డిసెంబర్ 1,2,3 తేదీల్లో చలో ఢిల్లీ : సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు సుదీప్ దత్తా పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు సుదీప్ దత్తా డిమాండ్ చేశారు. కార్మికులకు కనీసం వేతనం రూ. 42వేలు నిర్ణయించాలని కోరారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలని, స్కీమ్‌వర్కర్లందరినీ కార్మికులుగా గుర్తించాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నట్టు తెలిపారు. అందులో భాగంగా డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీ మహానగరంలో లక్షలాది మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ప్రదర్శన చేయబోతుందని తెలిపారు. మూడు రోజుల బైఠాయిస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో రాష్ర్ట అధ్యక్షులు చుక్కారాములు అధ్యక్షతన రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన విధానాలను పున:సమీక్షించుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికుల ఆగ్రహాన్ని చవిచూడవాల్సి వస్తుందని హెచ్చరించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడి, ఆ చట్టాలను వెనక్కి కొట్టారని గుర్తు చేశారు. అలాగే విద్యార్థులు పరీక్ష లీకేజీలపై ఉద్యమించడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించారని గుర్తు చేశారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. వాటికి సీఐటీయు సంపూర్ణంగా మద్దతు ఇస్తోందని చెప్పారు. అలాగే ఢిల్లీ చుట్టూ ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున పోరాడి కనీస వేతనం సాధించుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కార్మిక వర్గం కూడా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చారిత్రాత్మక పోరాటంగా చేయబోతున్నదని తెలిపారు. దేశంలోని కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూడా కార్మికుల సమస్యలపై ఈ నెల 26, 27 తేదీల్లో పెద్ద ఎత్తున ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. భవిష్యత్తు కర్తవ్యాలను, కార్యాచరణను ఆయన వివరించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరగబోయే ఈ మహాత్తర పోరాటాల్లో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్‌తోపాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)