Magazines

చాయ్‌ ‌చమక్కులు

1 గంట క్రితం

Chai Highlights
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 3 నిమిషాల చదవడం

టీ కేవలం ఉదయాన్నే తాగే పానీయం మాత్రమే కాదు, నిత్య జీవితంలో మనల్ని రీఫ్రెష్ చేస్తూ శరీరానికి, మనసుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినది. టీ చరిత్ర సుమారు 5,000 ఏండ్ల కిందట చైనాలో ప్రారంభమైంది. టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, వాటిలోని రకాల గురించి వివరంగా తెలుసుకుందాం.


గుండె ఆరోగ్యం, దీర్ఘాయువు: టీని రోజువారీ అలవాటుగా చేసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పరిశోధనల ప్రకారం క్రమం తప్పకుండా టీ తాగే వారిలో మరణ ప్రమాదం 9 నుండి 13 శాతం వరకు తక్కువగా ఉంటుందని తేలింది.


రోగనిరోధక శక్తి, యాంటీఆక్సిడెంట్లు: టీలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. శరీరానికి మేలు చేసే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను పెంచి, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.


మెదడు పనితీరు, ఏకాగ్రత: టీలో ఉండే ‘ఎల్-ధియనిన్’ (L-Theanine) అనే అమైనో ఆమ్లం కేఫీన్‌తో కలిసి మెదడును చురుగ్గా ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. కాఫీలా కాకుండా టీలోని కేఫీన్ నెమ్మదిగా శరీరంలోకి ఇంగుతుంది. దానివల్ల శారీరక ఒత్తిడి లేని స్థిరమైన శక్తి లభిస్తుంది.


జీర్ణక్రియ & బరువు నియంత్రణ: టీ తాగడం వల్ల శరీరంలో జీవక్రియలు (Metabolism) వేగవంతమై బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.


చర్మం, ఎముకల ఆరోగ్యం: టీలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడతాయి. రెగ్యులర్‌గా హెర్బల్ టీలు తాగడం వల్ల ఎముకల సాంద్రత (Bone Density) మెరుగుపడి, వయసుతో పాటు వచ్చే ఎముకల బలహీనత తగ్గుతుంది.


నోటి ఆరోగ్యం: కొన్ని రకాల టీలలో సహజ సిద్ధమైన ఫ్లోరైడ్, పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి పళ్లపై బ్యాక్టీరియా చేరకుండా చూసి చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి.


వివిధ రకాల టీలు - వాటి ఆరోగ్య ఉపయోగాలు గ్రీన్ టీ: శరీరంలో క్యాలరీలను కరిగించి బరువు తగ్గడానికి, కడుపు ఉబ్బరం నివారించడానికి, చర్మ అలర్జీలు, మొటిమలను తగ్గించడానికి ఇది బాగా సహాయపడుతుంది.


పెప్పర్‌మింట్ టీ/ పుదీనా టీ: జీర్ణ సమస్యలు, వికారం, కడుపు ఉబ్బరం, పిఎమ్‌ఎస్ సమస్యలు, నోటి దుర్వాసనను అరికట్టడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది.


ఊలాంగ్ టీ: మెటబాలిజాన్ని వేగవంతం చేసి, కొవ్వును కరిగించడంలో, బరువును సమర్థవంతంగా అదుపు చేయడంలో తోడ్పడుతుంది.


మాచా టీ: ఇది గ్రీన్ టీ కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. పొట్ట భాగంలోని కొవ్వును కరిగించి, శరీర రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది.


వైట్ టీ: మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, చర్మ కణాలను పునరుద్ధరించడానికి, వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేయడానికి తోడ్పడుతుంది.


చామొమైల్ టీ/చామంతి టీ: రాత్రివేళ ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. తలనొప్పి, ఆందోళన, పొట్ట ఉబ్బరం నుండి మంచి ఉపశమనం ఇస్తుంది.


హిబిస్కస్ టీ/మందార టీ: అధిక రక్తపోటు సమస్య ఉన్న వారికి ఇది చాలా మంచిది. శ్వాసకోశ వ్యాధులను తగ్గించడంలో కూడా దోహదపడుతుంది.


మసాలా టీ/సాధారణ టీ: దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలతో చేసే ఈ టీ శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. వాపు, జలుబుతో పోరాడుతుంది.


బ్లాక్ టీ: మానసిక ఒత్తిడిని, తలనొప్పిని తగ్గిస్తుంది. అధ్యయనాల ప్రకారం బ్లాక్ టీ వాసన చూడటం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుందని తేలింది.


అల్లం టీ: కడుపు నొప్పి, ఉబ్బరం, జలుబు, గొంతు నొప్పి, ప్రయాణాలలో వచ్చే వికారం నుండి తక్షణ ఉపశమనం అందిస్తుంది.


తులసి టీ: శరీరంలో స్ట్రెస్ హార్మోన్లను అదుపు చేస్తుంది, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరకు సంబంధించిన స్థాయిలను అదుపులో ఉంచుతుంది.


లెమన్ గ్రాస్ టీ: శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్తపోటును సమతుల్యంగా ఉంచడానికి పనిచేస్తుంది.


ముఖ్యమైన గమనికలు


పరిమితి మంచిది: రోజుకు రెండు సార్లు మాత్రమే, తక్కువ మోతాదులో టీ తాగడం ఆరోగ్యానికి మంచిది.


​ఎక్కువగా తాగడం హానికరం: ఎక్కువ సార్లు లేదా ఎక్కువ మోతాదులో టీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.


​భోజనం చేసిన వెంటనే వద్దు: అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు. ఇలా చేయడం వల్ల శరీరానికి పోషకాహార, విటమిన్ లోపాలు వచ్చే అవకాశం ఉంది.


​ఐరన్ & క్యాల్షియం లోపం ఉన్నవారు జాగ్రత్త: శరీరంలో ఐరన్ (ఇనుము), క్యాల్షియం లోపం ఉన్నవారు టీ, కాఫీలను తీసుకోకపోవడమే మంచిది.


వాణీ అయోధ్య క్లినికల్‌ డైట్‌ కన్సల్టంట్‌ 99593 61180

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్