నీటి పారుదల శాఖ అధికారులకు
మంత్రి ఉత్తమ్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ, పరిహారం, పునరావాస సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని నీటిపా రుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి గౌరవెల్లి ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పనులవారీగా స్పష్టమైన గడువులు నిర్ణయించి, అర్హులైన వారికి పరిహారాన్ని త్వరగా చెల్లించాలని ఆదేశించారు. ఆర్థిక, పరిపాలన, న్యాయపరమైన అడ్డంకులను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక, నిర్వహణ ప్రణాళిక, ప్రజాభిప్రాయ సేకరణ నివేదికలు, మూడు సీజన్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పరివేశ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసినట్టు ఈ సందర్భంగా మంత్రులకు అధికారులు వివరించారు. అక్టోబర్ 8న జరగనున్న పర్యావరణ అనుమతి ప్రతిపాదన పరిశీలన సమావేశానికి అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. అక్టోబర్ 16న ఎన్‌జీటీలో జరగనున్న విచారణకు అధికారులు సిద్దంగా ఉండాలని సూచించారు. వచ్చే సాగు సీజన్‌కు నీటిని అందించేలా కాలువల వ్యవస్థను సిద్ధం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, ఈఎన్సీలు ఓ.వి. రమేష్ బాబు, మధుసూదన్ రావు, సంయుక్త కార్యదర్శి కె. శ్రీనివాస్, భూసేకరణ, పునరావాసం కమిషనర్ శివకుమార్ నాయుడు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ పూర్తిచేయాలి
47 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)