Magazines

కౌలు రైతుకు కరువు సహాయం అందేనా?

4 గంటల క్రితం

tenant farmers
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 3 నిమిషాల చదవడం

క్యాబినెట్‌ సబ్‌‌కమిటీ కాలయాపన

నెలన్నర అవుతున్నా సమావేశం కాని వైనం..
ఎల్‌‌నినోతో అక్కరకు రాని రెక్కల కష్టం
కౌలు రైతులకు పంటనష్టపరిహారమివ్వాలంటున్న రైతు సంఘాలు


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ఎల్‌‌నినోతో కలిసిరాని రాని కాలం...అక్కరకు రాని రెక్కల కష్టం...కనుకరించని పాలకవర్గం... ఎలా చూసినా కౌలు రైతులకు అంతిమంగా నష్టమే. ఖరీఫ్‌ ‌సీజన్‌లో కౌలు +పెట్టుబడి ఖర్చులు కూడా కష్టమే. రెక్కల కష్టం బూడిదలో పోసినట్టే. ఇంత నష్టపోయినా ఈసారి కూడా కౌలు రైతులకు ప్రభుత్వ సహాయం అందటం అనుమానంగానే కనిపిస్తున్నది. ఓవైపు కరువు విలయతాండవం చేస్తున్నా కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వడం పైనా, పంటనష్టపరిహారం నేరుగా కౌలురైతులకే అందివ్వడంపైనా తాత్సార్యం జరుగుతూనే ఉంది. కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి సహాయం చేసే ఉద్దేశంతో వేసిన క్యాబినెట్‌ ‌సబ్‌‌కమిటీ కాలయాపన తో సరిపెడుతున్నది. ఆగస్టు నెలాఖరులో వేసిన కమిటీ నేటికీ సమావేశం కాలేదంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు కౌలు రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి. సాగుకంటే ముందే భూముల రకాన్ని రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు కౌలు చెల్లించారు. గోదావరి నది తీర ప్రాంతాల్లోని సారవంతమైన భూములకైతే రూ.50 వేల దాక కూడా కౌలు ఉన్న పరిస్థితి.

ఒకవైపు కౌలు భారం, మరోవైపు పంట సాగు ఖర్చు రెండూ కౌలు రైతు మీదే పడుతున్నాయి. రాష్ట్రంలో పంటల బీమా లేకపోవడం, కౌలు రైతులకు వ్యవసాయానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు వర్తించకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. భూమి తన పేరుపై లేకపోవడంతో ప్రభుత్వం అందించే రైతు భరోసా వంటి ప్రత్యక్ష వ్యవసాయ మద్దతు కౌలు రైతుకు దక్కట్లేదు. బ్యాంకులు పంట రుణాలివ్వడంలేదు. ఓటీపీ విధానంతో పంటను అమ్ముకునే దగ్గరా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. దీంతో కౌలు కట్టడం, పంట సాగు కోసం అవసరమైన పెట్టుబడిని కౌలు రైతులు ఎక్కువగా ప్రయివేటుగా అప్పులు తీసుకుంటున్నా రు. విత్తనాలు, ఎరువులు, పురుగుల నివారణ మందులను వ్యాపారుల దగ్గర ఖాతా మీద తీసుకుంటున్నారు. దీనిపైనా వడ్డీ, చక్రవడ్డీ వేసి మరీ వ్యాపారులు వసూలు చేస్తున్న పరిస్థితి. ఇలా కౌలు భారం + సాగు పెట్టుబడి + బ్యాంకు రుణాలు అందకపోవడం + అధిక వడ్డీ అప్పులు + పంట నష్టం అన్నీ కలిసి కౌలు రైతును మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి.


22 లక్షల కౌలు రైతులకు గుర్తింపు అవసరం
తెలంగాణలో దాదాపు 22 లక్షల మంది కౌలు రైతులున్నారని రైతుస్వరాజ్య వేదిక 2022లో నిర్వహించిన అధ్యయనం అంచనా వేసింది. వీరు స్వయంగా భూమికి యజమానులు కాకపోయినా రాష్ట్ర వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వాస్తవ సాగుదారుడిగా గుర్తింపు లేకపోవడం వల్ల అనేక ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు, పంట నష్ట పరిహారం వంటి వాటికి దూరమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర సమయంలోనూ, 2023 ఎన్నికల ప్రచార సమయంలోనూ కౌలు రైతుల గుర్తింపు, వారికి సహాయం గురించి హామీలు ఇచ్చింది. వరంగల్ రైతు డిక్లరేషన్, కౌలు రైతులకు సంబంధించిన బహిరంగ లేఖ, ఎన్నికల మేనిఫెస్టో తదితరాల్లో ఈ అంశం ప్రస్తావించింది. అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ అమల్లోకి రాలేదు.


​సబ్‌‌కమిటీ సమావేశమేది?
కౌలు రైతుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 28న క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ కమిటీలో ఉన్నారు. కౌలు రైతుల గుర్తింపు విధా నం, దాని అమలు తీరుపై సమగ్రంగా అధ్యయనం చేసి వారికి మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. అయితే ఆ కమిటీ ఇప్పటివరకు సమావేశం కాకపోవడం కౌలు రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. 2011 చట్టాన్ని అమలు చేస్తే చాలు... సాగుదారుల గుర్తింపు కోసం 2011లోనే ఒక చట్టం తెచ్చారు. గతంలో గుర్తింపు కార్డులు జారీ చేసిన అనుభవమూ ఉంది. కొత్త వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం జీవో ద్వారాగానీ, సవరించిన నిబంధనలు జారీ చేసిగానీ ప్రక్రియను ప్రారంభించవచ్చు. క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశమై 2011 చట్టం ఆధారంగా స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. ఈ సీజన్‌లోనే సాగుదారుల నమోదు ప్రక్రియ ప్రారంభించి సాగుదారు కార్డులు జారీ చేయాలి. ముఖ్యంగా కరువు మండలాలను ప్రకటించేలోపే కౌలు రైతుల వివరాలు నమోదయ్యేలా చూడాలి. లేదంటే కరువు సహాయం ప్రకటించినా భూ యజమానుల పాలయ్యే ప్రమాదముంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్