Magazines

ఆహా ప్రేమ! ఓహో ప్రేమ!

48 నిమిషాల క్రితం

Ah, love! Oh, love!
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 3 నిమిషాల చదవడం

ప్రేమకు ప్రేమగా అర్థం చెప్పాల్సి వస్తే ప్రేమే. ప్రేమ అసాధారణం. ప్రేమ అలౌకికం. ప్రేమ అజరామరం. ప్రేమ ఎప్పుడూ ప్రేమను ప్రేమగా చూసుకుంటుంది. ప్రేమ అప్పుడప్పుడు ప్రేమగా అపార్థం చేసుకుంటుంది. ప్రేమ ప్రేమగా వుంటుంది. ప్రేమ ప్రేమగా వుండదు. ఈ లోకాన్ని నిలబెట్టేదీ, తగలెట్టేదీ, ఏడిపించేదీ, నవ్వించేదీ, కవ్వించేదీ, హింసించేదీ ప్రేమే. ప్రేమ కాక మరొకటి కానే కాదు. ప్రేమ ఎన్ని రకాలో, ప్రేమకి ఎన్ని రూపాలో ప్రేమకి ఎన్ని రంగులో ప్రేమని ప్రేమగా అడిగినా చెప్పలేదు. తన గురించి తాను తెలుసుకోవడం కోసం తపించే ఆత్మ వంటిదే ప్రేమ. ప్రేమ కోసం మనుషులు ఏమైనా అయిపోతారు. ఏమైనా చేస్తారు. ప్రేమను ప్రేమగా పెంచి పోషించడం కోసం కొందరు ఆదర్శ ప్రేమికులు ప్రజాప్రతినిధులు అవుతారు. ప్రజల మీద ప్రేమతో ప్రజా పాలకులవుతారు. ప్రజల మీద ప్రేమ చావక కదా కొందరు ప్రతిపక్షాలు అవుతారు. మామూలు సాదాసీదా షరా మామూలు ప్రేమ సంగతి ప్రేమగా వదిలేద్దాం. అసాధారణ అలౌకిక అజరామరమైన ప్రేమ సంగతినే ప్రేమగా ప్రస్తావిద్దాం. ఈ భూమ్మీద అనేక రకాల ప్రేమలున్నాయి. ఈ అన్నిరకాల ప్రేమల్లో అనేకమైన ప్రజాసమూహం మీద అపారమైన అనిర్వచనీయమైన ప్రేమ వున్న మానవులే ప్రజల ప్రేమ కోసం ప్రజల సేవ కోసం శ్రమైక జీవులవుతారు. ప్రజల మీద ప్రేమతో పండిపోతారు, అసెంబ్లీలో పార్లమెంటులో నిండిపోతారు. ఈ ప్రజాప్రేమికులు ఇన్నో అన్నో కొన్నో కలిసొస్తే అధికారంలోకి వస్తారు. కాకపోతే ఎన్నో కొన్ని కలిసి రాకపోతే ప్రతిపక్షంలో వుండి ప్రజలమీది ప్రేమను ప్రేమగా పెంచి పోషిస్తారు. అన్ని ప్రేమలకూ అతీతమయిన ఈ ప్రేమ థియరీ అంత సులువుగా అర్థం అయ్యేది కాదు. ‘అర్థమే పరమార్థమయిన’ ఈ ప్రేమ శబ్దార్థ నిఘంటువుకు కాని బహుభాషా డిక్షనరీలకు కాని అందేది కాదు.

