మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ఉపాధిని కాపాడాలి : తెలంగాణ మధ్యాహ్న భోజన
పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల ఉపాధిని దెబ్బతీసే కేంద్రీకృత వంటశాలల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై స్వప్న, ఎస్వీ రమ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 9 నుంచి కేంద్రీకృత వంటశాలలను (సెంట్రలైజ్డ్ కిచెన్లు) ప్రారంభించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది వంట కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లోనే విద్యార్థులకు వేడి భోజనం అందిస్తున్న కార్మికులను పక్కనబెట్టి, కేంద్రీకృత వంటశాలల ద్వారా భోజనం సరఫరా చేయాలని నిర్ణయిం చడం తగదని పేర్కొన్నారు. ఇప్పటికే తక్కువ గౌరవ వేతనాలతో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల జీవనోపాధిపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేటీకరణ, కేంద్రీకరణ వైపు తీసుకెళ్లకుండా పాఠశా లల్లోనే వంట చేసే విధానాన్ని కొనసా గించాలని డిమాండ్ చేశారు. కార్మికులపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలను వారి సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా అమలు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే డిసెంబర్ 9 నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులందరి ఉపాధికి పూర్తి భద్రత కల్పించాలనీ, కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని ప్రభుత్వాన్నికోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధిని కాపాడుకోవడానికి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించక తప్పదని హెచ్చరించారు.
కేంద్రీకృత వంటశాలల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)