని ఆచరణలో అమలు చేయాలని కోరారు. చెట్ల పెంపకానికి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని, నందనంలోని నీరా తాటి ఈత ఉత్పత్తుల ప్రాజెక్టు వెంటనే ప్రారంభించాలనీ, పెన్షన్ 4వేలు ఎక్సిగ్రేషియా పది లక్షలకు పెంచాలనీ, ఏజెన్సీ ఏరియాలో సొసైటీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కల్లుగీత వృత్తిని ఆధునికరించాలనీ, ప్రకృతి సంపదను కాపాడాలని సంఘం రాష్ట్ర సదస్సులో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు చింతల మల్లేశం గౌడ్, సుప్రజా హాస్పిటల్స్ ఎండీ సిగ విజయ్ కుమార్ గౌడ్, సీనియర్‌ ‌జర్నలిస్టు పాశం యాదగిరి, సంఘం నాయకులు భూపతి వెంకటేశ్వర్లు, గోపా రాష్ట్ర అధ్యక్షులు బండి సాయన్న, ఐలి ఎంకన్న గౌడ్, అంబాల నారాయణ గౌడ్,రామ్మోహన్ గౌడ్ సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్