ఓట్ల యంత్రంలో కుసుమించి పదవిలో ఫలించే ఈ ప్రేమతత్వం సామాన్య ప్రజానీకానికి అర్థం అయ్యే వీలేలేదు. దూషణ భూషణ తిరస్కారాలకు అతీతమైన ఈ ప్రేమ ఎప్పుడు ఎలా ఏ రూపంలో సాక్షాత్కరిస్తుందో ఎంత ప్రేమగా తర్కించి వితర్కించినా విశదం అవదు. ప్రజలను విపరీతంగా ప్రేమించే వాళ్లు ప్రజా సమస్యల్ని ఎంతగా ప్రేమిస్తారో అని ప్రేమే ఆశ్యర్య పడుతుంది. ప్రజలకు సమస్యలు లేకపోతే ప్రేమకి అవకాశం వుండదని, ప్రేమ నీరాజనానికి అవకాశం చిక్కదని, సమస్యలకు నారు నీరు పోసి పెంచడం మీద ప్రేమ పెంచుకుని ప్రేమగా అధికారం చలాయిస్తారు కొందరు ప్రేమానంద జీవులు. వీరి ప్రేమ రూపాయికి బియ్యం అవుతుంది. ప్రేమ పేదలకు లక్షల ఇళ్లవుతుంది. ప్రేమ నిరుద్యోగుల పాలిటి కల్పవృక్షమవుతుంది. ప్రేమ మహిళల కోసం వడ్డీలేని రుణం అవుతుంది. ప్రేమ మహిళల కోసం ఉచిత బస్సు అవుతుంది. ప్రేమ అన్ని తరగతుల జనం కోసం వరాల వర్షం అవుతుంది. ప్రేమ అల్లావుద్దీన్‌ అద్భుత దీపమవుతుంది. ప్రేమ అరచేతిలో వైకుంఠం అవుతుంది. ఎన్నికల ముందయితే ఈ ప్రేమకు హద్దులూ పద్దులూ అసలు వుండనే వుండవు.

ప్రేమంటే ఇదేరా’ ఇంతకు మించిన ప్రేమే లేదురా అనిపించే ఈ ప్రేమ నిజం ప్రేమ కాదని, అసలు ప్రేమే కాదని ప్రేమ పథకాలు, హామీలు ఒట్టి బూటకపు డ్రామాలని, ఇదే ప్రేమనుకుంటే మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకోవడమేనని అనే దుర్మార్గులు వుండకపోరు. ఇది ప్రేమ అనే పదం పుట్టుక నాటినుంచీ వున్నదే. ప్రేమని వ్యతిరేకించని వారెవరుంటారు కనుక. అధికారంలో వుండి ప్రజల కోసమే పదవుల ముళ్లకిరీటం నెత్తిన భరిస్తూ ప్రజల మీద ప్రేమతో ఏమైనా ఏదైనా చేసే వాళ్లే కాదు, ప్రజలు ఛీ ఛా అని చిరాకుపడి దులపరించిన వాళ్లకు కూడా ప్రజల మీద నమ్మకమూ వుంటుంది కనుక త్రాసులో వేసి తూస్తే అధికార పక్షం ప్రేమ కన్నా ప్రతిపక్షపు ప్రేమ భారం బరువుగానే వుంటుంది. అధికారం లేకున్నా పదవులు లేకున్నా ప్రజలను అధికార పక్షపు ప్రేమికుల కన్నా అమితంగా అడ్డగోలుగా ప్రేమించడం ప్రతిపక్షపు పార్టీ సభ్యులకు మాత్రమే తెలిసిన ప్రేమ. ఇది అందని ద్రాక్షపండ్ల ప్రేమ కాదు. తాము అధికారం చలాయించినప్పుడు ఒళ్లు మరిచి చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రేమ. ఇది పశ్చాత్తాపపు ప్రేమ, అధికారంలో వున్నప్పుడు తాము దూరం పెట్టిన వాళ్లందరినీ సునామీలా ముంచే ప్రేమ. ఎల్లలు లేని ప్రేమ. ఎక్కడ సమస్య కనిపిస్తే అక్కడికి కుప్పించి ఎగసే ప్రేమ. ఎక్కడ సమస్య కనిపించకపోతే అక్కడ సమస్యని సృష్టించే ప్రేమ. ఇలా ఈ ప్రేమ గురించి ఎంత ప్రేమగా చెప్పినా ప్రేమ తరగదు. ఈ ప్రేమతత్వపు తుదీ మొదలూ వెదికి పట్టుకోవడం సాధ్యం అవదు. కళ్లు తెరవండి. ఈ ప్రేమ విశ్వరూపం దర్శించండి... తరించండి.


చింతపట్ల సుదర్శన్‌, 9299809212

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్