Magazines

పూలు కొనలేం... బంతి పేర్చలేం

3 గంటల క్రితం

buy flowers
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 3 నిమిషాల చదవడం

బతుకమ్మకు పూలు కరువు

ఎల్‌‌నినో ఎఫెక్ట్‌ ... తోటల్లోనే వాడిపోతున్న వైనం

ధరలు రెట్టింపు...

అడవిపూలు సైతం కరువు

దసరా, బతకమ్మ, దీపావళికి పూల కొరత

కిలో రూ. 120 నుంచి 200కు పెంచిన వ్యాపారులు


నవతెలంగాణ - మహబూబ్‌‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణకు ప్రతీక అయిన బతుకమ్మ పండగపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ప్రకృతిని పూజిస్తూ తొమ్మిది రోజుల పాటు జరుపుకునే పూల వేడుక(పూల పండుగ)పై ఎల్‌‌నినో ఎఫెక్ట్‌ పడింది. దీంతో వాతావరణంలో తేమ పడిపోయి పూల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రత్యేకంగా బతుకమ్మ, దసరా, దీపావళికి ఈ పూల కొరత ఎదురుకానుంది. ప్రధానంగా పంట పొలాల్లో గట్ల వెంబడి లభించే గునుగు, చెలకల్లో మోదుగు, తంగెడు పూలు సైతం పూయక పోవడంతో బతుకమ్మకు అవసరమయ్యే పూలకు కరువొచ్చింది. బంతిపూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో రూ.50 ఉన్న ధరలు ఏకంగా రూ.200 నుంచి రూ.250కు పెరిగిపోయాయి. పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.120 నుంచి రూ.200లపైనే పెంచారు. ​ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు మహిళలు రంగు రంగుల పువ్వులైన బంతి, చేమంతి, గునుగు, తంగెడు, ఇతర పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ ఆడడడం ఆనవాయితీ. ఈ యేడు ఎల్‌‌నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటడంతో పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. భానుడి ప్రతాపం బంతిపూలపై తీవ్రంగా పడడంతో పూసిన పూలు తోటలోనే ఎండిపోతున్నాయి. సాధారణంగా బంతి, చామంతి పూల సాగును దీపావళి, దసరా పండగలను దృష్టిలో పెట్టుకొని రైతులు పూల పంటలను సాగు చేస్తుంటారు. ఈసారి ఖరీఫ్‌ ప్రారంభం నుంచి ఎల్‌‌నినో ప్రభావం వల్ల పూలతోటలను తక్కువగా సాగు చేశారు. వర్షాలు రాకపోవడం, తేమ తగ్గిపోయి వాతావరణం వేడెక్కడంతో పూలు మొగ్గలోనే ఎండిపోతున్నాయి.


​వాడిపోతున్న ఆశలు
ఎల్‌‌నినో ప్రభావంతో ఈ ఏడాది రైతులు పూర్తి స్థాయిలో ఏ పంటలనూ సాగు చేయలేదు. పాక్షికంగానే పూలపంటలను సాగు చేయడంతో బంతి, చామంతి పూలకు కరువొచ్చింది. సాగు చేసిన పూల తోటలు సైతం వాడిపోతున్నాయి. అక్కడక్కడ నీరు ఉన్న బోరుబావుల దగ్గర పూల తోటలు వేసినప్పుటికీ అధిక ఉష్ణోగ్రతల వల్ల పూలు సహజ రంగును కోల్పోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


తగ్గిన సాగు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టిసారించడంతో పూల దిగుబడి తగ్గిపోతోంది. ఉమ్మడి జిల్లాలో వెయ్యి ఎకరాల నుంచి ఐదు వేల ఎకరాలకు పైగా పూల తోటలను సాగు చేసేవారు. ఈసారి 2వేల ఎకరాలకు మించి సాగు చేయలేదు.


​ఎల్‌నినో ఎఫెక్ట్
జిల్లాలో ఎల్‌‌నినో ఎఫెక్ట్‌‌తో తోటలే కాదు అడవి పూలు సైతం పూయడం లేదు. అడవిలో తంగెడు, గన్నెరు, మోదుగు, గునుగు, గడ్డిపూలు లభించేవి. ఈ ఏడాది వాతావరణ మార్పుల వల్ల పూలు దొరకడం కష్టమైంది. ఇటు తోటలు లేక అటు అడవీ పూలు లభించక పోవడంతో ఈసారి దసరా, దీపావళి పండగల ఉత్సవాలకు పూల వినియోగం అంతంత మాత్రంగానే జరిగే అవకాశాలున్నాయి.


​కొనేదేలా.. పేర్చేదెలా
పూలు అందుబాటులో లేకపోవడంతో దసరా ఉత్సవాలకు బతుకమ్మ పండగలకు పూలను ఎలా పేర్చాలనే ఆలోచనలో మహిళలు ఉన్నారు. చామంతి, బంతి, గునుగు, తంగెడు, కనకాంబరాలు, మల్లెలు ఇలా ఏవీ అందుబాటులో లేవు. ఉన్నా ధరలు విపరీతంగా పెరగడంతో బతుకమ్మ పండగ ఉత్సవాలు ఎలా జరుపుకోవాలని మహిళలు వాపోతున్నారు.


ప్రత్యామ్నాయ పూలవైపు మొగ్గు
పండగకు పూల కొరత కారణంగా మహిళలు ప్రత్యామ్నాయ పూలవైపు దృష్టి సారించారు. ముఖ్యంగా రంగు రంగుల ప్లాస్టిక్‌తో తయారు చేసిన పూలను మార్కెట్‌‌లో అందుబాటులోకి తెచ్చేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకృతి పరంగా పూసే సహజ సిద్ధమైన పూలు లభించే పరిస్థితి లేనందున మహిళలు ప్లాస్టిక్‌ ‌పూలను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ఈ ప్లాస్టిక్‌ ‌పూలకు సైతం ధరలను పెంచుతున్నారు.


​సహజమైన పూలతో బతుకమ్మ ఆడే పరిస్థితి లేదు కందికొండ గీత , ఐద్వా రాష్ర్ట నాయకురాలు, నాగర్‌‌కర్నూల్‌ ‌జిల్లా
దసరా పండుగకు ముందు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆడుతాం. కాని ఈసారి సహజమైన పూలతో బతుకమ్మ పేర్చి పరిస్థితి లేదు.


కొనేదేలా.. పేర్చేదెలా

పూలు అందుబాటులో లేకపోవడంతో దసరా ఉత్సవాలకు బతుకమ్మ పండగలకు పూలను ఎలా పేర్చాలనే ఆలోచనలో మహిళలు ఉన్నారు. చామంతి, బంతి, గునుగు, తంగెడు, కనకాంబరాలు, మల్లెలు ఇలా ఏవీ అందుబాటులో లేవు. ఉన్నా ధరలు విపరీతంగా పెరగడంతో బతుకమ్మ పండగ ఉత్సవాలు ఎలా జరుపుకోవాలని మహిళలు వాపోతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్